కర్నూలుకు హైకోర్టు తరలించాలి

ABN , First Publish Date - 2022-03-16T05:52:11+05:30 IST

హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలని న్యాయవాదులు డిమాండ్‌ చేశారు. దీనిపై అసెంబ్లీ వెంటనే తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలన్నారు.

కర్నూలుకు హైకోర్టు తరలించాలి
బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్న న్యాయవాదులు

అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి
న్యాయవాదుల డిమాండ్‌.. బైక్‌ ర్యాలీ


కర్నూలు(లీగల్‌), మార్చి 15: హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలని న్యాయవాదులు డిమాండ్‌ చేశారు. దీనిపై అసెంబ్లీ వెంటనే తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలన్నారు. అడ్వకేట్‌ జేఏసీ కన్వీనర్‌, సీనియర్‌ న్యాయవాది వై.జయరాజు ఆధ్వర్యంలో న్యాయవాదులు మంగళవారం జిల్లా కోర్టు నుంచి కలెక్టరేట్‌ వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ పి.కోటేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. వై.జయరాజు మాట్లాడుతూ ఏపీ విభజన చట్టంలో వెంటనే సవరణలు చేసేందుకు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడిని తేవాలన్నారు. తమ డిమాండ్ల సాధనకు ఒక స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటు చేసి హైకోర్టు సాధనకు తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తెలిపారు. సీనియర్‌ మహిళా న్యాయవాది వి.నాగలక్ష్మిదేవి మాట్లాడుతూ చారిత్రాత్మకమైన శ్రీబాగ్‌ ఒప్పందం మేరకు కోస్తా ప్రాంతంలో, రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేయాలన్నారు. రాజధానిని కోల్పోయిన కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేస్తే రాయలసీమ అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో జేఏసీ సభ్యులు కె.కపిలేశ్వరయ్య, కె.ఓంకార్‌, పాపారావు, పుల్లారెడ్డి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మాసిపోగు సుబ్బయ్య, ప్రధాన కార్యదర్శి అబ్దుల్‌ కరీమ్‌, న్యాయవాదులు పాల్గొన్నారు.

Read more