జగనన్న ఏపీగా మార్చేస్తారేమో

ABN , First Publish Date - 2022-09-22T04:42:57+05:30 IST

వైసీపీ ప్రభుత్వం రాషా్ట్రన్ని జగనన్న ఏపీగా మారుస్తారేమో అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఎద్దేవా చేశారు.

జగనన్న ఏపీగా మార్చేస్తారేమో
మాట్లాడుతున్న మాజీమంత్రి భూమా అఖిలప్రియ

  1. ఎనటీఆర్‌ పేరు తొలగిస్తే తెలుగుజాతి క్షమించదు 
  2.  మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆగ్రహం 

నంద్యాల (నూనెపల్లె), సెప్టెంబరు 21 :  వైసీపీ ప్రభుత్వం రాషా్ట్రన్ని  జగనన్న ఏపీగా మారుస్తారేమో అని  టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఎద్దేవా చేశారు. బుధవారం నంద్యాలలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎనటీఆర్‌ వైద్య విశ్వ విద్యాలయానికి ఎనటీఆర్‌ పేరును తొలగిస్తూ వైఎస్‌ఆర్‌ పేరును పెట్టడంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైద్య విశ్వవిద్యాలయ స్థాపనకు ఎనటీఆర్‌ ఎంతో కృషి చేశారని,  వైఎస్‌ఆర్‌కు, వైసీపీకి ఎలాంటి సంబంధం లేకపోయినా వైఎస్‌ఆర్‌ పేరు పెట్టడం దారుణమన్నారు. పేరు మార్పుపై రాష్ట్రంలో  ఎవ్వరూ హర్షించడం లేదని ఆమె అన్నారు. యూనివర్సిటీ ఎమర్జెన్సీ ఫండ్‌ రూ.450 కోట్లు దుర్మార్గంగా వాడుకున్న ఘనత వైసీపీకే దక్కుతుందని విమర్శించారు. ఇలా పేర్లు మార్చే ఆలోచన  గతంలో ఏ ప్రభుత్వానికి రాలేదని, వైసీపీ ప్రభుత్వం పేర్లు మార్చుకుంటూ పోవడమే తమ పాలన అని చెబుతున్నదని అన్నారు.  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి అయినా ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదని అన్నారు. నంద్యాలలో మెడికల్‌ కాలేజీ నిర్మాణానికి టీడీపీ నాయకులు అడ్డు తగులుతున్నారని ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి అనడం  అతని అవివేకానికి నిదర్శనమన్నారు. వైద్య కళాశాలకు టీడీపీ వ్యతిరేకం కాదని, అయితే కళాశాల నిర్మాణానికి ఎంతో పేరెన్నికగన్న ఆర్‌ఏఆర్‌ఎస్‌ భూమిని కేటాయించడాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు.  ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఏవీఆర్‌ ప్రసాద్‌, పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు వాకా శివశంకర్‌ యాదవ్‌, టీడీపీ నాయకులు శీలం భాస్కర్‌రెడ్డి, కుందూరు మోహనరెడ్డి, ఆజ్మీర్‌, తేళ్లపురి తులసీశ్వరరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-09-22T04:42:57+05:30 IST