‘భక్తులకు మెరుగైన సేవలు అందించండి’

ABN , First Publish Date - 2022-08-18T05:03:00+05:30 IST

శ్రీశైలం దేవస్థానం పరిధిలోని సత్రాలకు వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించాలని ఈవో లవన్న, ట్రస్టుబోర్డు చైర్మన రెడ్డివారి చక్రపాణిరెడ్డి సూచించారు.

‘భక్తులకు మెరుగైన సేవలు అందించండి’

శ్రీశైలం, ఆగస్టు 17: శ్రీశైలం దేవస్థానం పరిధిలోని సత్రాలకు వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించాలని ఈవో లవన్న, ట్రస్టుబోర్డు చైర్మన రెడ్డివారి చక్రపాణిరెడ్డి సూచించారు. బుధవారం దేవస్థానం కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. భక్తులకు సౌకర్యాల కల్పనపై సత్రాల నిర్వాహకులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. క్షేత్ర పవిత్ర కాపాడుతూ సత్రాల నిర్వహణను మరింత మెరుగుపర్చుకోవాలని చెప్పారు. భక్తుల పట్ల మర్యాదపూర్వకంగా మెలగాలని తెలిపారు. ఆలయ వేళలు, ఆలయంలో జరిగే ఆర్జిత సేవల గురించి వివరాలు తెలిపే బోర్డులను సత్రాల్లో పొందుపరుచాలని పేర్కొన్నారు. సత్రాల ప్రాంగణంలో పచ్చదనం పెంపొందించాలని అన్నారు. ప్రత్యేకించి శ్రీశైలాన్ని ప్లాస్టిక్‌ రహిత క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు సత్రాల నిర్వాహకులు తమవంతు సహకారం తప్పక అందించాలన్నారు. సమావేశంలో ధర్మకర్తల మండలి సభ్యులు విరుపాక్షయ్య, హనుమంతనాయక్‌, తన్నీరుధర్మరాజు, కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్‌ రామకృష్ణ, ఏఈవో నటరాజన, రెవెన్యూ విభాగం పర్యవేక్షకులు గిరిజామణి తదితరులు ఉన్నారు.

పాలధార - పంచధార పరిశీలన : 

శ్రీశైలంలోని పాలధార-పంచధారలను దేవస్థానం ఈవో లవన్న, ట్రస్టుబోర్డు చైర్మన రెడ్డివారి చక్రపాణిరెడ్డి బుధవారం పరిశీలించారు. ఆదిశంకరుల విగ్రహ వేదికను మరింతగా విస్తరింపజేయాలని సూచించారు. వేదికకు గ్రానైట్‌ బండపరుపును వేయాలని సూచించారు. అదేవిధంగా పాలధార- పంచధార వద్ద నిర్మించిన నూతన ఆలయాన్ని పరిశీలించి విగ్రహ ప్రతిష్టకు వీలుగా శిల్పశాస్త్ర ప్రమాణాలను రూపొందించాలని సూచించారు. 

 రేపు సామూహిక వరలక్ష్మీ వ్రతం

  శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈవో లవన్న బుధవారం తెలిపారు. ఈ నెల 5వ తేదిన శ్రావణమాసంలో రెండో శుక్రవారాన్ని పురస్కరించుకుని ఈ వ్రతాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చెంచుల ముత్తైదుల కోసం ప్రత్యేకంగా శ్రీశైలంలోని చంద్రవతి కళ్యాణ మంటపంలో సామూహిక వరలక్ష్మీవ్రతాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఇందుకోసం శ్రీశైలం ఐటీడీఏ వారి సూచనల మేరకు చెంచు ముత్తైదులను ఎంపిక చేసినట్లు తెలిపారు. కాగా సామూహిక వ్రతంలో పాల్గొనేవారు గురువారం ఉదయం 10 ంగంటల నుంచి సాయంత్రం 5గంటలలోపు శ్రీశైలంలోని ప్రజాసంబంధాల విభాగం కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు.


 

Updated Date - 2022-08-18T05:03:00+05:30 IST