లోన్‌యా్‌ప మోసగాళ్లు అరెస్టు

ABN , First Publish Date - 2022-10-05T08:11:59+05:30 IST

లోన్‌యా్‌ప మోసగాళ్లు అరెస్టు

లోన్‌యా్‌ప మోసగాళ్లు అరెస్టు

తెలంగాణకు చెందిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్న కడప పోలీసులు

కడప (క్రైం), అక్టోబరు 4: లోన్‌ యాప్‌ల పేరిట భారీగా వసూళ్లకు పాల్పడడమే కాకుండా.. కుటుంబ సభ్యుల నగ్న ఫొటోలను బయటపెడతామని బెదిరిస్తున్న సైబర్‌ మోసగాళ్లు కడప పోలీసులకు చిక్కారు. దీనికి సహకరించిన క్రెడిట్‌కార్డు కాల్‌ సెంటర్‌ యజమానితోపాటు తెలంగాణకు చెందిన ఐదుగురిని సీకే దిన్నె, సైబర్‌ సెల్‌ పోలీసులు అరెస్టు చేశారు. కడప ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ కథనం ప్రకారం... కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం ఎర్రమాచుపల్లె గ్రామానికి చెందిన బండి సాయికుమార్‌రెడ్డి.. దేవేంద్ర సిమెంట్స్‌లో మార్కెటింగ్‌ మేనేజరుగా పనిచేసున్నాడు. ఈ ఏడాది జనవరిలో ఆయన రూపీస్‌ క్యాష్‌, రూపీస్‌ లోన్‌ అనే యాప్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో రూ.95 వేలు లోన్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. కంపెనీ నిబంధనల ప్రకారం ముందుగానే కొంత మొత్తాన్ని మినహాయించుకుని సాయికుమార్‌రెడ్డి ఖాతాలో రూ.65 వేలు మాత్రమే జమ చేశారు. ఆ తర్వాత నుంచి లోన్‌యా్‌ప్‌ ఏజెంట్లు సాయికుమార్‌రెడ్డిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో లోన్‌ కట్టకపోతే ఫోన్‌లో సేవ్‌ అయి ఉన్న నంబర్లకు ఆయన కుటుంబసభ్యుల ఫొటోలను నగ్నంగా మార్ఫింగ్‌ చేసి పెడతామని బెదిరించారు. ఇలా అతని వద్దనుంచి ఇప్పటివరకు రూ.3,71,952 వసూలు చేశారు. అయినా ఇంకా బాకీ చెల్లించాలంటూ ఫోన్లు చేస్తుండడంతో సాయికుమార్‌ ఏప్రిల్‌ 19న సీకేదిన్నె పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సైబర్‌ క్రైం బృందంతో కలిసి నిందితులపై నిఘా పెట్టిన సీకే దిన్నె పోలీసులు.. ఫోన్‌ కాల్స్‌ ఆధారంగా క్రెడిట్‌ కార్డ్‌ కాల్‌ సెంటర్‌ యజమానితో పాటు మరో నలుగురిని అరెస్టు చేసి, రిమాండుకు తరలించామని ఎస్పీ తెలిపారు. అరెస్టయిన వారిలో తెలంగాణలోని కొత్తగూడెం జిల్లాకు చెందిన సుతారపు సాయికుమార్‌, పాలకొల్లు సాయితేజ, నాగర్‌కర్నూలు జిల్లా వాసి జుటుక శివ, హైదరాబాద్‌కు చెందిన నల్లోలు నవీన్‌గౌడ్‌, పూరిమిట్ల శ్రీకాంత్‌ ఉన్నారు.

Updated Date - 2022-10-05T08:11:59+05:30 IST