కోట్లు కుమ్మేద్దాం!

ABN , First Publish Date - 2022-07-25T07:58:58+05:30 IST

కోట్లు కుమ్మేద్దాం!

కోట్లు కుమ్మేద్దాం!

భూముల విలువపై 4 రెట్లు పిండేందుకు నేతల స్కెచ్‌ 

నూజివీడు ట్రిపుల్‌ ఐటీకి కట్టబెట్టేందుకు ప్లాన్‌ 

ఎకరం ధర 30 లక్షలు.. అమ్మేది రూ.1.20 కోట్లకు 

ఆ భూములు అగ్ర సినీ నిర్మాత, పారిశ్రామికవేత్తవి

స్థానిక నేత, మరో నాయకుడి కుమార్తె పైరవీలు

అవసరం లేకున్నా ప్రభుత్వం కొనేలా ప్రయత్నం

ఢిల్లీ స్థాయిలో చక్రం.. సహకరిస్తున్న అధికారులు 

వాటాల పంపకానికి ముందే ఒప్పందాలు


అక్కడ ఎకరం ధర దాదాపు రూ.30 లక్షలు. ప్రభుత్వానికి ఏకంగా రూ.1.20 కోట్లకు కట్టబెట్టేందుకు స్కెచ్‌ వేశారు. ఆ భూముల యజమానులు ఓ అగ్ర సినీ నిర్మాత, పారిశ్రామిక వేత్త. ఓ అధికార పార్టీ నాయకుడు, మరో నాయకుడి కుమార్తె వారితో చేతులు కలిపారు. అవసరం లేకున్నా నూజివీడు ట్రిపుల్‌ ఐటీ విద్యా సంస్థతో అధిక ధరకు కొనుగోలు చేయించేందుకు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఆదాయాన్ని అంతా కలసి పంచుకోవడానికి ముందే వాటాలు కూడా వేసుకున్నారని తెలుస్తోంది.


(ఏలూరు/నూజివీడు-ఆంధ్రజ్యోతి)

నూజివీడు ట్రిపుల్‌ ఐటీ విద్యా సంస్థను 110 ఎకరాల విస్తీర్ణంలో సకల సౌకర్యాలతో ఏర్పాటు చేశారు. పదేళ్లు పూర్తి చేసుకున్న ఈ విద్యా సంస్థలో కృష్ణా, గుంటూరు తదితర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు సుమారు 7 వేల మందికి పైగా విద్యనభ్యసిస్తున్నారు. ఉత్తరాంధ్రలోని  శ్రీకాకుళం, విశాఖపట్నం పరిసరాలకు చెందిన విద్యార్థులు మరో 2 వేలమంది ఉన్నారు. ఈ కాలేజీలో అవసరమైన భవనాలు, వసతులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ విద్యా సంస్థకు అదనపు హంగులు అవసరం లేదు. అయినా ఆ పరిసరాల్లో ఉన్న సుమారు 50 ఎకరాలను కొనుగోలు చేయించాలనే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ట్రిపుల్‌ ఐటీకి కట్టబెట్టాలని చూస్తున్న భూములు పెద్దగా ఉపయోగంలో లేవనే చెప్పాలి. వాటిలో ఉసిరి, ఇతర అరకొర పంటలు సాగు చేస్తున్నారు.  ఓ అగ్ర సినీ నిర్మాత భార్య, తల్లి పేరిట 30 ఎకరాలు, ఓ పారిశ్రామికవేత్తకు 10 ఎకరాలకు పైగా భూమి ఉంది. ఈ భూములను ప్రభుత్వంతో అధిక ధరలకు కొనుగోలు చేయించేందుకు వారిద్దరూ ప్రయత్నిస్తున్నారని సమాచారం. ప్రస్తుత అధికార పార్టీ నాయకులతో లాలూచీలు మొదలుపెట్టారు.ఇందుకు కొందరు స్థానిక రాజకీయ నాయకులు, అధికారులు సహకరిస్తున్నారని తెలుస్తోంది. 


