నంద్యాల జిల్లాలో వానలు.. వరదలు

ABN , First Publish Date - 2022-10-08T06:05:57+05:30 IST

ఖరీఫ్‌, రబీ సీజన్‌లలో సుమారు వంద హెక్టార్లలో మినుము పంటను రైతులు సాగు చేశారు.

నంద్యాల జిల్లాలో వానలు.. వరదలు
కోవెలకుంట్ల: చిన్నకొప్పెర్ల, వల్లంపాడు గ్రామాల మధ్య ప్రవహిస్తున్న నల్లవాగు

ఆళ్లగడ్డ, అక్టోబరు 7: ఖరీఫ్‌, రబీ సీజన్‌లలో సుమారు వంద హెక్టార్లలో మినుము పంటను రైతులు సాగు చేశారు. సాగు చేసిన మినుము పంట కురిసిన అధిక వర్షాలకు పసుపు పచ్చగా మారాయి. దీంతో రైతులు ఆశించిన దిగుబడులు సాధించలేమని ఆందోళన చెందుతున్నారు. 


చాగలమర్రి: మండలంలో ఎడతెరిపి లేకుండా నాలుగు రోజుల పాటు కురిసిన వర్షాలకు రైతులు కుదేలయ్యారు. గురువారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. ఈ వర్షంతో బ్రాహ్మణపల్లె, కలుగొట్లపల్ల్లె గ్రామాల సమీపంలోని వక్కిలేరు వంతెనలపై పొంగి ప్రవహించడంతో రాకపోకలు స్తంభించి పోయాయి. మల్లేవేముల గ్రామ సమీపంలోని కుందూనదిపై వరద నీరు పొంగి ప్రవహించింది. రాజోలి ఆనకట్ట వద్ద 13 వేల క్యూసెక్కులతో కుందూనది ఉధృతంగా ప్రవహించింది. చిన్నవంగలి, మూడురాళ్లపల్లె, చింతలచెరువు, పెద్దవంగలి, శెట్టివీడు, ముత్యాలపాడు తదితర గ్రామాల్లో రైతులు సాగు చేసిన మినుము, వేరుశనగ, ఉల్లి పంటలు దెబ్బతిన్నాయి. మొక్కజొన్న, జొన్న, పెసర, మినుము పంటలు నల్లబారి కుళ్లిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 


రుద్రవరం: మండలంలో భారీ వర్షం కురవడంతో వకుళానది, బంగారమ్మ వాగు, కొండవాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పేరూరు, చిలుకలూరు, ఎర్రగుడిదిన్నె గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. వకుళానది పరివాహక ప్రాంతం గ్రామాల ప్రజలను తహసీల్దార్‌ వెంకటశివ ఆధ్వర్యంలో గ్రామ రెవెన్యూ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. శుక్రవారం రుద్రవరం మండలంలో 48.4 ఎంఎం వర్షపాతం నమోదైంది. శ్రీరంగాపురం, డి.కొట్టాల, కోటకొండ, రుద్రవరం, చిన్నకంబలూరు, పెద్దకంబలూరు, ఆలమూరు, నరసాపురం, చిత్రేణిపల్లె, ముత్తలూరు, నల్లవాగుపల్లె గ్రామాల్లో మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. సుమారు 1,000 ఎకరాల్లో మొక్కజొన్న పంట దెబ్బతింది. మూడు రోజులుగా కురిసిన వర్షాలకు మొక్కజొన్న కండెలు మొలకెత్తాయి. సుమారు 1,500 క్వింటాళ్లు తడిచి ముద్దయ్యాయని రైతులు లబోదిబోమన్నారు. 


శిరివెళ్ల: శిరివెళ్ల-రుద్రవరం ప్రధాన రహదారిలోని మాలమాగు వాగుపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగుపై ఉన్న వంతెన తక్కువ ఎత్తులో ఉండడంతో ఓ మోస్తరు వర్షం కురిసినా పై నుంచి వచ్చే వరద నీటితో వాగుపై రాకపోకలు నిలిచిపోతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి వాగుపై వంతెన నిర్మాణ పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. 


ఉయ్యాలవాడ: మండలంలోని కుందూనదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వెలుగోడు రిజర్వాయర్‌ నుండి దిగువకు నీటిని విడుదల చేయటంతో కుందూనది ఉధృతంగా ప్రవహిస్తోంది. రూపనగుడి బ్రిడ్జీపైకి కేవలం అడుగు దూరం మాత్రమే ఉంది. దీంతో రూపన గుడి-బోడెమ్మనూరు, బోడెమ్మనూరు-ఆళ్లగడ్డకు రాకపోకలు నిలిచి పోయాయి. 


కోవెలకుంట్ల: గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కోవెలకుంట్ల సమీపంలోని కుందూ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. కోవెలకుంట్ల మండల పరిధిలోని వల్లంపాడు, లింగాల, చిన్నకొప్పెర్ల, పెద్దకొప్పెర్ల గ్రామాల మధ్యనున్న కప్పలవాగు, నల్లవాగులు ఉఽధృతంగా ప్రవహిస్తున్నాయి. కోవెలకుంట్ల నుండి వెళగటూరు - లింగాల గ్రామాల మీదుగా నంద్యాలకు వెల్లే ఆర్‌అండ్‌బి రహదారిలో ఈ వాగులు ఉండటంతో ఈ వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కుందూ వెంట సాగు చేసిన పంట పొలాలు నీటమునిగాయి. Read more