పులకరించిన ఉరుకుంద

ABN , First Publish Date - 2022-08-02T04:59:03+05:30 IST

ఉరుకుంద నరసింహ ఈరన్న స్వామి సన్నిధిలో సోమవారం భక్త జనం పోటెత్తింది.

పులకరించిన ఉరుకుంద
ఆలయం ఆరుబయటే నైవేద్యం చేస్తున్న భక్తులు

  1. స్వామివారి సన్నిధిలో లక్ష మందిపైగా భక్తులు
  2. శ్రావణ తొలి సోమవారం విశేష పూజలు  

కోసిగి(కౌతాళం), ఆగస్టు 1:   ఉరుకుంద నరసింహ ఈరన్న స్వామి సన్నిధిలో సోమవారం భక్త జనం పోటెత్తింది.  శ్రావణమాసం మొదటి సోమవారం కావడంతో మన రాష్ట్రం నుంచేగాక కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున భక్తులు వాహనాల్లో తరలివచ్చారు.  తలనీలాలు సమర్పించిన అనంతరం భక్తులు ఎల్లెల్సీ కాలువలో స్నానాలు ఆచరించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఈరప్ప స్వామికి  ఉదయం నుంచే ఆకుపూజ, పుష్పాభిషేకం, పుష్పాలంకరణ, మహా మంగళహారతి వంటి విశేష పూజలు నిర్వహించారు.     ఆలయ ఈవో వాణి, సూపరింటెండెంట్‌ వెంకటేశ్వర్లు భక్తులకు తగిన ఏర్పాట్లు చేశారు.  కోసిగి సీఐ ఎరిషావలి, ఎస్‌ఐలు నరేంద్ర కుమార్‌ రెడ్డి, శ్రీనివాసులు, ఎస్‌బీ ఏఎ్‌సఐ విజయకుమార్‌  పోలీసు బందోబస్తు నిర్వహించారు.


  గుండుకు వంద వసూలు

ఉరుకుంద క్షేత్రంలో కేశ సమర్పణకు వచ్చిన భక్తుల నుంచి భారీ ఎత్తున వసూలు చేశారనే ఆరోపణలు వినిపించాయి.  తలనీలాల కాంట్రాక్టరు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి  ఆలయ అధికారులు నిర్ణయించిన రూ.25లు కాకుండా   గుండుకు  రూ.100 చొప్పున   వసూలు చేశారు. దీంత ఆలయ అధికారులు తలనీలాల కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎక్కువ డడబ్బులు వసూలు చేయరాదని బోర్డులు పెట్టినా  అమలు కాలేదని భక్తులు విమర్శించారు.  

  ఈరన్న సన్నిధిలో ముస్లిం దంపతులు 

  ఉరుకుంద   ఈరన్న స్వామిని మతాలకు అతీతంగా ఆరాధిస్తారు.  సోమవారం ముస్లింలు   పిల్లాపాపలతో   వచ్చి స్వామివారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఓ ముస్లిం జంట   ప్రత్యేక క్యూలైనలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వారిని  ఆంధ్రజ్యోతి పలకరించగా.. తాము ప్రతి యేటా శ్రావణ మాసంలో స్వామివారిని   దర్శించుకుంటామని, ఇంట్లో కూడా ఈరన్న స్వామిని పూజిస్తామని తెలిపారు.



 

Updated Date - 2022-08-02T04:59:03+05:30 IST