మురికి కూపంగా మార్చారు

ABN , First Publish Date - 2022-10-15T05:21:59+05:30 IST

వైసీపీ మూడేళ్ల పాలనలో నంద్యాల పట్టణాన్ని మురికి కూపంగా మార్చారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ ఎన్‌ఎండీ ఫరూక్‌, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి అన్నారు.

మురికి కూపంగా మార్చారు

ఎమ్మెల్సీ ఎన్‌ఎండీ ఫరూక్‌

నంద్యాల (నూనెపల్లె), అక్టోబరు 14: వైసీపీ మూడేళ్ల పాలనలో నంద్యాల పట్టణాన్ని మురికి కూపంగా మార్చారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ ఎన్‌ఎండీ ఫరూక్‌, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి అన్నారు. శుక్రవారం నంద్యాలలోని 13వ వార్డులో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. వార్డు టీడీపీ నాయకులు, ప్రజలు ఫరూక్‌, భూమా బ్రహ్మానందరెడ్డిలకు ఘన స్వాగతం పలికారు. పద్మావతినగర్‌, టెక్కె ప్రాంతాల్లో ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగి ఇబ్బందులు పడుతున్నామని, పన్నుల బాదుడుతో బ్రతుకు భారంగా మారిందని ప్రజలు వాపోయారు. ఈ సందర్భంగా ఫరూక్‌, భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో నంద్యాల పట్టణాన్ని అన్నివిధాలా అందంగా తీర్చిదిద్దామని, వైసీపీ పాలనలో నంద్యాల పట్టణాన్ని మురికికూపంగా మార్చారని విమర్శించారు. చిన్నపాటి వర్షాలకే లోతట్టు ప్రాంతాలు డ్రైనేజీ నీటితో నిండిపోయినా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, మున్సిపల్‌ అధికారులు చర్యలు చేపట్టకపోవడం దౌర్భగ్యమన్నారు. సంక్షేమం పేరుతో కొద్దిమందికి డబ్బులు వేస్తూ ప్రజలందర్నీ పన్నుల పేరుతో వేధిస్తున్నారని విమర్శించారు.  2024లో ప్రజలు టీడీపీని గెలిపిస్తారని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర రైతుసంఘం నాయకులు గుంటుపల్లి హరిబాబు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు మణియార్‌ ఖలీల్‌, సహా కార్యదర్శి ఉప్పరి సురేష్‌, వార్డు ఇన్‌చార్జి సుబ్బరాయుడు, దస్తగిరి పాల్గొన్నారు.

Read more