కష్టపడి పనిచేసే వారికే ప్రాధాన్యం

ABN , First Publish Date - 2022-02-19T05:50:33+05:30 IST

పార్టీ అభ్యున్నతి కోసం కష్టపడి పని చేసే వారికి ప్రాధాన్యం ఉంటుందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కేఈ శ్యాంబాబు అన్నారు.

కష్టపడి పనిచేసే వారికే ప్రాధాన్యం

కేఈ శ్యాంబాబు

మద్దికెర, ఫిబ్రవరి 18: పార్టీ అభ్యున్నతి కోసం కష్టపడి పని చేసే వారికి ప్రాధాన్యం ఉంటుందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కేఈ శ్యాంబాబు అన్నారు. శుక్రవారం మద్దికెర గ్రామంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన తెలుగుయువత మండల కార్యదర్శి చంద్రమోహన్‌ను ఆయన పరామర్శించారు. అనంతరం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్‌ స్వగృహంలో విలేఖర్లతో మాట్లాడుతూ పార్టీ అభ్యున్నతి కోసం శక్తివంచన లేకుండా పనిచేసే కార్యకర్తలకు, నాయకులకు ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పనిచేసి పార్టీ గెలుపే ధ్యేయంగా పని చేయడానికి సిద్ధంగా ఉండాలన్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి గ్రామంలో బూత్‌ కమిటీలు, మండల కమిటీలు సమన్వయంతో పనిచేసి పార్టీ పటిష్టతకు కృషి చేయాలన్నారు. వైసీపీ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా రాజ్యాంగ వ్యవస్థను భ్రష్టు పట్టించిందన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని, అందుకోసం ప్రతి ఒక్కరు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఉన్నఫలంగా హంద్రీనీవా నీరు నిలిపివేయడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా హంద్రీనీవాకు నీరు వదలాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో మాజీ జడ్పీటీసీ పురుషోత్తంచౌదరి, జమేదార్‌ రాజన్నయాదవ్‌, జిల్లా టీడీపీ కార్యవర్గ సభ్యుడు లక్ష్మీనారాయణ, టీడీపీ పట్టణ అధ్యక్షుడు గడ్డం రామాంజులు, మండల మహిళా అధ్యక్షురాలు కవిత, మాజీ ఎంపీటీసీలు మహమ్మద్‌రఫీ, సుధాకర్‌చౌదరి, నాయకులు ఉదయ్‌కుమార్‌, రవిగౌడ్‌, రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు.

Read more