కుందూలో ఇద్దరు గల్లంతు

ABN , First Publish Date - 2022-09-26T05:21:39+05:30 IST

ఇద్దరు యువకులు వేర్వేరు ఘటనల్లో ఆదివారం బండిఆత్మకూరు మండలం సంతజూటూరు పికప్‌ అనకట్ట వద్ద కుందూలో కొట్టుకపోయారు.

కుందూలో ఇద్దరు గల్లంతు
అమీర్‌భాష,శశికుమార్‌

 బండి ఆత్మకూరు, సెప్టెంబర్‌ 25: ఇద్దరు యువకులు వేర్వేరు ఘటనల్లో ఆదివారం బండిఆత్మకూరు మండలం సంతజూటూరు పికప్‌ అనకట్ట వద్ద కుందూలో కొట్టుకపోయారు. హైదరాబాదులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్న నంద్యాలకు చెందిన అమీర్‌బాషా తన తల్లిదండ్రులు రబ్బానీ బాషా, అలిమాబీ, ముగ్గురు సోదరులతో కలసి కారులో  జంతజూటూరు పికప్‌ ఆనకట్ట వద్దకు వచ్చారు. సరదాగా ఈతకొట్టేందుకు దిగి ప్రమాదవశాత్తు కాలుజారి నీటి ప్రవాహంలో అమీర్‌బాషా తల్లిదండ్రులు చూస్తుండగానే కొట్టుకపోయాడు. అలాగే బండిఆత్మకూరు మండలం చిన్న దేవళాపురం గ్రామానికి చెందిన శంకర్‌, లక్ష్మీదేవి దంపతుల చిన్న కుమారుడు శశికుమార్‌ తన  నలుగురు స్నేహితులతో కలసి కుందూ వద్దకు వచ్చి ఈతకొట్టడానికి దిగాడు. నీటి ప్రవాహ ఉధృతికి శశికుమార్‌ గల్లంతయ్యాడు. స్నేహితులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. శశికుమార్‌ నంద్యాలలో బైక్‌ మెకానిక్‌ నేర్చుకుంటున్నాడు.  పోలీసులు సమీప గ్రామాల యువకులతో గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం వరకు గల్లంతైన వారి ఆచూకీ లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. 


కేసీలో ఒకరు..

పాములపాడు సెప్టెంబరు 25 : పాములపాడు వద్ద కేసీ కెనాల్లో  సాయిప్రవీణ్‌ కుమార్‌ గౌడ్‌  గల్లంతయ్యాడు.  యువకుడి తండ్రి జనార్దనుగౌడ్‌ తెలిపిన వివరాల మేరకు...   శనివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో  సాయి ప్రవీణ్‌ బహిర్బూమికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో అనుమానం వచ్చి   కెనాలు దగ్గరకు వెళ్లి చూడగా గట్టుపై చెప్పులు, సెల్‌ కనిపించాయి. కాలువల్లో ప్రమాదవశాత్తు  జారి పడిపోయి ఉంటాడని   గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 


Read more