సీమస్వరం... సిద్ధేశ్వరం

ABN , First Publish Date - 2022-05-31T05:06:04+05:30 IST

సిద్ధేశ్వరం... సీమ ప్రజల పోరాట స్వరం. తరతరాల వివక్షను వినిపించిన అస్తిత్వ గానం.

సీమస్వరం... సిద్ధేశ్వరం
సిద్దేశ్వరం అలుగు నిర్మాణ నమూన చిత్రాలు

  1. అలుగు పోరాటానికి ఆరేళ్లు  
  2. నిర్మిస్తే 50 టీఎంసీల నీటి నిల్వ 
  3. సీమ ప్రాజెక్టులకు సంపూర్ణంగా నీరందే అవకాశం 
  4. నేడు సిద్ధేశ్వరం సాధనకు జలదీక్ష 

ఆత్మకూరు, మే 30: 

 సిద్ధేశ్వరం...  సీమ ప్రజల పోరాట స్వరం. తరతరాల వివక్షను వినిపించిన అస్తిత్వ గానం. ఈ తరం సీమ ఉద్యమానికి ప్రభాతోదయం. కరువు.. ఆకలి... పేదరికం...  వలసలు... ఆత్మహత్యల విషాద రాయలసీమలో సిద్ధేశ్వరం అలుగు ఉద్యమం ఒక మేలుకొలుపు. అలుగు నిర్మాణానికి ప్రజా శంకుస్థాపన జరిగి మంగళవారానికి ఆరేళ్లు. ఈ సందర్భంగా అలుగు సాధన కోసం సిద్ధేశ్వరం దగ్గర జలదీక్ష కార్యక్రమం చేపట్టనున్నారు. 


 సిద్ధేశ్వరం అలుగు... సీమలో గత ఆరేళ్లుగా నిత్యం ప్రజల్లో నానుతున్న పేరు. కృష్ణానదిపై సిద్ధేశ్వరం వద్ద  శ్రీశైలం జలాశయానికి 860 అడుగుల ఎత్తులో అలుగు నిర్మిస్తే పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమ ప్రాజెక్టులకు నీరు అందుతుంది. రిజర్వాయర్‌లోకి వచ్చిన నీటిని వచ్చినట్లే కిందికి తరలించుకపోవడం వల్ల  పోతిరెడ్డిపాడు నుంచి నీరు సీమ ప్రాజెక్టులకు అందడం లేదు. అలుగు నిర్మిస్తే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. సుమారు 50 టీఎంసీల నీరు నిలువ ఉండటానికి అవకాశం వస్తుంది. ఈ లక్ష్యంతోనే సిద్ధేశ్వరం కోసం పోరాటం సాగుతోంది. ఆరేళ్ల కిందట ఈ ప్రజా శంకుస్థాపనకు వేలాది మంది రైతులు ఉవ్వెత్తున కదిలారు. 2016 మే 31వ తేదీన దీనికి శంకుస్థాపన చేశారు.


సీమ ప్రాజెక్ట్‌ల నీటి వినియోగం ఇలా...  

 తుంగభద్ర హై లెవల్‌ కెనాల్‌కి ఉన్న 32.5 టీఎంసీలలో 17 నుంచి 18 టీఎంసీల నీరు మాత్రమే సీమకు అందుతోంది.  ఎల్‌ఎల్‌సీ 29.5 టీఎంసీలో 11 టీఎంసీలు మాత్రమే విడుదల చేస్తున్నారు. కేసీ కెనాల్‌కు 39.9టీఎంసీల కేటాయించగా... 15టీఎంసీలు కూడా వాడుకోవడం లేదు. భైరవానితిప్ప 4.9టీఎంసీలలో కేవలం 0.5టీఎంసీల నీరే అందుబాటులోకి వస్తోంది. ఎస్సార్బీసీలో 19 టీఎంసీలు ఉండగా అందులో వినియోగించుకుంటున్నది కేవలం 7.8టీఎంసీలు మాత్రమే. స్థూలంగా చెప్పాలంటే సీమకు   హక్కుగా ఉన్న 133.7 టీఎంసీలలో  సగం అంటే 65 టీఎంసీలు కూడా వాడుకోవడం లేదు. ఇది కాక శ్రీశైలంలోని క్యారీ ఓవర్‌ కింద 60టీఎంసీలు,  పట్టిసీమ ద్వారా 45 టీఎంసీలు, పులిచింతల ఒప్పందం ప్రకారం 54 టీఎంసీల నీరు రాయలసీమకు రావాల్సి ఉంది. అంటే దాదాపు 159టీఎంసీల నీరు ఇంకా రాయలసీమ ప్రాంతానికి కేటాయించాల్సి ఉంది. 133.7 టీఎంసీలను వాడుకోడానికే జలాశయాలు నిర్మించలేదు. అప్పుడు 159 టీఎంసీలను వాడుకోడానికి ఏర్పాట్లు లేవు. అందువల్ల సిద్ధేశ్వరం అలుగు  నిర్మిస్తే 50 టీఎంసీల నీటిని నిల్వ  ఉంచేందుకు అవకాశం ఉంటుంది.  బ్యాక్‌వాటర్‌తో పనిచేసే పోతిరెడ్డిపాడు వద్ద 842 అడుగులతో ప్రారంభమై... కనీసం 18 అడుగుల నీరు తెలుగుగంగ, గాలేరు-నగరి, ఎస్సార్బీసీలకు అందుతుంది.  

