ఎదురూరులో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-09-17T05:48:57+05:30 IST

కర్నూలు రూరల్‌ మండలం ఎదురూరు గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

ఎదురూరులో ఉద్రిక్తత

గ్రామ సభను వాయిదా వేసిన అధికారులు
జరపాలంటూ విష్ణు వర్గం పట్టు
రహస్య ఓటింగ్‌ జరపాలని వైసీపీ డిమాండ్‌

కర్నూలు(రూరల్‌), సెప్టెంబరు 16: కర్నూలు రూరల్‌ మండలం ఎదురూరు గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ వర్గం, విష్ణు తరపు ప్రజలకు మధ్య వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం గ్రామ సచివాలయం ఆవరణలో సీతారామ దేవాలయం నిర్మాణంపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో అధికారులు గ్రామసభ నిర్వహించారు. ఇందులో దేవాలయ కట్టడంపై కులాలకు అతీ తంగా ఓటు హక్కు కలిగిన స్థానికులు చేతులు ఎత్తి తమ సంఘీభావం తెలిపాలని అధికారులు ముందుగా ప్రజలకు సూచించారు. ఈ ప్రక్రి యలో బహిరంగంగా ఎటువైపు ఎక్కువ చేతులు ఎత్తుతారో వారిని పరిగణలోకి తీసుకుని దేవాలయం నిర్మాణంపై తుది నిర్ణయం తీసుకుం టామని అధికారులు గ్రామస్థులకు తెలిపారు. సచివాలయ ఆవరణలో అప్పటికే వైసీపీ వర్గం ఒక వైపు, విష్ణు తరపు ప్రజలు మరోవైపు కూర్చు న్నారు. ఓటర్ల నుంచి సంతకాలు చేయించుకునే పనిలో అధికారులు నిమగ్నమై ఉండగా, విష్ణు వర్గానికి వచ్చిన జన ఆదరణ చూసిన వైసీపీ వర్గం తాము పోటీని ఎదుర్కోలేమని భావించి చేతులు ఎత్తే ప్రక్రియ కాకుండా రహస్య ఓటింగ్‌ చేపట్టాలని, అలాగైతేనే ఒప్పుకుంటామని, అధికారులను డిమాండ్‌ చేశారు. లేదంటే గ్రామసభను వాయిదా వేయాలని కోరారు. అధికార పార్టీ నుంచి తీవ్ర ఒత్తిళ్లు రావడంతో అధికారులు గ్రామసభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో విష్ణు వర్గం తరుపు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తు సభను జరపాలని పట్టుబడ్డారు. వారం నుంచి గ్రామంలో దండోరా వేయించి, తుది దశకు వచ్చేసరికి వాయిదా వేయడం సబబు కాదన్నారు. ఎట్టిపరిస్థితిలో గ్రామ సభను నిర్వహించాలని సచివాలయం ఎదుట ధర్నాకు దిగారు. దీంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తతకు దారి తీసింది. కర్నూలు డీఎస్పీ మహేష్‌, తాలుకా సీఐ శేషయ్య, మరో సీఐ, ఆరుగురు ఎస్సైలు పోలీసు బలగాలు రంగంలోకి సమస్యను కొలిక్కితెచ్చారు. రాతపూర్వకంగా ఇస్తే పై అధికా రులకు అందజేస్తామని, వారే అంతమ నిర్ణయం తీసుకుంటారని మం డలం తహసీల్దార్‌ వెంకటేష్‌ నాయక్‌, డీఎల్‌పీవో తిమ్మక్క, ఈవోఆర్డీ నాగేశ్వరరెడ్డి, విష్ణువర్గం తరుపు ప్రజలకు తెలిపారు. కాగా ప్రశాంతంగా ఉన్న గ్రామంలో వైసీపీ అనవసరంగా సమస్యను తీవ్రం చేసి గొడవలకు ఆజ్యం పోస్తుందని కొంతమంది గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. చేతకానపుడు ఇలాంటి సభను ఏర్పాటు చేయడం మంచిది కాదన్నారు.

Read more