నడి రోడ్డుపై వైసీపీ నాయకుల వీరంగం

ABN , First Publish Date - 2022-09-11T05:40:43+05:30 IST

కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో అధికార పార్టీ సర్పంచ్‌, కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

నడి రోడ్డుపై వైసీపీ నాయకుల వీరంగం

స్థల వివాదంలో ఒకరిపై ఒకరు దాడి
కార్యకర్తపై చేయి చేసుకున్న సర్పంచ్‌
తిరిగి మూకుమ్మడిగా దాడి చేసిన కార్యకర్తలు
ప్రేక్షక పాత్ర వహించిన పోలీసులు


పత్తికొండ, సెప్టెంబరు 10: కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో అధికార పార్టీ సర్పంచ్‌, కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. నడి రోడ్డుపై వైసీపీ నాయకులు వీరంగం సృష్టించినా పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. పత్తికొండ పట్టణంలోని ఓల్డ్‌ ఎక్సైజ్‌ పోలీస్‌స్టేషన్‌ పక్కన ఉన్న ఖాళీ స్థలం యజమానురాలు సమీప బంధువులకు రిజిస్ట్రేషన్‌ ఆయకం పెట్టింది. ఐదేళ్ల తరువాత డబ్బులు చెల్లించి స్థలాన్ని విడిపించుకుంటామని కోరగా గడువు ముగిసిందని స్థలం వెనక్కి ఇచ్చేందుకు నిరాకరించారు. ఆ తరువాత పలువురు పెద్దలు పంచాయితీ నిర్వహించి వడ్డీతోపాటు డబ్బులు తీసుకుని స్థలం మహిళకు ఇచ్చేవిధంగా ఒప్పందం కుదిర్చారు. అయితే మహిళకు సంబంధించిన కుటుంబంలోని వ్యక్తి దూదేకొండ సర్పంచ్‌ కావడంతో ఇవతలి వ్యక్తులు అధికారి పార్టీకి చెందిన మరో నాయకుడి వద్దకు వెళ్లి స్థలం తమకే దక్కే విధంగా చూడాలని కోరారు. తాను చూసుకుంటానని స్థలం తిరిగి ఇవ్వవద్దని, సదరు నాయకుడు మాట ఇవ్వడంతో డబ్బు తీసుకుని స్థలం ఇచ్చేందుకు నిరాకరించారు. అయితే పంచాయితీలో మాట్లాడుకున్న విధంగా స్థలం ఇవ్వకపోవడం ఏమిటని మహిళ తరపు వారు ప్రశ్నించినా పట్టించుకోలేదు. దీంతో రెండు రోజుల క్రితం అది తమ స్థలమని సదరు మహిళ నిర్మాణ పనులు ప్రారంభించారు. దీంతో రిజిష్టర్‌ అయిన స్థలంలో ఎలా నిర్మాణాలు చేపడుతారంటూ రిజిష్టర్‌ ఆయకం పెట్టుకున్న వ్యక్తులు తాము ఆశ్రయించిన అధికార పార్టీ నాయకుడి సాయంతో నిర్మాణాన్ని నిలిపివేయించారు. శనివారం ఉదయం నిర్మించిన గోడను కూల్చేసేందుకు ప్రయత్నించారు. దీంతో మహిళ బంధువులతోపాటు దూదేకొండ సర్పంచ్‌ రహిమాన్‌ అక్కడికి చేరుకుని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న మరో వర్గానికి చెందిన నాయకుడు స్థలం యజమానురాలైన మహిళను తోసేందుకు ప్రయత్నించడంతో సర్పంచ్‌ రెహిమాన్‌ ఆ వ్యక్తిపై చేయి చేసుకున్నాడు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న మరో నాయకుడికి చెందిన అనుచరులు (వైపీపీ కార్యకర్తలు) సర్పంచ్‌పై మూకుమ్మడిగా దాడికి దిగారు. అడ్డుకునేందుకు వచ్చిన రెహిమాన్‌ కుమారుడిని సైతం తోసి వేయడంతో అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. బందోబస్తుకు వచ్చిన పోలీసులు మాత్రం గొడవను చూస్తూ ఉండిపోయారు. గాయపడిన రహిమాన్‌ కుమారుడిని చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించారు. అయితే రెండు వర్గాల వైపు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సీఐ మురళీమోహన్‌ తెలిపారు.

Read more