జాగ్రత్తగా స్ర్పే చేయడండి

ABN , First Publish Date - 2022-09-14T05:18:13+05:30 IST

అప్పులు చేసి పంటలు సాగు చేస్తే చీడపీడలు చుట్టుముడుతున్నాయి.

జాగ్రత్తగా స్ర్పే చేయడండి
నోటికి ఎటువంటి మాస్కు లేకుండా పిచికారి చేస్తున్న రైతు

  1. అవగాహన లేకుంటే ప్రాణాల మీదికే 
  2. పైర్లపై పెరిగిపోతున్న  తెగుళ్లు,  క్రిమికీటకాల దాడి 
  3. అవగాహన కల్పించని వ్యవసాయ యంత్రాంగం 
  4. ఆసుపత్రిపాలవుతున్న రైతులు 

కర్నూలు(అగ్రికల్చర్‌), సెప్టెంబరు 12:

అప్పులు చేసి పంటలు సాగు చేస్తే చీడపీడలు చుట్టుముడుతున్నాయి. వర్షాల వల్ల ఉమ్మడి జిల్లాలో వాతావరణ మార్పు వచ్చి పంటలపై తెగుళ్లు, క్రిమి కీటకాలు పెరిగిపోయి. అయితే పిచికారి మందు స్ర్పే చేయడంలో అవగాహన లేక రైతులు ప్రాణం మీదికి తెచ్చుకుంటున్నారు.   ఖరీఫ్‌లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 6.20 లక్షల హెక్టార్లలో సాగైన పంటలపై తెగుళ్లు, క్రిమికీటకాల దాడి తీవ్రమైంది. పత్తి, వేరుశనగ, ఆముదం, మొక్కజొన్న, వరి తదితర పంటలపై విపరీతంగా తెగుళ్లు వ్యాపిస్తున్నాయి. 50 శాతం పంటల్లో  దిగుబడి పూర్తిగా తగ్గిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ ఆందోళనలో రైతులు పురుగు మందులు స్ర్పే చేయడంలో జాగ్రత్తలు తీసుకోవడం లేదు. పంటలతోపాటు ప్రాణాలకే ప్రమాదం కొని తెచ్చుకుంటున్నారు. ఇటీవల ఉమ్మడి జిల్లాలో వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. 


ఉమ్మడి జిల్లాలో పంట పొలాల మీద చీడపీడల బెడద ఎక్కువైందని,  పురుగు మందుల వాడకం ఎక్కువైందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో గుంటూరు తర్వాత కర్నూలులోనే ఎక్కువగా క్రిమి సంహారక మందులను రైతులు వినియోగిస్తున్నారు. వీటి వాడకం ఎంత ప్రమాదకరమో తెలుసుకోకపోవడం వల్ల రైతులు మృత్యువాత పడ్తున్నారు. పొలాల్లో పనులు చేసుకునేందుకు వస్తున్న కూలీలు   ఆసుపత్రి పాలవుతున్నారు. ప్రస్తుతం పత్తి, శనగ, వరి పంటల్లో వ్యాపిస్తున్న పురుగులు, తెగుళ్లను నివారించేందుకు రైతులు తొందర పాటు, అవగాహన లేమితో   జాగ్రత్తలు లేకుండా రెండు, మూడు మందులు, గుళికలను పంటలపై స్ర్పే చేస్తున్నారు. నోరు, ముక్కు, కళ్ల ద్వారా    తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రాణహానికి దారి తీస్తున్నాయి.  

ప్రమాదకరమైన మందులు:

పంటలకు వినియోగిస్తున్న పురుగు మందుల్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ 5 రకాలుగా విభజించింది. మోథియాన్‌, మోనోక్రోటోఫాస్‌, ఫోరేట్‌(గుళికలు) పాస్మామిడాన్‌, మోథోమిల్‌, కార్బొప్యూరాన్‌, డైక్లోరోవాష్‌, ఎసిపేట్‌, పెన్‌వాలరేట్‌, ఎమిడాక్లోపిడ్‌, బైపెత్రిన్‌, కార్బరిల్‌, కార్బోసల్ఫాన్‌, క్లోరోఫైరిపాస్‌, సైవర్‌ మైత్రిన్‌, ఏథియాస్‌, డైకోపాల్‌, ప్రొఫెనోపాస్‌, క్వినాల్‌పాస్‌ తదితర మందుల్ని గుర్తించారు. 

ఫ పత్తిలో పురుగు నివారణకు పెన్‌వాలరేట్‌ను వినియోగిస్తున్నారు. కాయ లోపలికి చేరే  పురుగును నివారించేందుకు రెండు మూడు మందులతో కలిపి దీన్ని వినియోగిస్తున్నారు. ఈ మిశ్రమం ఎక్కువ ప్రమాదకరం. 

