రూ.80 కోట్లతో రహదారులకు మరమ్మతులు

ABN , First Publish Date - 2022-06-07T05:36:46+05:30 IST

జిల్లాలో రహదారులు, భవనాల శాఖ ద్వారా రూ.80 కోట్లతో రహదారులకు మరమ్మతులు జరుగుతున్నట్లు కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు వెల్లడించారు.

రూ.80 కోట్లతో  రహదారులకు మరమ్మతులు

 కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు 

కర్నూలు(కలెక్టరేట్‌), జూన 6: జిల్లాలో రహదారులు, భవనాల శాఖ ద్వారా రూ.80 కోట్లతో రహదారులకు మరమ్మతులు జరుగుతున్నట్లు కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు వెల్లడించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో రహదారులు, భవనాల శాఖ ద్వారా జిల్లాలో చేపట్టిన రోడ్ల నిర్మాణానికి సంబంధించిన నాడు-నేడు ఫొటో ప్రదర్శనను కలెక్టర్‌ కోటేశ్వరరావు, జాయింట్‌ కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డిలు తిలకించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆర్‌అండ్‌బీ పరిధిలోని రహదారుల మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2200 కోట్లు మంజూరు చేసిందని, అందులో భాగంగా కర్నూలు జిల్లాకు రూ.80 కోట్లు మంజూర్యాయని తెలిపారు. ఈ నిధులతో 324 కి.మీల రోడ్డు మరమ్మతులకు సంబంధించిన 46 పనులు జరుగుతున్నాయని, ఇందులో రూ.34 కోట్లతో 19 పనులు, 131 కి.మీల పొడవునా మరమ్మతులు పూర్తి చేశామని చెప్పారు. రూ.20 కోట్లతో 12 పనులకు సంబంధించి 80 కి.మీల పొడవునా రోడ్డు మరమ్మతు పనులు జరుగుతున్నాయని, ఈ పనులు వచ్చే జూన నెలాఖరులోపు పూర్తవుతాయన్నారు. మిగిలిన రూ.26 కోట్లతో 113 కి.మీల పొడవున చేపడుతున్న 15 మరమ్మతులను త్వరగా ప్రారంభించి వచ్చే జూలై నెలాఖరులోపు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు కలెక్టర్‌ తెలిపారు. పెంచికలపాడు నుంచి గూడూరు, నన్నూరు నుంచి చిన్నటేకూరు, పత్తికొండ నుంచి ఆదోని, కాల్వబుగ్గ నుంచి వెల్దుర్తి, చిన్న పెండేకల్‌ నుంచి ఆదోని తదితర ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయని కలెక్టర్‌ వివరించారు. ఈ కార్యక్రమంలో రహదారులు, భవనాల శాఖ ఎస్‌ఈ సి.శ్రీధర్‌ రెడ్డి, డీఈ శ్రీనివాసులు పాల్గొన్నారు.


Read more