సిద్ధేశ్వరంతోనే పోతిరెడ్డిపాడుకు మోక్షం 

 1971-78 కాలంలో పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ నిర్మాణ ప్రతిపాదన ముందుకు వచ్చింది. 1976 నుంచి 1988 వరకు శ్రీశైలం కుడిగట్టు ప్రధాన కాల్వ నిర్మాణ పనులు జరిగాయి.  పోతిరెడ్డిపాడు నుంచి విడుదల చేసిన నీరు శ్రీశైలం కుడిగట్టు ప్రధాన కాల్వ ద్వారా బానకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ వద్దకు చేరుతోంది. తెలుగుగంగ కాల్వ నీటి విడుదల పూర్తి సామర్థ్యం 11,150 క్యూసెక్కులు. ఎస్కేప్‌ చానల్‌ కాల్వ  సామర్థ్యం 11,150, ఎస్సార్బీసీ సామర్థ్యం 4960 క్యూసెక్కుల ప్రవాహం ఉండేలా క్రాస్‌రెగ్యులేటర్‌ను నిర్మించారు. మూడు జలద్వారాల్లో ఒక్కో ద్వారానికి మూడు గేట్ల చొప్పున మొత్తం 9గేట్లను అమర్చారు. ఇదిలా వుండగా 2006లో పోతిరెడ్డిపాడు ప్రధాన కాల్వను 11వేల క్యూసెక్కుల నుంచి 44వేల సామర్థ్యంతో చేపట్టిన విస్తరణ పనులు నేటికీ పూర్తి కాలేదు.  

ఆరేళ్లుగా  ప్రజా ఉద్యమం  

 రాయలసీమపై పాలకుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ..   సిద్ధేశ్వరం అలుగు  శంకుస్థాపన ఉద్యమం 2016లో మొదలైంది. అఖిలభారత రైతు సంఘాల కన్వీనర్‌ దశరథరామిరెడ్డి, సీనియర్‌ ఇంజనీర్‌ సుబ్బరాయుడు, రాయలసీమ విద్యావంతుల వేదిక కన్వీనర్‌ అరుణ్‌, సిద్ధేశ్వరం ప్రాజెక్ట్‌ సాధన కమిటీ అధ్యక్షుడు వైఎన్‌రెడ్డితో పాటు 30వేల మంది జనం ఆ ఉద్యమంలో తరలివచ్చారు. దీన్ని అడ్డుకునేందుకు పోలీసులు అనేక ప్రయత్నాలు చేశారు. అయినా  కపిలేశ్వరం వద్ద సీమ నేతలు సిద్ధ్దేశ్వరం అలుగు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ ఉద్యమ స్ఫూర్తితో 2017 ఏప్రిల్‌ 3న రాయలసీమ వ్యాప్తంగా సీమ సత్యాగ్రహం పేరిట కార్యక్రమాలను నిర్వహించారు. 2018 నవంబర్‌ 16న విజయవాడలో  శ్రీబాగ్‌ ఒడంబడికను అమలు చేయాలని దీక్ష చేపట్టారు. 2019లో ప్రజాపాదయాత్రను చేపట్టారు. 2020, 2021 సంవత్సరాల్లో కరోనా విపత్తు కారణంగా బహిరంగ కార్యక్రమాలు చేయలేదు. ఈ ఏడాది  జలదీక్ష  కార్యక్రమాన్ని చేపట్టారు. 

 నేడు సిద్ధేశ్వరానికి..   

 సిద్ధేశ్వరం వద్ద మంగళవారం రాయలసీమ సాగునీటి సమితి ఆధ్వర్యంలో జలదీక్ష కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. సీమలోని 8జిల్లాల  జిల్లాల నుంచి కపిలేశ్వరానికి చేరుకుని... అక్కడి నుంచి సుమారు 5కిమీల దూరంలో ఉన్న సిద్ధ్దేశ్వరానికి కాలినడకన వెళ్తారు. ఈ సందర్భంగా పలువురు సీమ నేతలు ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంపై తొలుత  పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో రాయలసీమ సాగునీటి సమితి నాయకులు  ఎస్పీ రఘువీర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆంక్షలను ఎత్తివేసినట్లు తెలిసింది. 

సిద్ధేశ్వరంతోనే సీమకు వెలుగు

సిద్ధ్దేశ్వరం అలుగు నిర్మాణంతోనే సీమ జిల్లాలకు మేలు జరుగుతుంది. ఈ ఉద్యమానికి సీమ ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తోంది. నీటి పంపకాల్లో రాయలసీమకు   తీవ్ర అన్యాయం జరిగింది. సిద్ధేశ్వరం అలుగు నిర్మించే వరకు మా పోరాటం ఆగదు. 

 బొజ్జ దశరథరామిరెడ్డి, రాయలసీమ సాగునీటి సాధన సమితి, కన్వీనర్‌Read more