ఇప్పుడేం చేయాలి?

ABN , First Publish Date - 2022-09-28T05:49:53+05:30 IST

జగన్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో డ్వామాలో పని చేసే ఫిట్‌ ట్రైనింగ్‌ ఎంప్లాయీస్‌ (ఎఫ్‌టీఈ) భవితవ్యం ప్రశ్నార్థంగా మారింది.

ఇప్పుడేం చేయాలి?

రేషనలైజేషన్‌ పేరుతో ఉద్యోగుల కుదింపు
అధికంగా ఉన్న వారిని ఇతర జిల్లాలకు వెళ్లాలని ఒత్తిడి
రాయలసీమ నుంచి కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాలకు...
సీఎం జగన్‌ ప్రభుత్వ నిర్ణయం
241 మంది డ్వామా ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకం
ఈ జీతాలతో బతకడం సాధ్యమేనా అని ఆవేదన


(కర్నూలు-ఆంధ్రజ్యోతి):

జగన్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో డ్వామాలో పని చేసే ఫిట్‌ ట్రైనింగ్‌ ఎంప్లాయీస్‌ (ఎఫ్‌టీఈ) భవితవ్యం ప్రశ్నార్థంగా మారింది. రేషనలైజేషన్‌ పేరుతో ఉద్యోగాలను కుదించి.. మిగులు సిబ్బందిని జిల్లాలకు వెళ్లమంటోంది. వెళ్లడానికి ఆసక్తి ఉందా.. లేదా? తేల్చి చెప్పమని మెడపై కత్తి పెట్టింది. ఉద్యోగం వదులుకోలేక.. రూ.15 వేల నుంచి రూ.30 వేల జీతంతో ఇతర జిల్లాలకు వెళ్లలేక ఎఫ్‌టీఈ ఉద్యోగులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. ఉన్న జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 241 మంది ఉద్యోగుల పరిస్థితి అయోమయంలో పడింది.


ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలు కోసం వివిధ హోదాల్లో మండల స్థాయిలో పని చేసేందుకు గాను ఏపీఓలు, టెక్నికల్‌ అసిస్టెంట్లు (టీఏ), కంప్యూటర్‌ ఆపరేటర్లు (సీఓ), ఇంజనీరింగ్‌ అసిస్టెంట్ల(ఈసీ/జేఈ)ను రాష్ట్ర ప్రభుత్వం నియమిం చింది. ఉపాధి హామీ పథకం ప్రారంభమైనప్పటి నుంచి 2016 వరకు జిల్లా సెలెక్షన్‌ కమిటీ (డీఎస్‌సీ) ద్వారా పబ్లిక్‌ నోటిఫికేషన్‌ జారీ చేసి, విద్యార్హతల ఆధారంగా, రోస్టర్‌ విధానంలో నియమించారు. ఇలా నియమితులైన ఉద్యోగులను ఫిట్‌ ట్రైనింగ్‌ ఎంప్లాయీస్‌ (ఎఫ్‌టీఈ)గా పిలుస్తున్నారు. డ్వామా విభాగం పర్యవేక్షణలో వీరు పని చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 670 మంది ఉద్యోగులు వివిధ హోదాల్లో ఉపాధి హామీ పథకం అమలు కోసం గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్నారు. వారికి ఇస్తున్న జీతం సీనియారిటీని బట్టి రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు ఉంటోంది. ఏదో ఒక రోజు ఉద్యోగం రెగ్యులర్‌ అవుతుంది.. బతుకు బాగుపడుతుందనే ఆశతో బీటెక్‌, పీజీలు చేసిన నిరుద్యోగులు సైతం దరఖాస్తులు చేసి డీఎస్‌సీ ద్వారా ఎంపికై ఉద్యోగాలు చేస్తున్నారు.

