సర్కారు బడికి రాంరాం!

ABN , First Publish Date - 2022-08-10T09:30:09+05:30 IST

అనుకున్నంతా అయింది. పాఠశాలల్లో తరగతుల విలీనం ప్రభుత్వ బడులపై తీవ్ర ప్రభావం చూపింది.

సర్కారు బడికి రాంరాం!

  • విలీనం దెబ్బకు ఎన్‌రోల్‌మెంట్‌ ఢమాల్‌ 
  • 6 లక్షల మంది విద్యార్థులు బడికి దూరం?
  • ప్రభుత్వ అంచనాలు పూర్తిగా తలకిందులు 
  • విద్యాకానుక అంచనా 47.4 లక్షల మంది
  • ప్రస్తుతం బడుల్లో ఉన్నది 41.2 లక్షల మందే 
  • టీసీలు కూడా తీసుకోకుండానే ప్రైవేటు బాట 
  • నెపాన్ని టీచర్లపైకి నెట్టేందుకు సర్కారు యత్నం

(అమరావతి-ఆంధ్రజ్యోతి): అనుకున్నంతా అయింది. పాఠశాలల్లో తరగతుల విలీనం ప్రభుత్వ బడులపై తీవ్ర ప్రభావం చూపింది. సర్కారు అంచనాలను తలకిందులు చేస్తూ ఏకంగా 6 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ బడులకు రాంరాం చెప్పేశారు. ఈ ఏడాది జగనన్న విద్యాకానుక కిట్లను 47.4 లక్షల మందికి ఇవ్వాలని అంచనా వేయగా ఈ ఆగస్టు 1వ తేదీ నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 41.2 లక్షలు మాత్రమే ఉంది. ఆరో తరగతి విద్యార్థుల సంఖ్య గతంలో కంటే పెరిగి సాధారణ స్థితికి వచ్చినా, ఒకటో తరగతిలో నమోదు చాలా తక్కువగా కనిపిస్తోంది. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల నమోదుకు ఈ నెలాఖరు వరకు గడువు ఉన్నందున ఈ సంఖ్య స్వల్పంగా పెరిగి 42 లక్షలకు చేరినా 5లక్షలకు పైగా లోటు ఉంటుందని భావిస్తున్నారు. 2021-22 విద్యా సంవత్సరంలో 45.71 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చదువుకున్నారు. ఈ గణాంకాల ప్రకారం చూసినా ఈసారి 4.55 లక్షల మంది బడికి దూరమయ్యారు. 


విలీనంతో ఆందోళన.. ఈ ఏడాది ప్రాథమిక పాఠశాలల్లో చేపట్టిన తరగతుల విలీన ప్రక్రియ తీవ్ర గందరగోళానికి కారణమైంది. 5,870 ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతుల విద్యార్థులను ఒక కిలోమీటరు పరిధిలో ఉన్న ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తున్నారు. చిన్న పిల్లలను దూరం పంపలేమని బడులు తెరిచిన రోజు నుంచే విద్యార్థుల తల్లిదండ్రులు పెద్దఎత్తున ఆందోళనలకు దిగారు. ఈ ప్రక్రియ ప్రాథమిక విద్యావ్యవస్థను గందరగోళం చేస్తుందని ఉపాధ్యాయ సంఘాలు గగ్గోలు పెట్టాయి. కానీ విధానపర నిర్ణయంలో వెనక్కి తగ్గేది లేదంటూ ప్రభుత్వం విలీనంపై మొండిగా ముందడుగు వేసింది. దీంతో ఈ విద్యాసంవత్సరం ప్రారంభం నుంచే ప్రభుత్వ బడుల్లో ఎన్‌రోల్‌మెంట్‌పై ఆందోళన మొదలైంది. దాదాపు 10శాతం విద్యార్థులు ప్రైవేటు బాట పట్టే ప్రమాదం ఉందని ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరించాయి. అంత దూరం పంపడం తప్పదనుకుంటే మా పిల్లలకు ప్రభుత్వ బడి అక్కర్లేదంటూ అనేకచోట్ల తల్లిదండ్రులు తెగేసి చెప్పారు. అందుకు అనుగుణంగానే ప్రైవేటు పాఠశాలలకు క్యూ కట్టారు.


టీసీ సంగతి తర్వాత... 

