మీ పేరు బంగారం గానూ!

ABN , First Publish Date - 2022-09-25T06:24:50+05:30 IST

మీ పేరు బంగారం గానూ!

మీ పేరు బంగారం గానూ!

 రచ్చుమర్రిలో అందరూ ‘బంగారమే’

ఆ ఊరంతా బంగారమే... అధిక శాతం ఇళ్లలో బంగారమే. ఆగండాగండి...బంగారం అంటే వాళ్ల ఇళ్లు బంగారు గనులతోనో...ఆభరణాలతోనో నిండిపోయాయని అనుకుంటే పొరపాటు. గ్రామంలోని స్త్రీ, పురుషులలో ఎక్కువ మంది పేర్లు బంగారంతో ముడిపడి ఉంటాయి. స్త్రీలయితే బంగారమ్మ అని... పురుషులైతే బంగారయ్య అని పేర్లు ఉంటాయి. ఎవరైనా బంగారమ్మా..అని గానీ ...బంగారయ్యా అని గానీ పిలిస్తే కనీసం పదిమందికి తక్కువ కాకుండా ఒకేసారి మనవైపు చూస్తారు. దాదాపు 2500 మందికి ఇదే పేరు. అంతగా ఆ పేరుతో ముడిపడి ఉంది. గ్రామదేవత బంగారమ్మను మొక్కుకోవడంతో ఎక్కువ మంది తమ పిల్లలకు ఈ పేర్లు పెట్టుకున్నారు. ఇదీ మంత్రాలయం మండలం రచ్చుమర్రి గ్రామం ప్రత్యేకత.

మంత్రాలయం, సెప్టెంబరు 24: మంత్రాలయం మండలంలోని రచ్చుమర్రి గ్రామంలో ఊరంతా బంగారమే. ఆ గ్రామంలో వెలసిన గ్రామదేవత బంగారమ్మ పేరు మీదుగా దాదాపు వెయ్యి మందికి పైగా బంగారప్ప, బంగారమ్మ, బంగారి.. ఇలా ‘బంగారు’ అనే  పేర్లు పెట్టుకున్నారు. కోరిన వరాలిచ్చే తల్లిగా బంగారమ్మ దేవతను ఇక్కడ పూజిస్తారు. నాలుగు తరాలుగా బంగారమ్మ దేవతను కొలుస్తున్నారు. ఆమె పేరు తలుచుకుని శుభకార్యాన్ని చేపడితే విజయవంతమవుతుందని గ్రామస్థుల ప్రగాఢ నమ్మకం. ఈ గ్రామంలో దాదాపు ఎనిమిది వేల జనాభా ఉండగా.. దాదాపు వెయ్యి మందికి పైగా బంగారమ్మ పేరు కలసి వచ్చేలా పెట్టుకున్నారు. ఇది ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది.

ఒకే ఇంటిలో దాదాపు 15 మందికి..


ఒకే ఇంటిలో దాదాపు 15 మంది బంగారప్ప, బంగారమ్మలు   ఉన్నారు. సవారప్ప, జములమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు, నలుగురు కూతుళ్లు. ఇందులో ఇద్దరు కొడుకులు బంగారప్పలే. నలుగురు కూతుళ్లలో ఇద్దరికి బంగారమ్మ పేరు పెట్టారు. పెద్ద బంగారప్పకు ముగ్గురు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు సంతానం. వీరిలో ముగ్గురు కొడుకులకు పెద్ద బంగారప్ప, నడిపి బంగారప్ప, చిన్న బంగారప్పలుగా పేర్లు పెట్టాడు. కూతుళ్లకు భాగ్యమ్మ, భారతి, జమినిలుగా నామకరణం చేశాడు. వీరిలో చిన్న బంగారప్పకు నలుగురు సంతానం కాగా బంగారమ్మలోని మొదటిదైన ‘బ’ అక్షరం కలసి వచ్చేలా ఇద్దరికి భవిత, బాహుళ్య అని పేరు పెట్టుకున్నారు.

దాదాపు 2,500 మందికి అవే పేర్లు..

గ్రామంలో ‘బ’ అనే అక్షరంతో దాదాపు 2,500 మంది పేర్లు ఉన్నాయి. ఏరువాక పౌర్ణమి రోజున మూడేళ్లకు ఒకసారి బంగారమ్మకు దేవర ఉత్సవాలు నిర్వహిస్తారు. బంగారప్పలు, బంగారమ్మ పేర్లతో అక్కడ విధులు నిర్వహించే అధికారులైనా.. ఉపాధ్యాయులైనా తికమక పడక తప్పడం లేదు. ఒక్కో ఇంటిలో ముగ్గురికి పైగా బంగారమ్మ, బంగారప్ప, చిన్న, పెద్ద బంగారమ్మ, బంగారప్ప, నడిపి బంగారప్ప వంటి పేర్లతో పిలుచుకుంటున్నారు. అమ్మ పేరు తలిస్తే.. సకల శుభాలు కలుగుతాయని ఆ గ్రామస్థుల నమ్మకం.