చైనా యంత్రాలు ప్రమాదమే:

దశాబ్దం కిందట పురుగును నివారించేందుకు చేతితో తిప్పే స్ర్పేయర్లతో పొడి మందులు పైరుకు చల్లేవారు. తర్వాత వీపుకు డబ్బాలు తగిలించుకొని చేతితో ఉపయోగించే పంపు స్ర్పేయర్లు వాడకంలోకి వచ్చాయి. చైనా ఉత్పత్తి చేసిన స్ర్పేయర్లు తక్కువ ధరకు దొరుకుతున్నా అవి   తక్కువ దూరంలో మందు   వెదజ్లల్లుతాయి. ఈ మందు రైతుల శరీరభాగాలకు సులువుగా వ్యాపిస్తోంది. జపాన్‌లో తయారైన థైవాన్‌ స్ర్పేయర్లు 20 అడుగుల దూరం వరకు మందును స్ర్పే చేస్తున్నారు. దీని వల్ల ప్రమాదం తక్కువ. వాటికి ప్రభుత్వం రాయితీ ఇస్తున్నా దిగుమతి చేసుకోవడంలో ఆలస్యమై సకాలంలో రైతులకు ఉపయోగపడటం లేదు. దీంతో తక్కువ ధరకు లభించే చైనా స్ర్పేయర్ల వైపు దృష్టి పెడ్తున్నారు. ఇవి రూ. 4 వేల నుంచి రూ. 4500లకే మార్కెట్లో లభిస్తున్నాయి. వీటిలో ఒత్తిడి శక్తి తక్కువ. యంత్రాల ప్రమాణాల ప్రకారం చదరపు అంగుళానికి 350 బిందువుల దాకా పైరుపై పడాలి. చైనా స్ర్పేయర్లు 10 అడుగుల మేరకు మందును తక్కువ బిందువులను  చల్లగలవు.  గాలి వ్యతిరేక దిశలో వీస్తే మందు బిందువులు స్ర్పే చేస్తున్న వాళ్ల మీదే పడుతుంది. ఇది చాలా ప్రమాదకరం అని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. 

జిల్లాలో ప్రధాన పంటలపై వ్యాపిస్తున్న తెగుళ్లు, క్రిమికీటకాలు: 

వరిలో అగ్గితెగుళ్లు, కాండం తొలిచే పురుగుతో పాటు దోమ కాటు ఎక్కువగా కనిపిస్తోంది. అదే విధంగా పత్తిలో రసం పీల్చే పురుగుతో పాటు గులాబి పురుగు ఉధృతి ఎక్కువగా కనిపిస్తుంది. కూరగాయలు ప్రధానంగా ఉల్లి, మిరపలో వేరుకుళ్లు, కాయతొలిచే పురుగులు ఎక్కువగా వ్యాపించాయి. మిరపలో ఈగ, ఆకులపై మచ్చలు, వైరస్‌ ఎక్కువగా వ్యాపిస్తోంది. నంద్యాల, నందికొట్కూరు ప్రాంతాల్లో అత్యధికంగా సాగు చేస్తున్న మొక్కజొన్నపై కత్తెర పురుగులు ఎక్కువగా కనిపిస్తోంది. 


స్ర్పే మందు నుంచి జాగ్రత్తలు:

ఫ మందు స్ర్పే చేసే సమయంలో చేతులకు తొడుగులు వేసుకోవాలి

ఫ మూతికి మాస్క్‌ తగిలించుకోవాలి 

ఫ గాలి వల్ల మందు మీద పడకుండా రక్షణ చూసుకోవాలి. విదేశాల్లో అయితే సరైన కిట్లు  ఏర్పాటు చేసుకోకుండా మందు చల్లరు. 

ఫ ప్లాస్టిక్‌ తరహా చొక్కా తప్పక వాడాలి. 

ఫ పిచికారి తర్వాత స్నానం కూడా చేయకుండా  ఆదరా బాదరాగా  కాళ్లు, చేతులు కడుక్కొని అన్నం తినడం వల్ల చాలా మంది రైతులు ప్రమాదాలకు గురవుతున్నారు.  


నిర్లక్ష్యం తగదు - జేడీ, వరలక్ష్మి :

రైతులు పంట తెగుళ్లు నివారణకు విషపూరితమైన మందులను వినియోగిస్తున్నారు. ఆ సమయంలో అవి శరీరానికి అంటకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.  క్రిమిసంహారక మందుల జోలికి వెళ్లకుండా ప్రకృతి సేంద్రియ వ్యవసాయ పద్ధతుల మీద దృష్టిని మళ్లించేందుకు   చర్యలు తీసుకుంటున్నాం. పురుగుమందు ఏదైనా సరే విషపూరితమేనని రైతులు గుర్తించాలి. పురుగు త్వరగా చనిపోతుందని రైతులు ఆతృతతో ఎక్కువ మందుల్ని మిశ్రమం చేసి వినియోగిస్తున్నారు. ఇది విషపదార్థంగా తయారై రైతుల శ్వాసక్రియను దెబ్బతీస్తున్నది. మందుల్ని కలిపి పైర్లపై చల్లరాదు. జాగ్రత్తలు పాటించాలి. 


Read more