రసాభాసగా మున్సిపల్‌ సమావేశం

ABN , First Publish Date - 2022-12-09T23:48:24+05:30 IST

కర్నూలు నగర మున్సిపల్‌ సర్వసభ్య సమావేశం శుక్రవారం రసాభాసగా సాగింది.

 రసాభాసగా మున్సిపల్‌ సమావేశం

చెత్త పన్ను తగ్గించాలన్న వైసీపీ కార్పొరేటర్లు

మేయర్‌, కమిషనర్‌ వివక్షపై టీడీపీ సభ్యుల ఆగ్రహం

పైపుల మాయం ఘటనకు సంబంధించి ‘ఆంధ్రజ్యోతి’ కథనాలపై సమావేశంలో చర్చ

కర్నూలు(న్యూసిటీ), డిసెంబరు 9: కర్నూలు నగర మున్సిపల్‌ సర్వసభ్య సమావేశం శుక్రవారం రసాభాసగా సాగింది. సుంకేసుల రోడ్డులోని నూతన కౌన్సిల్‌ హాలులో మేయర్‌ బీవై రామయ్య అధ్యక్షతన జరిగిన సమావేశానికి పాణ్యం, కర్నూలు ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్‌, కమిషనర్‌ ఎ.భార్గవతేజ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు కార్పొరేటర్లు సమస్యలను సమావేశం దృష్టికి తెచ్చారు. చెత్త పన్ను తగ్గించే విధంగా సమావేశంలో తీర్మానం చేయాలని వైసీసీ కార్పొరేటర్లు మేయర్‌ పోడియం వద్దకు వెళ్లి వినతి పత్రం అందజేశారు. మేయర్‌ వార్డులో ఇప్పటి వరకు సుమారు రూ.10 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని.. మిగతా వార్డుల్లో ఎందుకు చేయడం లేదని 50 వార్డు కార్పొరేటర్‌ ఎస్‌టీ.షేక్‌ అహ్మద్‌ మేయర్‌ను ప్రశ్నించారు.

ప్రారంభోత్సవాలకు ఎందుకు పిలవరు?

ఏది అడిగినా స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో పరిష్కరిస్తామని చెబుతున్నారని, అలాంటప్పుడు సర్వసభ్య సమావేశం ఎందుకు నిర్వహిస్తున్నారని 8వ వార్డు కార్పొరేటర్‌ కురువ పరమేష్‌ ప్రశ్నించారు. తమ వార్డుల్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు ఎందుకు పిలవరంటూ టీడీపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాతబస్తీలోని గడియారం ఆసుపత్రిలో వైద్యులు లేరని, పేషెంట్లు రావడం లేదని అలాంటప్పుడు రూ.40 లక్షలతో మరమ్మతులు చేయాలని నిర్ణయించడం సబబు కాదన్నారు. జమ్మి చెట్టు వద్ద రూ.47.93 కోట్ల అంచనా విలువతో మురుగునీటి శుద్ధి కేంద్రానికి 2020 సెప్టెంబరు 27న శంకుస్థాపన చేశారని, రెండు సంవత్సరాలైనా కేవలం పిల్లర్ల వరకే పరిమితమైందని, ఈ విషయంపై కమిషనర్‌ సమాధానం చెప్పాలని నిలదీశారు. గతంలో అమృత్‌ పథకం కింద కుళాయి కనెక్షన్లు ఉచితంగా ఇచ్చారని, ఇప్పుడేమో కుళాయి కనెక్షన్‌కు రూ.7 వేల నుంచి రూ.10 వేల దాకా వసూలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

మేయర్‌తో టీడీపీ కార్పొరేటర్ల వాగ్వాదం..

టీడీపీకి సంబంధించిన వార్డుల్లో మేయర్‌, కమిషనర్‌, అధికారులు వివక్ష చూపుతున్నారని కార్పొరేటర్లు అసహనం వ్యక్తం చేశారు. తమ వార్డుల్లో అభివృద్ధి పనులు మంజూరు చేయకుండా వైసీపీ కార్పొరేటర్ల వార్డుల్లోనే చేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఈ మేరకు మేయర్‌ పొడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. దీంతో మేయర్‌ గట్టిగా మాట్లాడవద్దని కార్పొరేటర్లపై మండిపడ్డారు. గత సమావేశంలో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఎజెండాను ఏ విధంగా సమావేశంలో ప్రవేశపెడతారని 4వ వార్డు కార్పొరేటర్‌ అర్షియా పర్హీన్‌ ప్రశ్నించారు. మరి కొందరు కార్పొరేటర్లు కూడా గత సమావేశంలో అడిగిన వాటికి సమాధానం చెప్పాలని కోరారు.

‘ఆంధ్రజ్యోతి’ కథనాలపై చర్చ

పుష్కరాల పైపుల సంగతి ఏమైందో చెప్పాలని 12వ వార్డు కార్పొరేటర్‌ క్రాంతికుమార్‌ ఆంధ్రజ్యోతిలో వచ్చిన పేపర్‌ కటింగ్‌తో నిరసన తెలిపారు. విచారణ కమిటీ వేసి 90 రోజులు గడుస్తున్నా ఎందుకు జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే కాంట్రాక్టర్‌కు అన్ని పనులు ఎలా ఇస్తారని కొందరు కార్పొరేటర్లు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత మంది కాంట్రాక్టర్లు ఉండగా ఒకే కాంట్రాక్టర్‌కు పనులు ఇవ్వడం వెనకాల ఉన్న మతలబు ఏంటో చెప్పాలని నిలదీశారు. ఇంజనీరింగ్‌ అధికారులపై పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. 25,26 వార్డులలో మూడేళ్లుగా డ్రైనేజీ సమస్య ఉంటే ఇప్పటి వరకు ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు. నగరంలోని 10, 11 వార్డుల్లో శానిటేషన్‌, డ్రైనేజీ పనులకు సంబంధించి ఇంజనీరింగ్‌ అధికారులు వివక్ష చూపుతున్నారని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ అన్నారు. కాంట్రాక్టర్లు పనులు దక్కించుకుని ప్రారంభించకుంటే వారి పేర్లను బ్లాక్‌లిస్టులో పెడతామని మేయర్‌ బీవీ రామయ్య హెచ్చరించారు. చెత్త పన్ను తగ్గించే విషయంలో కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పుష్కరాల పైపులకు సంబంధించి గతంలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కమిటీ వేశామని, కమిటీ ఇచ్చే నివేదిక బట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సమావేశంలో డిప్యూటీ మేయర్లు సిద్దారెడ్డి రేణుక, నాయకల్లు అరుణ, అదనపు కమిషనర్‌ రామలింగేశ్వర్‌, డిప్యూటీ కమిషనర్‌ ఎస్‌వి.రమాదేవి, ఇన్‌చార్జి ఎస్‌ఈ శేషసాయి, సిటీ ప్లానర్‌ ప్రదీప్‌ కుమార్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-09T23:48:28+05:30 IST