భార్యను హత్య చేసిన భర్త

ABN , First Publish Date - 2022-04-05T05:48:29+05:30 IST

తాలుకా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దిన్నెదేవరపాడు గ్రామంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి భార్యను హత్య చేశాడు. ఎర్రపుల్లయ్య అనే వ్యక్తి తన భార్య మద్దమ్మ (50)ను రోకలిబండతో కొట్టి హత్య చేశాడు.

భార్యను హత్య చేసిన భర్త

మద్యం మత్తులో ఘాతుకం


కర్నూలు, ఏప్రిల్‌ 4: తాలుకా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దిన్నెదేవరపాడు గ్రామంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి భార్యను హత్య చేశాడు. ఎర్రపుల్లయ్య అనే వ్యక్తి తన భార్య మద్దమ్మ (50)ను రోకలిబండతో కొట్టి హత్య చేశాడు. పోలీసుల వివరాల మేరకు ఎర్రపుల్లయ్య, మద్దమ్మ కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ఆరుగురు ఆడపిల్లలు, కొడుకు సంతానం. ఐదుగురు కూతుళ్లకు వివాహం చేశారు. కొద్ది కాలంగా పుల్లయ్య మద్యానికి బానిసయ్యాడు. ప్రతిరోజూ తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడేవాడు. గతంలో కూడా పలుసార్లు వీరి మధ్య గొడవ జరిగింది. కొడుకు, కూతురు ఉగాది పండుగ కోసం వారి పెద్ద సోదరి ఇంటికి వెళ్లారు. ఆదివారం రాత్రి ఎర్రపుల్లయ్య ఫుల్‌గా మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. రాత్రి ఇద్దరూ మిద్దెపైకి వెళ్లి పడుకున్నారు. ఉదయం చూస్తే మద్దమ్మ రక్తం మడుగులో పడి ఉంది. పక్కనే రోకలిబండ రక్తంతో తడిసి ఉంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఎర్రపుల్లయ్య పరారీలో ఉన్నాడు. కొడుకు బ్రహ్మానందన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శేషయ్య తెలిపారు.

Read more