అసాంఘిక కార్యకలాపాలపై నిఘా

ABN , First Publish Date - 2022-08-25T05:39:09+05:30 IST

అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెంచాలని ఎస్పీ రఘువీర్‌ రెడ్డి పోలీస్‌ అధికారులను ఆదేశించారు.

అసాంఘిక కార్యకలాపాలపై నిఘా

ఎస్పీ రఘువీర్‌రెడ్డి
బ్రాహ్మణకొట్కూరు పోలీసు స్టేషన్‌ తనిఖీ

నందికొట్కూరు రూరల్‌, ఆగస్టు 24: అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెంచాలని ఎస్పీ రఘువీర్‌ రెడ్డి పోలీస్‌ అధికారులను ఆదేశించారు. నందికొట్కూరు సర్కిల్‌ పరిధిలోని బ్రాహ్మణకొట్కూరు పోలీస్‌ స్టేషన్‌ను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నందికొట్కూరు, బ్రాహ్మణకొట్కూరు పరిసర ప్రాంతాలైన కోళ్ళబావాపురం, అల్లూరు గ్రామాలు తెలంగాణ రాష్ట్ర సరిహద్దులు కలిగి ఉండడంతో ఆ రాష్ట్రం నుంచి మద్యాన్ని అక్రమంగా తీసుకువస్తున్నారని, నిఘా పెంచాలని సూచించారు. అలాగే రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై కూడా నిఘా పెంచాలన్నారు. వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను తనిఖీ చేసి వాటి రికార్డులను పరిశీలించారు. పట్టుబడిన వాహనాలు ఎక్కువగా ఉన్నాయని.. వాటికి త్వరలో వేలం వేయిస్తామని తెలిపారు. పెండింగ్‌ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించారు. మట్కా, క్రికెట్‌ బెట్టింగ్‌, గుట్కా తదితర అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెట్టాలని సూచించారు. ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా నడుచుకోవాలని సూచించారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును త్వరగా ముగించి చార్జిషీట్‌ దాఖలు చేయాలన్నారు. ఆత్మకూరు డీఎస్పీ శృతి, సీఐ సుధాకరెడ్డి, ఎస్‌ఐ ఓబులేసు పాల్గొన్నారు.

Read more