శ్రమజీవులకు ఈ-శ్రమ్‌ ఉపయోగం

ABN , First Publish Date - 2022-09-20T04:39:04+05:30 IST

అసంఘటితరంగ కార్మికులకు బీమా భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం ఆగస్టు 26న ఈశ్రమ్‌ వెబ్‌పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఉమ్మడి జిల్లాలో అసంఘటిత కార్మికులు సుమారు 11 లక్షల మందికి పైగా ఉన్నారు.

శ్రమజీవులకు ఈ-శ్రమ్‌ ఉపయోగం

  1. ఉమ్మడి జిల్లాల్లో 2 లక్షల మందికి పైగా నమోదు
  2. ప్రయోజనాలపై అవగాహన

కర్నూలు(న్యూసిటీ), సెప్టెంబరు 19: అసంఘటితరంగ కార్మికులకు బీమా భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం ఆగస్టు 26న ఈశ్రమ్‌ వెబ్‌పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఉమ్మడి జిల్లాలో అసంఘటిత కార్మికులు సుమారు 11 లక్షల మందికి పైగా ఉన్నారు. ఈశ్రమ్‌ ద్వారా కార్మికులకు 12 అంకెల ప్రత్యేక నంబరుతో కార్డు అందజేస్తారు. కార్డు తీసుకున్న వ్యక్తులకు ప్రభుత్వం అందించే అన్ని రకాల సామాజిక భద్రత పథకాలు, సంక్షేమ పథకాలు వర్తిస్తాయి. 


ఫ అవగాహన అంతంతమాత్రమే..

అసంఘటిత కార్మికులకు ప్రయోజనం చేకూరే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఈ పథకంపై అధికారులు అవగాహన అంతంత మాత్రంగానే కల్పిస్తున్నారు. మొదట్లో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి కార్మికులను ఈ పథకంపై నమోదు చేశారు. నిరక్షరాస్యులు ఉండటం, ఈ పథకం గురించి వివరించి చెప్పే వారు లేకపోవడంతో క్షేత్రస్థాయిలో సమస్యలు వస్తున్నాయి. ఈ క్రమంలో పలు ప్రాంతాలలో మరిన్ని అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం వల్ల కార్మికులకు ఉపయోగకరంగా ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 11 లక్షలకు పైగా అసంఘటిత కార్మికులు ఉన్నారు. ఇప్పటి వరకు కేవలం 2,18,786 మంది మాత్రమే నమోదు చేసుకున్నారు. 


ఫ సీఎసీ కేంద్రాల  ద్వారా నమోదు.

కార్మిక శాఖ కార్యాలయలంతోపాటు గ్రామ,వార్డు సచివాలయాలు, కామన సర్వీస్‌ సెంటర్ల ద్వారా నమోదు ప్రక్రియ చేసుకోవచ్చు. ఈ శ్రమ్‌ నమోదు చేసుకున్న వ్యక్తి తప్పనిసరిగ్గా అసంఘటితరంగ కార్మికుడై ఉండాలి. 59 ఏళ్లలోపు వారు ఇందులో చేరవచ్చు. ఆదాయ పన్ను చెల్లించని వారు, ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ వంటి సదుపాయాల పరిదిలోకి రాని వారు మాత్రమే అర్హులు. 


ఫ ఈశ్రమ్‌ ప్రయోజనాలు.

ఇప్పటి వరకు పథకాలు కుటుంబంలో ఒక్కరికే వర్తిస్తున్నాయి. దీని ఫలితంగా ఒకరిద్దరు అసంఘటితరంగ కార్మికులుంటే నష్టపోతున్నారు. ఈ శ్రమ్‌ వల్ల ఆ సమస్య ఉండదు. ఈ కార్డు ఉన్న వారందరికీ ప్రయోజనాలు వర్తిస్తాయి. కార్డు పొందిన ప్రతి ఒక్క అసంఘటితరంగ కార్మికుడికి ఏడాదిపాటు సురక్షా బీమా యోజన ద్వారా రూ.2 లక్షల ప్రమాద మరణ, అంగవైకల్య బీమా ఉచితంగా లభిస్తుంది. కార్డున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సామాజిక భద్రత, సంక్షేమ పథకాలు వర్తిస్తాయి. 

ఫ ప్రయోజనాలు ఉన్నాయి -కె. వెంకటేశ్వర్లు, ఉప కమిషనర్‌, కార్మిక శాఖ, కర్నూలు

అర్హులంతా నమోదు చేసుకుంటే ఈ శ్రమ్‌ ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అసంఘటిత కార్మికులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆనలైన నమోదుకు సమీప కార్మిక శాఖ కార్యాలయం, గ్రామ, వార్డు సచివాలయాలు, కామన సర్వీస్‌ సెంటర్లను సంప్రదించవచ్చు. జిల్లా వ్యాప్తంగా ఆయా డివిజన్ల పరిధిలో కార్మిక శాఖ కార్యాలయాల్లో నమోదు కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. ఈ శ్రమ్‌ పథకంపై ప్రజలకు విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నాం. నిరక్షరాస్యులను గుర్తించి వారికి ప్రత్యేకంగా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. 


జిల్లాలో దుకాణాలు, హోటళ్లు   -   50,000

కర్మాగారాలు           -   22,900

భవన నిర్మాణ కార్మికులు   -  1,40,314

నాపరాయి గని కార్మికులు   -     3,500

మట్టిపని, ఫారంపాండ్స్‌ గుంతలు తీయడం, బావులో పూడిక తీసే

కార్మికులు  -   45,512   


Read more