పిన్నాపురం భూముల ముఠా అరెస్టు

ABN , First Publish Date - 2022-12-13T01:03:12+05:30 IST

నంద్యాల జిల్లా పాణ్యం మండలం పిన్నాపురంలోని ప్రభుత్వ భూముల గోల్‌మాల్‌కు పాల్పడిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.

పిన్నాపురం భూముల ముఠా అరెస్టు

161 ఎకరాల ప్రభుత్వ భూములను దోచేందుకు యత్నం

రెవెన్యూ రికార్డులు తారుమారు చేసిన వైనం

ముగ్గురు నిందితుల అరెస్టు.. పరారీలో పాణ్యం ఆర్‌ఐ

వివరాలు వెల్లడించిన ఎస్పీ రఘువీర్‌రెడ్డి

నంద్యాల (నూనెపల్లె), డిసెంబరు 12: నంద్యాల జిల్లా పాణ్యం మండలం పిన్నాపురంలోని ప్రభుత్వ భూముల గోల్‌మాల్‌కు పాల్పడిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. రూ.14 కోట్ల విలువ చేసే 161 ఎకరాల ప్రభుత్వ భూమిని దోచుకునేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికారు. పాణ్యం ఆర్‌ఐ రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి భూ దందాకు తెరలేపిన వైనం కలకలం రేపింది. వీఆర్వో ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రఘువీర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. పాణ్యం మండలం పిన్నాపురంలోని 161 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసేందుకు నకిలీ ముద్రలను ఉపయోగించి ఆర్‌ఎస్‌ఆర్‌ 1908 రికార్డులు ట్యాంపరింగ్‌ చేసి భూమిని కాజేయాలని యత్నించారు. నిందితుల్లో ఏ-2గా ఉన్న గడివేముల మండలం ఒండుట్ల గ్రామానికి చెందిన భూమని నాగేశ్వరరావు పాణ్యం మండలంలోని పిన్నాపురంలో కరిమద్దెల చిన్న సుబ్బయ్య అలియాస్‌ రాముడు, అతని అక్క కరిమద్దెల నాగమ్మ ఇద్దరు గతంలో గ్రామంలో నివాసం ఉండేవారు. ప్రస్తుతం వారు గ్రామంలో లేకపోవడంతో వారికి సంబంధించిన ఎనిమిది ఎకరాల పొలం చాలా ఏళ్ల నుంచి సాగులో లేదు. దీంతో ఆ పొలాలను స్వాధీనం చేసుకునేందుకు నకిలీ ఆధార్‌ కార్డుతో 2020 ఆగస్టు 28న పాణ్యంలోని సబ్‌ రిజిస్టర్‌ ఆఫీసులో భూమని నాగేశ్వరరావు.. తన భార్య సరస్వతి పేరున, అలాగే మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన యల్లప్ప పేరు మీద రిజిస్టర్‌ చేయించాడు. ఈ అంశంపై బాధితులు ఫిర్యాదు చేయడంతో భూమని నాగేశ్వరరావుపై 2021లో పాణ్యం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. కేసు సివిల్‌ కోర్టులో పెండింగ్‌లో ఉండగా రెవెన్యూ అధికారులు ఆన్‌లైన్‌ అడంగల్‌లో ఎర్రచుక్క గుర్తు పెట్టారు. దీంతో భూమని నాగేశ్వరరావు తన దూరపు బంధువు, వరుసకు బావమరిది అయిన పాణ్యం ఆర్‌ఐ ఆవుల శేషాద్రి సహాయం కోరారు. ఆర్‌ఎస్‌ఆర్‌ 1908 రిజిస్టర్‌లో వివాదంలో ఉన్న పొలం సర్వే నెంబరుకు ఎదురుగా పూర్వీకుల పేర్లు ఉంటే కోర్టు తీర్పు అనుకూలంగా వస్తుందని ఆర్‌ఐ సలహా ఇచ్చాడు. పిన్నాపురం భూములను ఎకరా రూ.8 నుంచి రూ.10 లక్షల ప్రకారం గ్రీన్‌కో సోలార్‌ కంపెనీ కొనుగోలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ సర్వే నెంబర్లలో పూర్వీకుల పేర్లు నమోదు చేసి సోలార్‌ కంపెనీకి అమ్మేందుకు ప్లాన్‌ చేశారు. నాగేశ్వరరావు తన స్నేహితులైన పాణ్యం మండలం పిన్నాపురం గ్రామానికి చెందిన గువ్వల వెంకటరమణ, సంజామల మండలం నొస్సం గ్రామానికి చెందిన కొట్టం వెంకట రమణలతో కలిసి నంద్యాల పట్టణంలోని శ్రీరామ కంప్యూటర్స్‌ రబ్బర్‌ స్టాంప్స్‌లో వారి పూర్వీకుల పేర్లను నకిలీ స్టాంప్‌లు తయారు చేయించారు. ఆర్‌ఐ శేషాద్రి సమక్షంలో ఆర్‌ఎస్‌ఆర్‌ 1908 రిజిస్టర్‌లో ప్రభుత్వ భూములకు సంబంధించిన స్థానంలో నకిలీ స్టాంప్‌లతో పేర్లు ముద్రించారు. పిన్నాపురం వీఆర్వో వనమోజ విజయ శ్రీనివాస్‌కు రికార్డులను పరిశీలించే క్రమంలో అనుమానం వచ్చింది. దీంతో ఈ నెల 6వ తేదీన పాణ్యం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పాణ్యం ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి, సిబ్బంది విచారణలో భూమని నాగేశ్వరరావు, గువ్వల వెంకట రమణ, కొట్టం వెంకటరమణలను నిందితులని తేలడంతో దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నిందితులను పాణ్యం మండలం బలపనూరు మెట్ట వద్ద ఆదివారం అరెస్టు చేశారు. భూదందా వ్యవహారంలో ప్రధాన నిందితుడుగా ఉన్న పాణ్యం ఆర్‌ఐ శేషాద్రి పరారీలో ఉన్నాడు. ఆయన ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు ఎస్పీ రఘువీర్‌రెడ్డి పేర్కొన్నారు. సమావేశంలో అడిషనల్‌ ఎస్పీ అడ్మిన్‌ రమణ, నంద్యాల డీఎస్పీ మహేశ్వరరెడ్డి, పాణ్యం పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

పాణ్యం ఆర్‌ఐ సస్పెన్షన్‌

పాణ్యం: పాణ్యం ఆర్‌ఐ శేషాద్రిని సస్పెండ్‌ చేసినట్లు పాణ్యం తహసీల్దారు మల్లికార్జున రెడ్డి సోమవారం రాత్రి తెలిపారు. పిన్నాపురం భూముల విషయంలో సస్పెండ్‌ చేసినట్టు కలెక్టరు మనజీర్‌ జిలానీ సామూన్‌ ఉత్తర్వులు జారీ చేశారని వివరించారు.

Updated Date - 2022-12-13T01:03:16+05:30 IST