యార్డుల్లో దోపిడీ ఆగేదెన్నడో..?

ABN , First Publish Date - 2022-09-30T05:40:38+05:30 IST

రమేష్‌. కోడుమూరు మండలం అమడగుంట్ల గ్రామం.

యార్డుల్లో దోపిడీ ఆగేదెన్నడో..?

నత్తను తలపిస్తున్న ఈ-ఫామ్‌ మార్కెట్‌
‘డైరెక్‌ ్ట సేల్‌’ నామ మాత్రమే..
కమీషన్‌ ఏజంట్ల వైపే పాలకులు, అధికారులు
నేరుగా కొనుగోళ్లయితే రూ.100 కోట్లకు పైగా రైతుకు ఆదా

కర్నూలు(అగ్రికల్చర్‌), సెప్టెంబరు 29:


 రమేష్‌. కోడుమూరు మండలం అమడగుంట్ల గ్రామం. ఐదెకరాల్లో సాగు చేసిన పత్తి పంట మరో నెల రోజుల్లో చేతికి అందనుంది. ప్రత్యక్ష అమ్మకం లేదా ఈ-ఫామ్‌ మార్కెట్‌ విధానాన్ని అమలు చేస్తే తనకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని .. గత రెండు సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఈసారైనా కమీషన్‌ ఏజెంట్ల బెడద  తప్పుతుందో.. లేదోనని ఆందోళన చెందుతున్నాడు. ఆదోని మార్కెట్‌ యార్డులో  నిబంధనలకు విరుద్ధంగా నాలుగు శాతం కమీషన్‌ వసూలు చేస్తున్నారని... అధికారులకు తెలిసి కూడా ఈ అక్రమం జరుగుతూనే ఉందని వాపోతున్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ- ఫామ్‌ మార్కెట్‌ను అందుబాటులోకి తేవాలని కోరుతున్నాడు. రమేష్‌దే కాదు.. జిల్లాలోని రైతులందరిదీ ఇదే పరిస్థితి.

ఉమ్మడి జిల్లాలో రైతుల పంట ఉత్పత్తులను అమ్ముకునేందుకు 15 మార్కెట్‌ యార్డులను ఏర్పాటు చేశారు. కర్నూలు, ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డ, డోన్‌, నందికొట్కూరు, ఆత్మకూరు, బనగానపల్లె, కోవెలకుంట్ల, ఆలూరు, పత్తికొండ, కోడుమూరు, పాణ్యం, కోసిగి కేంద్రాల్లో రైతులు పంట ఉత్పత్తులను విక్రయించుకుంటున్నారు. కానీ కమీషన్‌ ఏజెంట్ల దోపిడీతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వీరి బెడద నుంచి రైతులను కాపాడేందుకు ప్రభుత్వం రెండేళ్ల కిందట డైరెక్ట్‌ సేల్‌ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. దీని వల్ల వ్యాపారులే రైతుల వద్దకు వెళ్లి పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు. ఈ విధానం సరిగా అమలు కావడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 1,600 గ్రామాలకు పైగా ఉంటే.. పది గ్రామాల్లో మాత్రమే ఈ విధానం కొనసాగుతోంది.

ఈ-ఫామ్‌ మార్కెట్లు తెచ్చినా..

పంట ఉత్పత్తులను వారి గ్రామాల్లోనే వ్యాపారులతో కొనుగోలు చేయించేందుకు ఈ-ఫామ్‌ మార్కెట్లను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. దీని వల్ల పంట ఉత్పత్తులను రైతుల నుంచి నేరుగా వ్యాపారులు కొనుగోలు చేయాలి. దీన్నే డైరెక్ట్‌ సేల్‌ (ప్రత్యక్ష అమ్మకం) అంటారు. ఈ పథకం వల్ల నష్టపోతామనే భయంతో కమీషన్‌ ఏజెంట్లు, రాజకీయ నాయకులు, మార్కెటింగ్‌ శాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చి డైరెక్ట్‌ సేల్‌ విధానాన్ని అమలు కాకుండా చేశారు. దీంతో కమీషన్‌ ఏజెంట్ల దోపిడీ మామూలైపోయింది. పంట ఉత్పత్తులపై 2 నుంచి 4 శాతం కమీషన్‌ వసూలు చేస్తున్నారు. జిల్లా మొత్తం మీద ఏటా ఏజెంట్లు పొందే కమీషన్‌ను అంచనా వేస్తే దాదాపు రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల దాకా ఉంటుంది.

