మిగిలింది సున్నా!

ABN , First Publish Date - 2022-11-30T23:05:33+05:30 IST

ఈ చిత్రంలో కనిపిస్తున్నది కలెక్టరేట్‌ ప్రాంగణంలో ఉన్న కర్నూలు మండల వ్యవసాయాధికారి కార్యాలయం.

     మిగిలింది సున్నా!

సున్నా వడ్డీ పథకానికి భారీ కుదుపు

నిబంధనల కఠినతరం

పంట సాగు చేసింది 6 లక్షల మంది

70 వేల మందికే అర్హత

రైతుల్ని ఆదుకునే తీరు ఇదేనా..?

ఈ చిత్రంలో కనిపిస్తున్నది కలెక్టరేట్‌ ప్రాంగణంలో ఉన్న కర్నూలు మండల వ్యవసాయాధికారి కార్యాలయం. ఈ కార్యాలయ పరిధిలో 12 వేల మంది దాకా రైతులు ఉన్నారు. దాదాపు ఆరు వేల మంది 2021 ఖరీఫ్‌లో పంట సాగు కోసం వివిధ బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారు. ప్రభుత్వం జారీ చేసిన కొత్త నిబంధనల కారణంగా వడ్డీని బ్యాంకులకు మార్చి నెలాఖరులోనే చెల్లించారు. సోమవారం ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి సున్నా వడ్డీ మొత్తాన్ని వారి ఖాతాలకు జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంతో రైతులు పరుగు పరుగున ఈ కార్యాలయానికి వచ్చారు. ఈ కార్యాలయంతోపాటు మిగతా గ్రామాల్లోని రైతుభరోసా కేంద్రాల్లో నోటీసు బోర్డులో అతికించిన జాబితాలలో అర్హుల పేర్లు లేకపోవడంతో లబోదిబోమన్నారు.

కర్నూలు (అగ్రికల్చర్‌), నవంబరు 28: ఉమ్మడి జిల్లాలో 54 మండలాల్లో దాదాపు ఆరు లక్షల మంది రైతులు పంట సాగుపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వీరిలో దాదాపు నాలుగు లక్షల మంది రైతులు పంట సాగు కోసం బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కష్టాల్లో ఉన్న రైతులకు ఉపశమనం కలిగించే విధంగా సున్నా వడ్డీ పథకాన్ని అమలులోకి తెచ్చింది. ఈ పథకం వల్ల రూ.లక్షలోపు పంట రుణం తీసుకున్న రైతులకు వడ్డీని ఏడు శాతం ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైతులు పంట చేతికి అందిన తర్వాత మార్చి నెలాఖరుకు అసలు చెల్లించాలి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పథకానికి తూట్లు పొడిచే ప్రయత్నాలు మొదలయ్యాయి. జిల్లాలో దాదాపు నాలుగు లక్షల మంది రైతులు ఖరీఫ్‌లో తీసుకున్న పంట రుణాలకు సంబంధించి రూ.3.62 కోట్లు, రబీలో తీసుకున్న పంట రుణాలకు సంబంధించి రూ.1.70 కోట్లు బ్యాంకులకు వడ్డీ కింద చెల్లించాల్సి ఉంది. దాదాపు ఎనిమిది నెలల నిరీక్షణ తర్వాత నింపాదిగా 2020 రబీతోపాటు 2021 ఖరీఫ్‌ సీజనలకు సంబంధించి రైతులు తీసుకున్న పంట రుణాలకుగాను వారు చెల్లించిన వడ్డీని సోమవారం ముఖ్యమంత్రి జగన రైతుల ఖాతాలకు జమ చేశారు.

లక్ష మంది రైతులేనట..

కర్నూలు మండలానికి సంబంధించి ఆరు వేల మంది రైతులు పంట రుణాల వడ్డీని బ్యాంకుకు చెల్లిస్తే.. అనేక నిబంధనలు పెట్టి 1,432 మంది రైతులనే అర్హులుగా తేల్చారు. వారి ఖాతాలకు మాత్రమే సున్నా వడ్డీ మొత్తాన్ని జమ చేశారు. కర్నూలు, నంద్యాల జిల్లాలోని 54 మండలాల్లో పంట రుణాలు తీసుకున్న ఆరు లక్షల మంది రైతులదీ ఇదే పరిస్థితి. రెండు జిల్లాల్లో ఆరు లక్షల మంది 2021 ఖరీఫ్‌లో పంట రుణాలను తీసుకుని ముందుగానే ప్రభుత్వం ఆదేశించినట్లు రూ.7,500 వంతున వడ్డీని బ్యాంకుకు చెల్లించారు. ఈ రెండు జిల్లాల్లో కలిపి నిబంధనల కారణంగా సున్నా వడ్డీ పథకానికి అర్హులైన రైతులు రూ.లక్ష లోపే ఉన్నారని చెప్పి వారికి మాత్రమే సున్నా వడ్డీని జమ చేశారు.

చెప్పిందొకటి.. చేసిందొకటి

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి అసెంబ్లీలో అడుగు పెట్టిన జగన్మోహన రెడ్డి ‘గత ప్రభుత్వ హయాంలో రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని తూతూ మంత్రంగా అమలు చేశారని... తాము అలా కాకుండా రూ.లక్ష లోపు పంట రుణం తీసుకున్న రైతులందరికీ లబ్ధి చేకూర్చేలా ఈ పథకాన్ని సమర్థగా అమలు చేస్తా’మని చెప్పారు. ముఖ్యమంత్రి జగన ఇచ్చిన హామీతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. రెండు సంవత్సరాలుగా సున్నా వడ్డీ పథకం అమలు తీరు చూస్తే పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. దీంతో ఇదేమి ఖర్మరా దేవుడా అంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారు. నిబంధనలను కఠినతరం చేయడంతో ఆరు లక్షల మంది రైతుల్లో పది శాతం మందికి కూడా సున్నా వడ్డీ పథకం వర్తించే అవకాశం లేకుండాపోయింది.

