అభివృద్ధి పట్టని ముఖ్యమంత్రి: సోమిశెట్టి

ABN , First Publish Date - 2022-10-03T06:20:35+05:30 IST

మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యం కోసం కలలు కన్నారని, అయితే ముఖ్యమంత్రి జగన్‌ గ్రామాల అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదని టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మండిపడ్డారు.

అభివృద్ధి పట్టని ముఖ్యమంత్రి: సోమిశెట్టి
గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇస్తున్న టీడీపీ నాయకులు

కర్నూలు(అగ్రికల్చర్‌), అక్టోబరు 2: మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యం కోసం కలలు కన్నారని, అయితే ముఖ్యమంత్రి జగన్‌ గ్రామాల అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదని టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. గ్రామాల అభివృద్ధిపై నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సోమిశెట్టి ఆధ్వర్యంలో ఆదివారం టీడీపీ నాయకులు నిరసన చేపట్టారు. నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వద్ద ఉన్న గాంధీజీ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రాన్ని అందించి నిరసన వ్యక్తం చేశారు. సోమిశెట్టి మాట్లాడుతూ గాంధీ కలలుగన్న స్వరాజ్యాన్ని నెరవేర్చేందు కోసం తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకుందని, ఇందులో భాగంగానే సర్పంచులకు అధికారాలు కల్పించి కనీస వసతుల కల్పన కోసం నిధులను కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ ముఖ్యమైన తీర్మానాలను ఆమోదించినట్లు తెలిపారు. ఈ తీర్మానాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపేలా ఉద్యమాలను కొనసాగిస్తామన్నారు. దారి మళ్లించిన 14, 15 ఆర్థిక సంఘం నిధులను గ్రామ పంచాయతీల బ్యాంకు అకౌంట్లలో జమ చేయాలన్నారు. టీడీపీ నాయకులు అబ్బాస్‌, సత్రం రామకృష్ణుడు, మహేష్‌గౌడు, హనుమంతరావుచౌదరి, తిరుపాలు బాబు, జేమ్స్‌, చంద్రకళ, ఆశాలత, తదితరులు పాల్గొన్నారు.


Read more