 రేషనలైజేషన్‌ పేరుతో కుదింపు
 
సీఎం జగన్‌ ప్రభుత్వం వచ్చాక కొత్తగా ఉద్యోగాలు ఇవ్వకపోగా.. రేషనలైజేషన్‌ పేరుతో ఉన్న ఉద్యోగాలను కుదించింది. ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాలోని 53 మండలాల్లో గతంలో ఉపాధి హామీ పథకం, వాటర్‌షెడ్ల అమలుకు టెక్నికల్‌ అసిస్టెంట్లను 670 మందిని నియమించారు. వీరిలో బీటెక్‌ చేసిన యువత కూడా ఉన్నారు. వీరికి నియామక సమయంలో ఇస్తున్న వేతనం రూ.15 వేలే. ప్రభుత్వం రెగ్యులర్‌ చేస్తుందనే ఆశతో చేరిన వారే అధిక శాతం ఉన్నారు. ఉపాధి హామీ పనులకు వెళ్లే కూలీల పని దినాల ఆధారంగా టెక్నికల్‌ అసిస్టెంట్లు సహా సీఓ, ఈసీ, ఏపీవోలను రేషనలైజేషన్‌ పేరుతో కుదించారు. రేషనలైజేషన్‌ ప్రకారం వివిధ విభాగాల్లో కర్నూలు జిల్లాలో 217, నంద్యాల జిల్లాలో 212 కలిపి 429 పోస్టులకు కుదించారు. ప్రస్తుతం 670 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఈ లెక్కన 241 మంది మిగులు సిబ్బంది ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం తేల్చింది. ఇప్పుడు వీరి భవితవ్యం ప్రశ్నార్థంగా మారింది.


ఉద్యోగల మెడపై కత్తి

 వివిధ విభాగాల్లో పని చేసే ఎఫ్‌టీఈల సీనియారిటీ జాబితాను తయారు చేశారు. రివర్స్‌ సీనియారిటీ ప్రకారం దిగువన ఉన్న ఉద్యోగులను ఖాళీలు ఉన్న జిల్లాలకు వెళ్లాలని ఒత్తిడి తెస్తున్నారు. రాష్ట్రంలో 26 జిల్లాల్లో టెక్నికల్‌ అసిస్టెంట్లకు (టీఏ) సంబంధించి 377 ఖాళీలు ఉన్నాయి. వాటిని నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించాల్సి ఉంది. రేషనలైజేషన్‌ పేరుతో 363 మంది ఉద్యోగులు మిగులు (అధికంగా) ఉన్నారని... వీరిని ఆ ఖాళీల్లో సర్దుబాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 363 మంది టీఏల్లో 142 మంది కర్నూలు, నంద్యాల జిల్లా వాళ్లే ఉన్నారు. కంప్యూటర్‌ ఆపరేటర్లను రాష్ట్రంలో మిగులు సిబ్బంది కింద 258 మందిని గుర్తిస్తే.. కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన వారే 89 మంది ఉన్నారు. ఇతర జిల్లాలకు వెళ్లేందుకు ఆసక్తి ఉందా..? లేదా..? తేల్చి చెప్పాలని ఉద్యోగుల మెడపై ఆప్షన్‌ కత్తి పెట్టారు. అంగీకరిస్తే కేటాయించిన జిల్లాకు వెళ్లాలి.. ఆప్షన్‌ ఇవ్వకపోతే ఉద్యోగం ఉంటుందా..? తీసేస్తారా..? అన్నది ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో డ్వామానే నమ్ముకున్న ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. సరిహద్దులోని అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాలకు వెళ్దామంటే అక్కడ కూడా మిగులు (ఎక్సెస్‌) సిబ్బందే ఉన్నారు. దీంతో అత్యధిక ఖాళీలు ఉన్న ఏలూరు, పల్నాడు, అనకాపల్లి, కృష్ణా, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ.. వంటి జిల్లాలకు వెళ్లాల్సి వస్తుంది. సీనియారిటీ ప్రకారం మాకు వచ్చే జీతం రూ.15 వేల నుంచి రూ.30 వేలకు మించడం లేదు. అందులో నూ రెగ్యులర్‌ ఉద్యోగాలు కావు. ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పని చేస్తున్నాం. తక్కువ జీతాలతో కోస్తా, ఉత్తరాంధ్రకు వెళ్లి ఎలా బతికేది అంటూ మిగులు సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఇదే జిల్లాలో కొనసాగించాలని కోరుతున్నారు.

Updated Date - 2022-09-28T05:49:53+05:30 IST