రూ.943 కోట్లతో రహదారులు

ABN , First Publish Date - 2022-06-12T05:42:09+05:30 IST

జిల్లాలో పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ శాఖల ద్వారా రూ.943 కోట్లతో రహదారుల నిర్మాణం చేపడుతున్నట్టు కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు తెలిపారు.

రూ.943 కోట్లతో రహదారులు

మరో రూ.133.69 కోట్ల పనులకు ప్రతిపాదనలు

కలెక్టర్‌ కోటేశ్వరరావు


కర్నూలు(న్యూసిటీ) జూన్‌ 11: జిల్లాలో పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ శాఖల ద్వారా రూ.943 కోట్లతో రహదారుల నిర్మాణం చేపడుతున్నట్టు కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు తెలిపారు. శనివారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్సు హాలులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మరో రూ.133.69 కోట్లతో రహదారులకు ప్రతిపాదనలు పంపామన్నారు. పీఆర్‌ ద్వారా రూ.25.49 కోట్లతో 7 నియోజకవర్గాల్లో 216 కి.మీ పొడవున గుంతలు లేని రోడ్లుగా తీర్చిదిద్దేందుకు 60 పనులను చేపడతామని చెప్పారు. ఈ నెల 20 నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తయి, మూడు నెలల లోపల పనులను పూర్తి చేయిస్తామన్నారు. మరో 57 కిలోమీటర్ల రోడ్డుకు మరమ్మతు చేయడానికి రూ.133.69 కోట్లతో ప్రతిపాదనలు పంపించినట్టు తెలిపారు. వీటికి నెలాఖరులోగా ప్రభుత్వం నిధులు మంజూరు చేయనుందన్నారు. ఏపీ పీఆర్‌ రూరల్‌ రోడ్స్‌ ప్రాజెక్టు కింద రోడ్డు కనెక్టివిటీలేని, 250 జనాభా కంటే ఎక్కువ ఉన్న 85 నివాసిత గ్రామాల్లో రూ.189.11 కోట్లతో 190 కి.మీ. పొడవున రహదారుల నిర్మాణాన్ని చేపడతామన్నారు. ఇందులో 30.80 కి.మీ. రోడ్ల నిర్మాణం పూర్తయిందని... మిగిలిన 160 కి.మీ. అక్టోబర్‌ నాటికి పూర్తి చేస్తామన్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన కింద 91.07 కి.మీ. పొడవున రూ.27.03 కోట్లతో 8 రోడ్ల పనులు చేపట్టినట్లు తెలిపారు. సమావేశంలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-06-12T05:42:09+05:30 IST