ఈ ఏడాది తల్లిదండ్రుల నుంచి టీసీలకు భారీగా డిమాండ్లు వచ్చాయి. కొంతకాలం వేచిచూడాలని ఎక్కడికక్కడ ఉపాధ్యాయులు వారిని ఒప్పించి, ప్రభుత్వ బడుల నుంచి ప్రైవేటుకు వెళ్లేవారి సంఖ్యను తగ్గించేందుకు ప్రయత్నించారు. దీంతో టీసీ సంగతి తర్వాత చూద్దాం అన్నట్టుగా తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రైవేటు బడులకు పంపుతున్నారు. కానీ ప్రభుత్వ బడుల్లో ఎప్పటిలాగే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్‌ చేయడంతో ఇంకా అక్కడే ఉన్నట్లుగా లెక్కలు చూపిస్తున్నాయి. ఏడో తరగతి వరకూ టీసీల్లేపోయినా వేరే బడుల్లో చేర్పించే వీలుంటుంది. కొంతకాలం తర్వాత ఫలానా విద్యార్థి తమ బడిలో చేరారని, వారి పేరు తొలగించాలని ప్రైవేటు పాఠశాలలు ఆ విద్యార్థి ఎన్‌రోల్‌ అయిన బడికి విజ్ఞప్తి చేస్తాయి. అప్పుడు ప్రభుత్వ పాఠశాల నుంచి ఆ విద్యార్థి పేరు డిలీట్‌ అవుతుంది. ఈ ప్రక్రియ ముగిస్తే సర్కారు బడుల్లో విద్యార్థులసంఖ్య ఇంకా తగ్గే ప్రమాదం ఉంది. 


విద్యార్థుల ఆధారంగానే రేషనలైజేషన్‌ 

పాఠశాలల రేషనలైజేషన్‌ ప్రక్రియ జూలై 31న ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగానే ఉంటుందని విద్యాశాఖ ఇటీవల స్పష్టం చేసింది. ఆ తేదీనే ప్రామాణికంగా తీసుకుంటే ప్రభుత్వ ఉపాధ్యాయుల మిగులు సంఖ్య ఇంకా పెరుగుతుంది. గతేడాది ఉన్నంత మంది విద్యార్థులు ఉంటేనే రేషనలైజేషన్‌లో భాగంగా సుమారు 16,500 మంది టీచర్లు మిగిలిపోతున్నారని ప్రభుత్వం అంచనా వేసింది. వారిలో 6లక్షల మంది విద్యార్థులు తగ్గిపోతే ఉపాధ్యాయుల అవసరం ఇంకా తగ్గుతుంది. 


కొవిడ్‌తో వచ్చిన వారంతా వెనక్కి 

కరోనా సమయంలో తరగతులు లేకపోవడంతో ప్రైవేటులో ఫీజులు కట్టడం అనవసరమనే భావనతో చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని ప్రభుత్వ బడుల్లో చేర్పించారు. దీంతో ఆప్పట్లో సర్కారు బడులకు కొత్త విద్యార్థులు వెల్లువలా వచ్చారు. ఇదంతా తమ ఘనతేనని వైసీపీ ప్రభుత్వం డబ్బా కొట్టుకుంది. నాడు-నేడు పనులతో విద్యార్థులు భారీగా ప్రభుత్వ బడుల్లో చేరుతున్నారని ప్రకటించుకుంది. కాగా ఈ విద్యా సంవత్సరంలో కొవిడ్‌ కనుమరుగు కావడంతో అప్పట్లో వచ్చినవారు ఇప్పుడు తిరిగి ప్రైవేటుకు వెళ్లిపోతున్నారు. ఈ ఏడాది అమ్మఒడి నగదును సరిగ్గా బడులు తెరిచే సమయంలోనే వేయడం కూడా విద్యార్థులు  ప్రైవేటుబాట పట్టడానికి ఒక కారణంగా కనిపిస్తోంది.

 

బొత్స వ్యాఖ్యలతో గరంగరం 

సర్కారు చర్యలతో ఎన్‌రోల్‌మెంట్‌ పడిపోయిందని అందరూ భావిస్తుంటే వైసీపీ ప్రభుత్వం మాత్రం ఆ నెపాన్ని ఉపాధ్యాయులపైకి నెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల విద్యాశాఖ మంత్రి, సంఘాల మధ్య జరిగిన సమావేశంలో ఉపాధ్యాయులు 8గంటలు ఎందుకు పనిచేయరని, వారి పిల్లలను ప్రభుత్వ బడుల్లో ఎందుకు చదివించరని మంత్రి బొత్స ప్రశ్నించారు. అంతకుముందు జరిగిన భేటీలోనూ ఉపాధ్యాయుల వల్లే ఎన్‌రోల్‌మెంట్‌ పడిపోతోందనే ప్రచారం జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలను చూస్తే ఎన్‌రోల్‌మెంట్‌ నెపాన్ని టీచర్లపైకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది. కాగా గతంలో విద్యార్థుల సంఖ్య పెరిగితే క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ప్రభుత్వం, ఇప్పుడు తగ్గితే మాత్రం తమను బాధ్యుల్ని చేయడమేంటని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.

Read more