మాండస్‌ దెబ్బకు ధరలు ఢమాల్‌

ABN , First Publish Date - 2022-12-13T01:01:09+05:30 IST

గత మూడు రోజులుగా మాండస్‌ తుపాన్‌ కారణంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో వివిధ పంట ఉత్పత్తుల ధరలు తగ్గిపోయాయి.

మాండస్‌ దెబ్బకు ధరలు ఢమాల్‌

కర్నూలు(అగ్రికల్చర్‌), డిసెంబరు 12: గత మూడు రోజులుగా మాండస్‌ తుపాన్‌ కారణంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో వివిధ పంట ఉత్పత్తుల ధరలు తగ్గిపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలకు తడిసిపోకముందే పంట ఉత్పత్తులను మార్కెట్‌ యార్డులకు తరలించడానికి రైతులు నానా ఇబ్బందిపడుతున్నారు. మార్కెట్‌ యార్డుల్లో కూడా నిల్వ చేసుకునే అవకాశం లేక ఆందోళనకు గురవుతున్నారు. ఖరీ్‌ఫలో కర్నూలు, నంద్యాల జిల్లాలో 6.30 లక్షల హెక్టార్లలో పత్తి, వేరుశనగ, వరి, మొక్కజొన్న, ఆముదాలు, ఉల్లి, మిరప ప్రధానంగా రైతులు సాగు చేశారు. ప్రస్తుతం ఈ పంటలన్నీ కోత దశకు వచ్చేశాయి. పది రోజుల కిందట మార్కెట్‌ యార్డుల్లో వివిధ పంట ఉత్పత్తులకు లభించిన ధర మాండస్‌ పుణ్యమా అని తగ్గిపోయాయి. పంట ఉత్పత్తులు మార్కెట్‌యార్డులకు తరలిద్దామనుకుంటే వర్షానికి రోడ్లన్నీ ఛిద్రమైపోయాయి. మరోవైపు మార్కెట్‌యార్డుల్లో పంట దిగుబడులను నిల్వ చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. పది రోజుల కిందట కర్నూలుతో పాటు ఆదోని, ఎమ్మిగనూరు, తదితర మార్కెట్‌ యార్డుల్లో రోజూ 10వేల క్వింటాళ్ల దాకా పత్తి, వేరుశనగ, మొక్కజొన్న, ఆముదాలు తదితర పంట ఉత్పత్తులను విక్రయించేందుకు రైతులు వచ్చారు. గత శనివారం కర్నూలు మార్కెట్‌ యార్డులో వేరుశనగ క్వింటం గరిష్ఠ ధర రూ.8,609 పలికింది. సోమవారం ఈ ధర రూ.6,811లకు పడిపోయింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో వ్యాపారులు ధర భారీగా తగ్గించేశారని రైతులు ఆరోపిస్తున్నారు. అదే విధంగా ఆముదాల ధర రూ.6,651 శనివారం పలకగా, ప్రస్తుతం రూ.6,600లకు అమ్ముడుపోయాయని అన్నారు. ఉల్లిగడ్డలు రెండు రోజుల వ్యవధిలో క్వింటం రూ.600 నుంచి రూ.509లకు పడిపోయింది. ఎండుమిరప కాయలు వారం కిందట క్వింటం రూ.28వేలు ఉండగా సోమవారం రూ.26వేలు పలికాయి. పది రోజుల కిందటి దాకా రోజూ కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని మార్కెట్‌ యార్డులకు వివిధ పంట ఉత్పత్తులు దాదాపు 10 వేల క్వింటాళ్లకు పైగానే విక్రయానికి వచ్చేవి. ఈ వర్షాల కారణంగా సోమవారం కేవలం 5వేలు క్వింటాళ్లు కూడా రాలేదు. కర్నూలు మార్కెట్‌ యార్డుకు సోమవారం కేవలం 116 క్వింటాళ్లు మాత్రమే రైతులు విక్రయానికి తీసుకువచ్చారు. కర్నూలు మార్కెట్‌ యార్డులో నిల్వచేసేందుకు అవకాశం లేదు. ఉన్న ఒక్క ప్లాట్‌ఫారాన్ని కూడా ఆధునికీకరిస్తున్నందు వల్ల కమిషన్‌ ఏజెంట్ల షాపుల ముందే రైతులు వేరుశనగ, ఆముదాలు, మొక్కజొన్న తదితర పంట ఉత్పత్తులను నిల్వ చేయాల్సి వస్తోంది.

Updated Date - 2022-12-13T01:01:12+05:30 IST