AP News: లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ దీక్షకు వెళ్లకుండా దిగ్బంధనం

ABN , First Publish Date - 2022-09-20T03:10:08+05:30 IST

లేపాక్షి భూములను రైతులకు తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ అఖిలపక్షం సోమవారం చేపట్టిదలచిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు.

AP News: లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ దీక్షకు వెళ్లకుండా దిగ్బంధనం

హిందూపురం: లేపాక్షి భూములను రైతులకు తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ అఖిలపక్షం సోమవారం చేపట్టిదలచిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. టీడీపీ, సీపీఐ, సీపీఎం, (TDP CPI CPM) రైతు, ప్రజా సంఘాల నాయకులను ఎక్కడికక్కడ నిర్బంధించారు. భూములు ఇస్తే పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మించి మోసగించారని, ఇప్పుడు భూములను సీఎం జగన్‌ తన బంధువులకు కారుచౌకగా అప్పగించేందుకు కుట్ర చేశారని వివిధ పార్టీలు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములను రైతులకు తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ లేపాక్షి నాలెడ్జ్‌హబ్‌ నిర్వాసిత రైతుల హక్కుల పరిరక్షణ వేదిక, అఖిలపక్షం ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ రూపొందించారు. ఇందులో భాగంగా సోమవారం నుంచి కొడికొండ చెక్‌పోస్టు వద్ద దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. దీనికి పోలీసులు అనుమతించలేదు. అయినా వెనక్కు తగ్గేది లేదని ఉద్యమ నాయకులు ప్రకటించారు.


దీంతో పోలీసులు ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ హౌస్‌ అరెస్టులు, అరెస్టులు కొనసాగించారు. టీడీపీ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథిని రొద్దం మండలం మరువపల్లిలో, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణను హిందూపురంలో హౌస్‌ అరెస్ట్‌ చేశారు. దీక్షకు తరలుతున్న సీపీఐ నాయకులను హిందూపురంలో అడ్డుకుని, టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. చిలమత్తూరులో టీడీపీ, సీపీఎం నాయకులను సోమవారం ఉదయమే అరెస్ట్‌ చేశారు. గోరంట్లలో సీపీఐ నాయకులను అరెస్టు చేశారు. టీడీపీ, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డిని అనంతపురంలోని ఆయన నివాసంలో పోలీసులు నిర్బంధించారు. బయటకు వెళ్లకూడదని నోటీసులు అందించారు. 


భారీగా పోలీసు బందోబస్తు 

అఖిల పక్షం దీక్షను అడ్డుకోవాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశించడంతో పోలీసులు భారీ ఎత్తున కొడికొండ చెక్‌పోస్టులో మోహరించారు. పోలీసులు ఉదయం నుంచే కొడికొండ చెక్‌పోస్టువద్ద పహారా కాశారు. హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరు, పెనుకొండ, గోరంట్ల, సోమందేపల్లి, బాగేపల్లి నుంచి వచ్చే రహదారులపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. అఖిల పక్షం నాయకులు కొడికొండ వద్ద వైపురాకుండా ఎక్కడవారిని అక్కడే అడ్డుకున్నారు. చెక్‌పోస్టు వద్దకు వెళ్లిన నాయకులను అరెస్ట్‌చేసి పోలీసులు స్టేషన్లుకు తరలించారు. సాయంత్రం తరువాత సొంత పూచీకత్తుపై వదిపెట్టారు. 

Updated Date - 2022-09-20T03:10:08+05:30 IST