వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారు..

ABN , First Publish Date - 2022-09-18T05:11:23+05:30 IST

వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ అన్నారు.

వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారు..

  1. పెరిగిపోయిన ధరలతో సామాన్యుల కుదేలు
  2. పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌

కర్నూలు(అర్బన), సెప్టెంబరు 17: వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ అన్నారు. శనివారం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రూ.8 కోట్ల లక్షల అప్పులు చేసి పాలించే ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. సీఎం జగన్మోహనరెడ్డి వైసీపీకి అధ్యక్షుడు మాత్రమే కాదని, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని గుర్తించి పాలన చేయాలని కోరారు. ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని, రైతులను విస్మరించారని విమర్శించారు. శాంతిభద్రతలు కరువయ్యాయని, ప్రజలను మభ్యపెట్టేందుకు మరోసారి మూడు రాజధానుల అంశం తెరపైకి తెచ్చారని అన్నారు. ఉత్తరాంధ్ర భూములపైన వైసీపీ నాయకులు కన్ను పడిందని, దోపిడీకి తెరలేపారని ఆరోపించారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య మానవుడు కుదేలై పోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు సుధాకర్‌బాబు, పీసీసీ అధికార ప్రతినిధి కరుణాకర్‌, ఐఎనటీయూసీ జిల్లా అధ్యక్షుడడ్రుబతుకన్న, ఎనఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు నాగమధు యాదవ్‌, దేవిశెట్టి ప్రకాష్‌, బాబు రావు, ఎం. సుంకన్న తదితరులు పాల్గొన్నారు.


Read more