జగనన్న కాలనీల్లో దొంగలు పడ్డారు

ABN , First Publish Date - 2022-09-19T05:48:04+05:30 IST

ప్రస్తుతం సిమెంట్‌, ఇసుక, కడ్డీలు ఇతర ఇంటి సామగ్రి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

జగనన్న కాలనీల్లో దొంగలు పడ్డారు
దొరపల్లి కొండలో జగనన్న కాలనీ ఇదే

రాత్రి వేళల్లో సిమెంట్‌, ఇసుక, కడ్డీలు మాయం
లబోదిబోమంటున్న లబ్ధిదారులు

ప్రస్తుతం సిమెంట్‌, ఇసుక, కడ్డీలు  ఇతర ఇంటి సామగ్రి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ తరుణంలో ఇల్లు కట్టుకోవాలంటేనే పేదలకు కష్టంగా మారింది. కొందరు డబ్బు ఉన్నప్పుడు... మరికొందరు అప్పులు చేసి కొద్దికొద్దిగా సామగ్రిని కొంటూ ఇళ్లను నిర్మించుకుంటున్నారు.  జగనన్న కాలనీల్లో రాత్రికి రాత్రే ఈ సామగ్రి మాయమవుతుండడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ ధరలకు సామగ్రిని మళ్లీ కొనుగోలు చేసి.. ఇళ్లు కట్టుకునే పరిస్థితుల్లో లేమని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు నిఘా ఉంచాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

డోన్‌, సెప్టెంబరు 18: డోన్‌ అర్బన్‌ జగనన్న కాలనీల్లో దొంగలు పడ్డారు. సిమెంటు, ఇసుక, తదితర  సామగ్రి రాత్రివేళల్లో చోరీకి గురవుతున్నాయి. దీంతో లబ్ధిదారులు ఆర్థికంగా నష్టపోతున్నారు. అయినా పట్టించుకునే నాథుడే కరువయ్యారన్న విమర్శలు ఉన్నాయి. పట్టణ సమీపంలోని దొరపల్లి కొండలోని ఉడుముల పాడు సమీపంలో జగనన్న కాలనీలను ఏర్పాటు చేశారు. వందల సంఖ్యలో లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకుంటున్నారు సామగ్రి చోరీకి గురువుతుండడంతో వారు ఆందోళన చెందుతున్నారు.

మాయమవుతున్న సిమెంటు, ఇసుక

దొరపల్లి కొండ జగనన్న కాలనీల్లో లబ్ధిదారులు సామగ్రిని సిద్ధం చేసుకుంటున్నారు. సిమెంటు, ఇసుక, కంకర తదిరత వాటిని ఇళ్ల వద్ద నిల్వ ఉంచుకుంటున్నారు. అయితే దాదాపు 30 మంది లబ్ధిదారుల ఇళ్ల వద్ద ఇసుక, సిమెంటును దొంగలు చోరీకి పాల్పడినట్లు లబ్ధిదారులు చెబుతున్నారు. బయట మార్కెట్‌లో ట్రాక్టరు ఇసుక ధర రూ.5 వేలు పలుకుతోంది. సిమెంటు ధర కూడా ఎక్కువగానే ఉంది. దీంతో దొంగలు చోరీ చేసి బయట అమ్మేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.  ఉడుములపాడు లేఅవుట్‌లోనూ పలువురు లబ్ధిదారులు ఇలాగే దొంగల బెడద సమస్యను ఎదుర్కొంటున్నారు.

నష్టపోతున్న లబ్ధిదారులు

డోన్‌ అర్బన్‌ జగనన్న కాలనీల్లో దొంగల బెడదతో పలువురు లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. దొరపల్లి కొండ ప్రాంతంలో పలువురు లబ్ధిదారుల సిమెంటు, ఇసుక మాయమవుతోంది. తిరిగి ఇసుకను లబ్దిదారులు కొనుగోలు చేయాలంటే.. నానా అవస్థలు పడుతున్నారు. బయట ట్రాక్టరు ఇసుక కొనుగోలు చేయాలంటే రూ.5వేల వరకు ధర పలుకుతోంది. సిమెంటు బస్తా ధర రూ.350 పైనే  ఉంటోంది. దీంతో లబ్దిదారులు అంత మొత్తం చెల్లించి ఇసుక, సిమెంటు కొనుగోలు చేయాలంటే ఆర్థికంగా నష్టపోతున్నారు. అసలే ఆర్థిక ఇబ్బందులతో అప్పులు చేసి ఇల్లు కట్టుకుంటున్నామని... దొంగల బెడద తో మరింత నష్టపోతున్నామని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మందుబాబులకు అడ్డాగా..

దొరపల్లి కొండలో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీ మందుబాబులకు అడ్డాగా మారిందన్న విమర్శలున్నాయి. కొండ ప్రాంతం కావడంతో రాత్రివేళల్లో మందుబాబుల తాకిడి ఎక్కువగా ఉన్నట్లు విమర్శలున్నాయి. కొండ ప్రాంతంలో మద్యం తాగి హల్‌చల్‌ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో కాలనీల్లో నిర్మిస్తున్న ఇళ్లకు భద్రత కూడా కరువైందని పలువురు లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.

ఇసుక, సిమెంటు చోరీ చేశారు

దొరపల్లి కొండ ప్రాంతంలోని జగనన్న కాలనీలో ఇల్లు నిర్మించుకుంటున్న ఇంటి దగ్గర నిల్వ ఉంచుకుంటున్న ట్రాక్టరు ఇసుక, 20 సిమెంటు బస్తాలను దొంగలు ఎత్తుకెల్లారు. నీటి కోసం ఉంచిన డ్రమ్మును కూడా తీసుకెళ్లారు. దాదాపు రూ.10వేల వరకు నష్టపోయాం.
 
- కోమలి, డోన్‌

దొంగల బెడద లేకుండా చూడాలి

దొరపల్లి కొండ లేఅవుట్‌లో ఇచ్చిన స్థలంలో ఇంటి నిర్మాణం కోసం ఉంచిన ట్రాక్టరు ఇసుక, 15 సిమెంటు బస్తాలను దొంగలు ఎత్తుకెళ్లారు. రాత్రివేళల్లో భద్రత కూడా లేకుండా పోయింది. దొంగల బెడద లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి.

 - సుజాత, డోన్‌

మాదృష్టికి రాలేదు

దొరపల్లి కొండ, ఉడుములపాడు జగనన్న కాలనీల్లో సిమెంటు, ఇసుక చోరీ అయినట్లు ఎవరూ మా దృష్టికి తీసుకురాలేదు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయాలి.

- నాగభూషణం, హౌసింగ్‌ డీఈ, డోన్‌
 
ఇనుప కడ్డీలు చోరీ

జూపాడుబంగ్లా: జూపాడుబంగ్లా జగనన్న కాలనీలో రాత్రిపూట అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని పలువురు లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్యం తాగి సీసాలు పడేసిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రూ.30 వేలు విలువ చేసే కడ్డీలు చోరీకి గురయ్యాయని సాదిక్‌ అనే లబ్ధిదారుడు ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులు రాత్రిపూట గస్తీ తిరిగితే అసాంఘిక కార్యకలాపాలు అరికట్టవచ్చని పలువురు అంటున్నారు.

Read more