హామీలను గాలిలో కలిపేశారు: సోమిశెట్టి

ABN , First Publish Date - 2022-02-23T05:37:45+05:30 IST

సీఎం జగన్‌ అధికారంలోకి రాకముందు నిరుద్యోగులకు, విద్యార్థులకు ఎన్నో హామీలు ఇచ్చారని, అయితే ప్రస్తుతం వాటన్నింటినీ గాలిలో కలిపేశారని టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం అద్యక్షుడు సోమిశెట్టి ఆరోపించారు.

హామీలను గాలిలో కలిపేశారు: సోమిశెట్టి
మాట్లాడుతున్న సోమిశెట్టి వెంకటేశ్వర్లు

కర్నూలు(అగ్రికల్చర్‌), ఫిబ్రవరి 22: సీఎం జగన్‌ అధికారంలోకి రాకముందు నిరుద్యోగులకు, విద్యార్థులకు ఎన్నో హామీలు ఇచ్చారని, అయితే ప్రస్తుతం వాటన్నింటినీ గాలిలో కలిపేశారని టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం అద్యక్షుడు సోమిశెట్టి ఆరోపించారు. మంగళవారం కర్నూలు నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగాలు, ఇతరత్రా మార్గాలు కల్పించకపోవడంతో యువత పక్క రాష్ట్రాలకు జీవనోపాధి కోసం వలసబాట పడుతున్నారని సోమిశెట్టి ఆరోపించారు. ఉన్నత చదువులు చదివిన యువకులు పక్క రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని, ఈ పరిస్థితికి ముఖ్యమంత్రి జగనే కారణమని సోమిశెట్టి విమర్శించారు. సీఎం జగన్‌ ఒక్క పరిశ్రమను కూడా రాష్ట్రానికి తేలేకపోయారని, బెదిరిస్తుండటంతో ఉన్న పరిశ్రమలు కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోయే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేయడం వల్ల లక్షలాది మంది యువకులు ఉపాది లేకపోవడంతో రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు దేశ విదేశాలకు వెళ్లి అక్కడి పారిశ్రామికవేత్తలను ఏపీ పరిశ్రమలను నెలకొల్పేందుకు ఎన్నో ప్రోత్సాహకాలు అందించారని తెలిపారు. అందువల్లనే ఏటా కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్న కర్నూలు జిల్లాలో సోలార్‌పవర్‌ ప్రాజెక్టు, అనంతపురంలో కియో కార్ల పరిశ్రమ మిగిలిన జిల్లాలో కూడా సిమెంటు పరిశ్రమలు ఏర్పాటయ్యాయన్నారు. అప్పట్లో వర్షాలు సక్రమంగా కురవకపోయినా.. జలాశయాల్లో తగినంత నీటినిల్వలు లేకపోయినా ఏరోజూ కూడా విద్యుత్‌ కోతలు లేకుండా చంద్రబాబు ముందు చూపుతో వ్యవహరించారని, అయితే ప్రస్తుత సీఎం ఏ మాత్రం పరిపాలన అనుభవం లేకపోవడం వల్ల వ్యవహరిస్తున్న తీరుతో విద్యుత్‌ కోతలు వేసవికి ముందే ప్రారంభమయ్యాయని అన్నారు. రైతులు కరెంటు కోతలతో కళ్లముందే పంటలు ఎండిపోతుంటే.. కన్నీళ్లు పెట్టుకుంటున్నారని, మరోవైపు పారిశ్రామికవేత్తలు కరెంటు కోతలతో కార్మికులను పని నుంచి తొలగించేందుకు నిర్ణయం తీసుకునే పరిస్థితులు వచ్చాయన్నారు. టీడీపీ కోడుమూరు ఇన్‌చార్జి ఆకేపోగు ప్రభాకర్‌, హనుమంతరావు చౌదరి, మంచాలకట్ట భాస్కర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read more