దేవాలయం అభివృద్ధికి శ్రీకారం

గ్రామంలో బంగారమ్మ దేవాలయం చిన్నదిగా ఉండేది. గ్రామస్థులు దాదాపు రూ.కోటికి పైగా ఖర్చు పెట్టి దేవాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందులో రచ్చుమర్రికి చెందిన గుంతకల్లులో పని చేస్తున్న డీఎస్పీ నరసింగప్ప రూ.4లక్షలతో ధ్వజస్తంభం నిర్మిస్తున్నారు. పోలి ఎర్రన్న రూ.1.50 లక్షల విలువ చేసే పెద్ద గంటను విరాళంగా  ఇస్తున్నారు. అదే గ్రామానికి చెందిన సమగ్ర శిక్ష ఈఈగా పని చేస్తున్న మాల రాగప్ప, శాస్త్రవేత్తలు వెంకటేష్‌, శంకర్‌లు రూ.22 లక్షలతో బంగారమ్మ పేరు మీదుగా ముఖద్వారం నిర్మిస్తున్నారు.  గ్రామంలో వివిధ మొక్కులు, చందాలతో రూ.కోటికి పైగా వెచ్చించి దేవాలయం నిర్మాణం చేపట్టడంతో వివిధ గ్రామాల దృష్టి అంతా రచ్చుమర్రి వైపు మళ్లింది.

 వరాలిచ్చే దేవత బంగారమ్మ
 
కష్టాలు, అనారోగ్యం ఉన్నా మొక్కుకుంటే వరాలు ప్రసాదించేది బంగారమ్మ దేవతే. గ్రామ దేవతగా ఆమె పేరుతో అనేక మంది మొక్కులు తీర్చుకుంటున్నారు. రైతులు విత్తనం నాటే ముందు.. పంట వచ్చిన తర్వాత ఆమెకు మొక్కితే కష్టాలు తొలగిపోయి.. లాభాలు చేకూరుతాయని నమ్మకం.

- బండ్రాల బసవరాజు, రచ్చుమర్రి గ్రామం

మా గ్రామంలో ఆ పేర్లే ఎక్కువ

మా గ్రామంలో బంగారమ్మ దేవత పేరు మీద ఎక్కువ మంది ఉన్నారు. బంగారమ్మ, బంగారప్ప వంటి పేర్లు పెట్టుకుంటే అమ్మవారు ఆపదలో ఆదుకుంటున్నారు. గత పదిహేనేళ్ల నుంచి బంగారమ్మ పేరు మొరటుగా ఉంటుందని ‘బ’ అక్షరంతో మొదలయ్యే భరత్‌, భారతి, భాగ్య, బాలరాజు వంటి పేర్లు పెట్టుకుంటున్నారు.

- మజ్జిగ నరసమ్మ, రచ్చుమర్రి

బంగారమ్మ అంటే మా ఊరే గుర్తొస్తుంది

నాలుగు తరాల నుంచి బంగారు అంటే మా గ్రామమే గుర్తుకు వస్తుంది. పిల్లలు లేకపోయినా, అనారోగ్యంగా ఉన్నా, బాగా చదువుకోవాలన్నా, ఉద్యోగం రావాలన్నా, వ్యాపారంలో లాభాలు చేకూరాలన్నా బంగారమ్మకు మొక్కులు తీర్చుకుని ముందుకు వెళ్తాం. దాదాపు గ్రామస్థులు ఇచ్చిన రూ.కోటి చందాలతోనే అమ్మవారి గుడిని నిర్మిస్తున్నాం. అమ్మవారికి ఏటా ఏరువాక పౌర్ణమికి మొక్కులు, ఉత్సవాలు చేస్తాం.  

- ఉప్పర వెంకోబ, రచ్చుమర్రి

గ్రామ ఆడపడుచుగా బంగారమ్మ

మా గ్రామ ఆడపడుచుగా బంగారమ్మ దేవత పూజలందుకుంటుంది. నేను సెలవు దినాలు, శుభకార్యాలకు సొంత గ్రామమైన రచ్చుమర్రికి వెళ్లినప్పుడు బంగారమ్మ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటాను. దాదాపు రూ.4 లక్షల ఖర్చుతో ధ్వజస్తంభాన్ని విరాళంగా ఇస్తున్నాను.

 - నరసింగప్ప, డీఎస్పీ, గుంతకల్లు

Read more