నూజివీడులో తాత్కాలిక విద్యార్థులు 

నూజివీడు, ఇడుపులపాయలోని ట్రిపుల్‌ ఐటీల్లో సీట్లు పెంచాలని గత ప్రభుత్వ హయాంలో డిమాండ్లు వచ్చాయి. అప్పటి పరిస్థితుల్లో సీట్లు పెంచే అవకాశం లేకపోవడంతో ఉత్తరాంధ్రలోని 2 వేలమంది విద్యార్థులను నూజివీడుకు, ఒంగోలు ట్రిపుల్‌ ఐటీలో సీట్లు సాధించిన మరో 2 వేలమందిని కడప జిల్లాలోని ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీకి మార్చారు. ఇలా విద్యార్థులను చేర్చి ఆరేళ్లు గడుస్తోంది. కాగా ఒంగోలు, శ్రీకాకుళంలో భవనాలకు నిధుల్లేక నిర్మాణాలు సగంలోనే ఆగిపోయాయి. నిధులు సమకూర్చి ఆ భవనాలను పూర్తి చేస్తే నూజివీడు, ఇడుపులపాయలో చదువుకుంటున్న విద్యార్థుల్లో 4 వేల మంది ఆ జిల్లాలకు తిరిగి వెళ్లిపోతారు. ప్రస్తుతం నూజివీడులో శ్రీకాకుళం క్యాంప్‌సకు చెం దిన రెండు, మూడో సంవత్సరం ఇంజనీరింగ్‌ చదువుతున్న 2 వేలమంది విద్యార్థులు నాలుగో సంవత్సరానికి చేరుకున్నాక తిరిగి శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలో చేరతారు. కేవలం రెండేళ్ల కాలపరిమితితో వచ్చిన విద్యార్థులు తిరిగి వెళ్లిపోతే, నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో కొ న్ని సీట్లు ఖాళీగా ఉంటాయి. ఇవన్నీ తెలిసీ కొందరు నాయకులు అవసరం లేకున్నా భూసేకరణ పేరిట కోట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 


ఢిల్లీ స్థాయిలో పావులు

భూసేకరణకు ఢిల్లీ స్థాయిలో నాయకులు పావులు కదుపుతున్నారని ప్రచారం ఉంది. సెలబ్రిటీల భూములను అధిక ధరలకు ప్రభుత్వానికి అంటగట్టేందుకు రాష్ట్రస్థాయిలోనూ మంత్రాంగం నడుస్తోందని తెలుస్తోంది. అనధికారిక ఒప్పందాల్లో ఎకరాకు రూ.1.20 కోట్లు ప్రభుత్వం చెల్లించే విధంగా నిర్ణయాలు జరుగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. గతంలో నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో పనిచేసి సస్పెండ్‌ అయిన ఒక వ్యక్తి, గతంలో వైసీపీలో పనిచేసిన ఓ ప్రముఖ నాయకుడి కుమార్తె, స్థానిక అధికార పార్టీ బడా నాయకుడు, ఢిల్లీ స్థాయిలో మరొకరు కొనుగోలు వ్యవహారంలో సూత్రధారులుగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. అనుకున్న విధంగా విక్రయాలు చేయిస్తే వచ్చే లాభాల్లో నాయకుడి కుమార్తెకు ఎకరాకు రూ.10 లక్షలు, స్థానిక బడా నాయకుడికి రూ.20 లక్షలు, సహకరించిన అధికారులకు, ఇతర యంత్రాంగానికి కలిపి ఎకరాకు రూ.10 లక్షలు చొప్పున వాటాలుగా పంచుకునేందుకు ఒప్పందాలు జరిగాయని సమాచారం. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక శాఖ వద్ద ఆ భూముల ఫైల్‌ ఉంది. మంత్రి అంగీకారం అనంతరం కేంద్ర ఆర్థిక శాఖకు బదిలీ చేయించి, అనుమతులు పొందేందుకు కార్యాచరణ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. భూసేకరణపై నూజివీడు ట్రిపుల్‌ ఐటీ ఉన్నతాధికారులు నర్మగర్భంగా మాట్లాడుతున్నారు. సరైన సమాధానం చెప్పడం లేదు. ట్రిపుల్‌ ఐటీ చాన్సలర్‌ కె.సి.రెడ్డిని వివరణ కోరగా.. ‘యూనివర్సిటీకీ ఎలాంటి సంబంధం లేదు. భూములు మేం  అడగలేదు’ అని చెప్పారు.

Read more