నిబంధనల కఠినతరంతో..

సున్నా వడ్డీ పథకాన్ని విడుదల చేయడానికి ముందుగా రైతులు బ్యాంకులకు రుణం మార్చిలోపు చెల్లించాలని... ఈక్రాప్‌ నమోదులో ఏ పంటను సాగు చేసి ఉంటారో దానికే బ్యాంకులో రుణం తీసుకుని ఉండాలని షరతు విధించింది. ఈ నిబంధనతో దాదాపు 90 శాతం రైతులు అర్హత కోల్పోవాల్సి వచ్చింది. వాస్తవంగా రైతు పొలంలో ఏ పంట సాగు చేసినా రుణం తీసుకుని ఉంటే వడ్డీని బ్యాంకులకు నేరుగా జమ చేయాల్సి ఉంది. ఈ పరిస్థితిని తారుమారు చేసినందు వల్ల సున్నా వడ్డీ పథకం రైతులకు ఏ మాత్రం ప్రయోజనకరంగా లేదనే విమర్శలు వెలువెత్తుతున్నాయి.

ఈక్రాప్‌తో లింకు:

ఇప్పటి దాకా రైతులు బ్యాంకుల్లో పంట సాగు కోసం రుణం తీసుకున్నారు. ఈ రుణాలకు సంబంధించి ప్రభుత్వం ఏడు శాతం వడ్డీ చెల్లించేది. తాజాగా లబ్ధిదారుల్లో కోత పెట్టేందుకు కొత్త మార్గాలను అమలు చేసేందుకు సిద్ధమైంది. బ్యాంకుల్లో రైతులు ఏ పంట సాగు కోసం రుణం తీసుకున్నారో.. ఆ పంటను మాత్రమే తప్పనిసరిగా సాగు చేయాలని, ఈ సమాచారాన్ని ఆర్‌బీకే కేంద్రాల్లోని అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం రైతులు ఏదో ఒక పంట సాగు చేస్తున్నట్లు బ్యాంకులకు సమాచారం అందించి రుణం తీసుకుంటున్నారు. ఇకపై ఆ విధంగా చేయడం కుదరదు. ఆర్‌బీకే ల ద్వారా ఈక్రాప్‌ బుకింగ్‌ సమర్థంగా అమలు చేసి... అందుకు అనుగుణంగా రుణాలు ఇచ్చే విధంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీని వల్ల రైతులకు పంట రుణం పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉంది.

ఉమ్మడి జిల్లాలో జమ చేసిన నిధులు..

కర్నూలు జిల్లాలో 10,1,093 మంది రైతుల ఖాతాలకు రూ.22.44 కోట్లను జమ చేశారు. నంద్యాల జిల్లాలో 81,294 మంది రైతులకు రూ.16.24 కోట్లను జమ చేశారు. మొత్తం రెండు జిల్లాలకు కలిపి రూ.38.68 కోట్లను జమ చేశారు.

మార్చి నెలాఖరులోగా వడ్డీ చెల్లించాలి

- కేడీసీసీ బ్యాంకు సీఈవో, రామాంజినేయులు:

ఖరీఫ్‌లో తీసుకున్న పంట రుణాలకు సంబంధించి రైతులు మార్చి నెలాఖరులోగా వడ్డీని చెల్లిస్తేనే ఈ పథకం వర్తిస్తుంది. అదేవిధంగా రూ.లక్ష లోపు రుణం తీసుకున్న వారే అర్హులవుతారు. ఈ క్రాప్‌ నమోదులో ఏ పంటను సాగు చేసి ఉంటారో అదే పంటకు బ్యాంకులో రుణం మంజూరై ఉండాలి. ఆ విధంగా నిబంధనలు పాటిస్తేనే రైతుకు లబ్ధి చేకూరుతుంది.

సున్నా వడ్డీకి అర్హత రాలేదు - వెంకన్న,రైతు, రంగాపురం, సీ.బెళగల్‌ మండలం:

నాకున్న నాలుగెకరాల్లో పత్తి, మొక్కజొన్న తదితర పంటలను గత ఖరీఫ్‌లో సాగు చేశాను. రూ.లక్ష దాకా బ్యాంకులో రుణం తీసుకున్నాను. ప్రభుత్వ ఆదేశాల మేరకు వడ్డీని కూడా చెల్లించేశాను. సోమవారం విడుదలైన అర్హుల జాబితాలో నా పేరు కనిపించలేదు. గతంలో ఈ పరిస్థితి లేదు. ఏ పంటకు సంబంధించి రుణం మంజూరైనా సున్నా వడ్డీ పథకం వర్తించేది. ఈ ప్రభుత్వం తీరు ఎవరికీ అర్థం కావడం లేదు.

నమ్మించి మోసం చేశారు - ఆంజనేయులు, రైతు, ముడుమాల గ్రామం:

నాకున్న పొలంలో పత్తి పంట సాగు చేసేందుకు బ్యాంకులో రుణం తీసుకున్నాను. ఈ రుణానికి సంబంధించి వడ్డీని కూడా వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చి మరీ చెల్లించాను. ఎంతో ఆశగా రైతుభరోసా కేంద్రం వద్దకు వెళితే.. సున్నా వడ్డీ పథకానికి సంబంధించిన జాబితాలో నా పేరు లేదు. అధికారులను అడిగితే.. వారు సరైన జవాబు ఇవ్వడం లేదు.

Updated Date - 2022-11-30T23:05:33+05:30 IST

Read more