-
-
Home » Andhra Pradesh » Kurnool » Rasabhagasa Jodo Preparatory Meeting-MRGS-AndhraPradesh
-
రసాభాసగా జోడో సన్నాహక సమావేశం
ABN , First Publish Date - 2022-10-05T04:46:11+05:30 IST
రాహుల్ గాంధీ జోడో పాదయాత్రను విజయవంతం చేయడానికి ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశం గందరగోళాల మధ్య ఆరంభమైంది.

అంతర్గత కుమ్ములాటలు బట్టబయలు
పాదయాత్రను విజయవంతం చేయమని దిగ్విజయ్ విజ్ఞప్తి
కర్నూలు(అర్బన్), అక్టోబర్ 4: రాహుల్ గాంధీ జోడో పాదయాత్రను విజయవంతం చేయడానికి ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశం గందరగోళాల మధ్య ఆరంభమైంది. మంగళవారం నగరంలోని లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సభలో నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదాలు జరిగాయి. పార్టీలో తమ నేతకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని మాజీ ఎంపీ హర్షకుమార్ అనుచరులు సభా వేదిక పైకి దూసుకెళ్లారు. పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని రాష్ట్ర నాయకత్వంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరో వైపు ఏఐసీసీ ఎన్నికల డెలిగేట్ పాసులు అమ్ముకున్నారంటూ ఓ సీనియర్ నాయకుడిపై పార్టీ పెద్దల ఎదుట కొందరు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా కర్నూలు నగరం మాజీ డీసీసీ అధ్యక్షుడు ఆహమ్మద్ ఆలీఖాన్ తన అనుచరులతో నినాదాలు చేసుకుంటూ సభా వేదిక దగ్గరకు వెళ్లారు. ఆయన్ను వేదిక మీదకు రావాలంటూ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ కోరారు. అయితే ఆయన శైలజానాథ్ ఆహ్వానాన్ని తిరస్కరిస్తూ మధ్యలోనే ఆయన బయటకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో స్టేజీ పైకి పోలీసులు వెళ్లి కార్యకర్తలను ఆదుపు చేయవలసి వచ్చింది. దీంతో దిగ్విజయ్ సింగ్ సభను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. పోలీసులంతా బయటకు వెళ్లాలని, పార్టీ కార్యకర్తలంతా జోడో యాత్ర విజయవంతానికిగాను ఈ సమావేశానికి సహకరించాలని చేతులు జోడించి కోరారు. కాంగ్రెస్ పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని కోరారు. తిరిగి పార్టీని బలోపేతం చేసేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఈ నెల 18 నుంచి 21 వరకు జిల్లాలో సాగే రాహుల్ పాదయాత్రకు ప్రతి ఇంటి నుంచి కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. మాజీ మంత్రి జయరామ్ రమేష్ మాట్లాడుతూ పార్టీని తిరిగి అఽధికారంలోకి తెచ్చే బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. రాహుల్ పాదయాత్రతో 2014 ఎన్నికల్లో దేశంలో మోదీ పాలనకు చమర గీతం పాడాలని కోరారు. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ పూర్తిగా బీజేపీకి సహకరిస్తున్నాయని, కాంగ్రెస్ అధికారంలోకి రాగాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదాను అమలు చేస్తామని చెప్పారు. అనంతరం రాహుల్ జోడో యాత్రకు సంబంధించి నంద్యాల డీసీసీ లక్ష్మీనరసింహ ఆధ్వర్యంలో రూపొందించిన పాటల సీడీని పార్టీ పెద్దలు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రసిడెంట్ ఎన్. తులసిరెడ్డి, తెలంగాణ ఎంపీ ఉత్తమ్ కుమార్రెడ్డి, మాజీ మంత్రులు పల్లం రాజు, జేడీ. శీలం, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, ఉమెన్ చాందీ, మయ్యప్పన్, డీసీసీ అధ్యక్షుడు జే. లక్ష్మీనరసింహ యాదవ్, ఎం. సుధాకర్ బాబు, పీసీసీ అఽధికార ప్రతినిధి కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.