చెరవు

ABN , First Publish Date - 2022-07-05T06:19:35+05:30 IST

చెరువు ఊరుమ్మడి సంపద. వ్యవసాయానికి, పశువులకు చెరువులు ఆధారంగా ఉంటాయి.

చెరవు

30 ఎకరాలు అన్యాక్రాంతం 

ఎర్రచెరువు గట్టంతా ముళ్ల పొదలే 

చోద్యం చూస్తున్న ఎంఐ, రెవెన్యూ అధికారులు 


రుద్రవరం జూలై 4: చెరువు ఊరుమ్మడి సంపద. వ్యవసాయానికి, పశువులకు చెరువులు ఆధారంగా ఉంటాయి. భూగర్భ జలాలను ఇవి కాపాడతాయి. అలాంటి చెరువును కొందరు చెరబట్టారు. కబ్జాకు పాల్పడి సాగు చేసుకుంటున్నారు. రుద్రవరం మండలం ముకుందాపురం ఎర్రచెరువు వెనుకతట్టు ప్రాంతంలో సుమారు 30 ఎకరాలను సొంతం చేసుకున్నారు. ముకుందాపురం చెరువును ఒకప్పుడు రాజులు తవ్వించారు. మొదట్లో ఊరి  జనం దాహం, పశువుల దాహం ఈ చెరువు తీర్చేది. క్రమంగా దీని కింద భూములు సాగు చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఎర్రచెరువు వెనుక భాగంలో 30 ఎకరాలను కొందరు కబ్జా చేసి సాగు చేస్తున్నారు. 


 చెరువు వెనుక భాగంలో.. 


ఎర్రచెరువు వెనుక భూమిని కొందరు స్వార్థపరులు కబ్జా చేశారు. ఈ చెరువు నిర్వహణ, పర్యవేక్షణ మైనర్‌ ఇరిగేషన్‌ అధికారుల బాధ్యత. కానీ వారు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన అధి కారులు చోద్యం చూస్తున్నారు.  కబ్జాకు గురైన భూమి విలువ సుమారు రూ.3 కోట్లు ఉంటుందని అంచనా. 


 చోద్యం చూస్తున్న ఎంఐ, రెవెన్యూ అధికారులు 


ఎర్రచెరువును యఽథేచ్ఛగా కబ్జా చేస్తోంటే ఎంఐ, రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారని రైతులు అంటున్నారు. దీని ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు.  ఇలాగైతే భవిష్యత్తు తరాలకు చెరువులు అంటే ఏమిటో తెలియవని ఆవేదన చెందుతున్నారు. 


మరో తూము నిర్మించండి 


ముకుందాపురం ఎర్రచెరువుకు ఒక తూము మాత్రమే ఉంది. మరో తూము నిర్మించాలని రైౖతులు కోరుతున్నారు. ఉన్న ఒక తూముతో ఆయకట్టు భూములకు సాగునీరు సక్రమంగా అందడం లేదు. మరమ్మతు చేయాల్సి ఉంది 


చెరువుల లోపలి విస్తీర్ణం ఇలా.. 


ముకుందాపురం ఎర్రచెరువు లోపలి విస్తీర్ణం ఇలా ఉంది. 1194/2 సర్వే నంబర్‌లో 36 సెంట్లు, 1195లో 1.8 ఎకరాలు, 1196లో 8.32 ఎకరాలు, 1197లో 7.32 ఎకరాలు, 1198లో 6.6 ఎకరాలు, 1199లో 10.72 ఎకరాలు, 1200లో 6 ఎకరాలు, 1201లో 3 ఎకరాలు, 1202/1లో 2.76 ఎకరాలు, 1202/2లో 11.28 ఎకరాలు, 1203లో 5.7 ఎకరాలు, 1204లో 5.8 ఎకరాలు, 1205లో 9.84 ఎకరాలు, 1206లో 4.76 ఎకరాలు, 1207లో 4.54 ఎకరాలు, 108లో 5 ఎకరాలు, 1209లో 3.8 ఎకరాలలో చెరువు విస్తరించి ఉంది. ఈ చెరువుకింద ఆయకట్టు, ఇతర సాగుభూములు సుమారు 180 ఎకరాలు ఉన్నాయి. కానీ తూములు సరిగా లేకపోవడంతో పొలాలకు నీరు అందడం లేదని రైతులు అంటున్నారు. 

Read more