భూ‘మాయ’ చేశారు

ABN , First Publish Date - 2022-03-18T05:55:15+05:30 IST

ఒకటి కాదు.. రెండు కాదు.. 25 ఎకరాలు. భూమే లేకున్నా రికార్డులు సృష్టించారు.

భూ‘మాయ’ చేశారు

అసలే లేని భూమికి రికార్డులు
ఆన్‌లైన్‌లో 25 ఎకరాల నమోదు
1-బీ, పాసుపుస్తకం చేసిన అధికారులు
ఇదే పొలంపై రూ.20 లక్షల రుణం
కలకలం రేపుతున్న మొలగవల్లి ఘటన
విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు
తహసీల్దార్‌కు బిగుసుకుంటున్న ఉచ్చు

ఆలూరు, మార్చి 17: ఒకటి కాదు.. రెండు కాదు.. 25 ఎకరాలు. భూమే లేకున్నా రికార్డులు సృష్టించారు. సబ్‌ డివిజన్‌ చేసి ఆన్‌లైన్‌లో ఎక్కించారు. పట్టాదారు పాసుపుస్తకాలూ ఇచ్చేశారు. ఇంకేం.. ఆస్తి హక్కు పత్రాలు పొందిన సదరు వ్యక్తి రూ.20 లక్షల రుణం తీసేసుకున్నాడు. అయితే అతను అనంతపురం జిల్లా ఉరవకొండ వాసి కావడంతో..  అక్కడి నుంచి ఆలూరుకు వచ్చి పొలం ఎలా చేయించుకున్నాడో అంతుబట్టడం లేదు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ సాగిస్తున్నారు.

ఆలూరు మండలం మొలగవల్లి గ్రామంలో 25 ఎకరాల భూమి.. అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన హరీష్‌బాబుకు వంశపారంపర్యంగా సంక్రమించిందంటూ తహసీల్దార్‌ హుసేన్‌సాబ్‌ రికార్డులు తయారు చేశారు. అస్సలు భూమే లేకున్నా సర్వే నం.894/డీలో 15.20 ఎకరాలు, సర్వే నం.864/డీలో 9.80 ఎకరాలు ఉన్నట్లు రికార్డులు సృష్టించారు. ఈ 25 ఎకరాల భూమికి సంబంధించి ఆన్‌లైన్‌ అడంగల్‌ 1-బీతోపాటు పట్టాదారు పాస్‌ పుస్తకాలు ఉరవకొండ వాసి పేరిట తయారు చేశారు. దీంతో హరీష్‌బాబు గత నెల 16న ఆలూరు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో 25 ఎకరాల భూమికి మార్ట్‌గేజి చేయించుకున్నారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం అధికారులు కూడా ఫీల్డ్‌ తనిఖీ చేయకుండానే డాక్యుమెంట్‌ (నెం.521/2022) ఇచ్చేశారు. మార్టిగేజి డాక్యుమెంట్లతో హరీష్‌బాబు బళ్లారిలోని ఓ బ్యాంక్‌లో రూ.20 లక్షల రుణం తీసుకున్నారు.

డబ్బులు చేతులు మారాయా?


మొలగల్లి వ్యవహారంలో డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో కంప్యూటర్‌ ఆపరేటర్లు, మీ సేవా నిర్వాహకుల ప్రమేయం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం అధికారులు కూడా డాక్యుమెంట్‌ రైటర్ల ప్రమేయంతో డాక్యుమెంట్‌ ఇచ్చినట్లు సమాచారం.

ప్రారంభమైన విచారణ

మొలగవల్లి భూ ఆక్రమాలు వెలుగులోకి రావడంతో అధికారులు విచారణ చేపట్టారు. బుధవారం తహసీల్దార్‌ హుసేన్‌సాబ్‌, ఆర్‌ఐ గుండాల నాయక్‌, వీఆర్వో సత్యనారాయణస్వామిని ఆదోని ఇన్‌చార్జి ఆర్డీవో మోహన్‌దాస్‌ విచారించారు. రికార్డులను పరిశీలించారు. పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని తెలిపారు.

పొరపాటున భూమి డబుల్‌ ఎంట్రీ అయ్యింది

మొలగవల్లి గ్రామంలో సర్వే నం.894, 864కు బదులు పొరపాటున 894/డీ, 894/డీ అని డబుల్‌ ఎంట్రీ అయింది. మీసేవా కేంద్రంలో చలానా కట్టినప్పుడు ఇలా జరిగింది. మా సిబ్బంది చూసుకోకుండా డబుల్‌ ఎంట్రీ చేశారు.  ఎలాంటి అక్రమాలు జరగలేదు. వాటిని సరి చేసి భూమిని రద్దు చేస్తాం. మున్ముందు ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూస్తాం.

-హుసేన్‌సాబ్‌, తహసీల్దార్‌, ఆలూరు

Read more