కమీషన్‌ ఏజెంట్ల అక్రమాలు అన్నీఇన్నీ కావు..

కమీషన్‌ ఏజెంట్ల వ్యవస్థ మార్కెట్‌ యార్డుల్లో ఎప్పటి నుంచో అమల్లో ఉంది. నిబంధనల ప్రకారం పంట ఉత్పత్తుల అమ్మకాలపై రెండు శాతం కమీషన్‌ మాత్రమే వసూలు చేయాలి.  ఎలక్ర్టానిక్‌ కాటాల్లో తక్కువగా చూపడంతో పాటు కమీషన్‌ ఏజెంట్ల అక్రమాల జోరు పెరిగిపోయింది. రాష్ట్రంలోనే పత్తి విక్రయాల్లో గుర్తింపు పొందిన ఆదోని మార్కెట్‌ యార్డుల్లో ఏజెంట్లు ఒక శాతానికి బదులు నాలుగు శాతంపైగా వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. అదేవిధంగా కర్నూలు, ఎమ్మిగనూరు మార్కెట్‌ యార్డుల్లోనూ 2 నుంచి 4 శాతం కమీషన్‌ను రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. వీటన్నింటికీ చెక్‌ పెట్టేందుకు డైరెక్ట్‌ సేల్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చినా రెండు, మూడు సంవత్సరాలకు మించి కొనసాగలేదు.

అమలు కాకుండా చేస్తున్నారు..

డైరెక్ట్‌ సేల్‌ విధానం వల్ల తమకు భారీగా నష్టం జరుగుతుందని భావించిన కమీషన్‌ ఏజెంట్లు, రాజకీయ నాయకులు మార్కెట్‌ కమిటీల అధికారులపై ఒత్తిడి తెచ్చి అమలు కాకుండా చేశారు. ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏ మార్కెట్‌ యార్డులో కూడా డైరెక్ట్‌ సేల్‌ అమలు కావడం లేదు. కర్నూలు మార్కెట్‌ యార్డులో ఈ పథకం బోర్డుకే పరిమితమైంది. రైతులు డైరెక్టుగా కమీషన్‌ ఏజెంట్ల వద్దకే వెళ్లి పంట ఉత్పత్తులను వారి షాపుల వద్ద నిల్వ చేసి విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. దీని వల్ల ఏజెంట్లు 2 నుంచి 4 శాతం కమీషన్‌ను రైతుల నుంచి వసూలు చేయడమే కాకుండా మరోవైపు వ్యాపారుల నుంచి కూడా లబ్ధి పొందేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నారు.

ఈ-ఫామ్‌ మార్కెట్‌ను అమలు చేస్తాం

ప్రభుత్వం ఈ-ఫామ్‌ మార్కెట్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ విధానంలో వ్యాపారులు గ్రామాలకే వెళ్లి రైతుల నుంచి పంట దిగుబడులను కొనుగోలు చేస్తారు. రైతులు  కమీషన్‌ చెల్లించాల్సిన అవసరం ఉండదు. మరోవైపు రవాణా ఖర్చులు కూడా ఆదా అవుతాయి. ప్రస్తుతం కర్నూలు జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో గల కొన్ని గ్రామాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం. త్వరలోనే అన్ని గ్రామాల్లో అమల్లోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటాం.

- ఏడీఎం నారాయణ మూర్తి

Read more