సచివాలయాలకు చట్టబద్ధత

ABN , First Publish Date - 2022-12-13T03:26:18+05:30 IST

గ్రామ/వార్డు సచివాలయాల వ్యవస్థకు చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్రప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఈ నెల 5న దీనిని ఆమోదించగా.. 7వ తేదీన ఆర్డినెన్స్‌ (12)ను జారీచేసింది.

సచివాలయాలకు చట్టబద్ధత

5నే గవర్నర్‌ ఆమోదం.. 7న ఆర్డినెన్స్‌ జారీ

అమరావతి, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): గ్రామ/వార్డు సచివాలయాల వ్యవస్థకు చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్రప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఈ నెల 5న దీనిని ఆమోదించగా.. 7వ తేదీన ఆర్డినెన్స్‌ (12)ను జారీచేసింది. గ్రామీణ, పట్టణ ప్రజలకు 540 రకాల సర్వీసులను అందించేందుకు పంచాయతీరాజ్‌, పట్టణాభివృద్ధిశాఖలతో పాటు గ్రామ/వార్డు సచివాలయాల శాఖకు కూడా చట్టబద్ధత కల్పించాలని గతంలోనే నిర్ణయించింది. 540 కంటే ఎక్కువ సేవలు అందించేందుకు గ్రామ/వార్డు సచివాలయాలకు వీలు కల్పిస్తూ పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ వ్యవస్థలకు అనుబంధంగా సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఒకే చోట సేవలను అందించే కేంద్రంగా పనిచేసేందుకు ఒక వ్యవస్థ ఏర్పాటు అత్యవసరమైనందున దీనిని తీసుకొచ్చినట్లు ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు. ఈ కొత్త ప్రభుత్వ సంస్థ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ, మున్సిపల్‌ శాఖ, సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వుల ద్వారా అమల్లోకి వచ్చిందని.. ఈ వ్యవస్థ ఏ విధంగాను సంబంధిత గ్రామీణ లేదా పట్టణ స్థానిక సంస్థల అధికారాల్లో జోక్యం చేసుకోదని తెలిపారు. శాసనమండలి సమావేశంలో లేనందున ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది.

Updated Date - 2022-12-13T03:26:19+05:30 IST