పక్క జిల్లాకు మన నీరు

ABN , First Publish Date - 2022-01-03T05:40:36+05:30 IST

జిల్లాకు రావాల్సిన నీటివాటాను పక్కజిల్లా అనంతపురానికి తరలించుకు పోయినా అడిగేనాథుడే లేడని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి విమర్శించారు.

పక్క జిల్లాకు మన నీరు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి

  1. ఎమ్మెల్యేలు, ఎంపీలు నిద్రపోతున్నారా..? 
  2. కేంద్ర మాజీ మంత్రి కోట్ల ఆగ్రహం


ఎమ్మిగనూరు, జనవరి 2: జిల్లాకు రావాల్సిన నీటివాటాను పక్కజిల్లా అనంతపురానికి తరలించుకు పోయినా అడిగేనాథుడే లేడని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి విమర్శించారు. ఎమ్మిగనూరులో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తుంగభద్ర డ్యాంలోకి ఈ ఏడాది దాదాపు 205 టీఎంసీల నీరు చేరిందని, ఈ లెక్క ప్రకారం కర్నూలు జిల్లాలోని కేసీ కెనాల్‌ వాటా కింద 10.5 టీఎంటీల నీరు సుంకేసులలో ఉండాలని అన్నారు. అయితే తుంగభద్ర డ్యాం నుంచి హెచ్‌ఎల్‌సీ ద్వారా అనంతపురం జిల్లాకు 5 టీఎంసీల నీరు తరలించారని, ఈ విషయం జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలకు తెలుసా అని ప్రశ్నించారు. మనవాటా నీరు పక్కజిల్లాకు తరలిస్తున్నా  ఎమ్మెల్యేలు, ఎంపీలు నిద్రపోతున్నారా అని మండిపడ్డారు. దీన్ని ఎందుకు అడ్డుకోవటం లేదని ప్రశ్నించారు. రబీలో కేసీ రైతులకు సాగునీరు లేక ఇబ్బందిపడే పరిస్థితి ఉంటుందని అన్నారు. అంతేగాక కర్నూలులో నీటి ఎద్దడి ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఎమ్మిగనూరు ప్రాంతానికి నాగలదిన్నె బ్రిడ్జి ఎంతో ముఖ్యమని, రెండేళ్ల క్రితం తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి భూసేకరణ చేయించానని కోట్ల అన్నారు. ఆర్‌అండ్‌బీ అధికారులు దానివైపు కన్నెత్తిచూడటం లేదని ఆరోపించారు. ప్రభుత్వం దగ్గర డబ్బు లేనందుకే బ్రిడ్జి గురించి పట్టించుకోవటం లేదని, దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ముఖ్యమంత్రి అంటున్నారని, ఏటా పింఛన్‌ పెంచుతామని చెప్పి రెండున్నరేళ్లకు సగమే పెంచారని విమర్శించారు. కల్లబొల్లిమాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని, వైసీపీ ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలం అయిందని అన్నారు. టీడీపీ సర్పంచ్‌లు ఉన్న చోటల్లా వేధిస్తున్నారని, అభివృద్ధి చేయకుండా అడ్డుపడుతున్నారని అన్నారు. గోనెగండ్ల మేజర్‌ పంచాయతీ విషయంలో ఇదే జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  రాబోయే రోజుల్లో టీడీపీని ఆదరించాలని ప్రజలను కోరారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తిచేస్తామని అన్నారు. సమా వేశంలో మాజీ ఎంపీపీ కృష్ణారెడ్డి, పరమేశ్వర రెడ్డి, గోనెగండ్ల, అలువాల సర్పంచ్‌లు హైమావతి, బాషా, మాజీ కౌన్సిలర్లు వెంకటేశ్వరరెడ్డి, మాచాని శివకుమార్‌, నాయకులు ఆదినారాయణరెడ్డి,  సుధాకర్‌శెట్టి, కదిరికోట ఆదెన్న, కడివెళ్ల లింగన్న, ఉరుకుందగౌడ్‌, ఉప్పర ఆంజనేయులు, అల్తాఫ్‌, రంగముని, వీరారెడ్డి, కందనాతిశీను, వీరుపాక్షిరెడ్డి, కమలనాభరెడ్డి పాల్గొన్నారు. 


నాలుగు రోజులకు ఒకసారి నీరు


గోనెగండ్ల మేజర్‌ పంచాయతీలో నాలుగురోజులకు ఒకసారి తాగునీరు వస్తోందని సర్పంచ్‌ హైమవతి అన్నారు. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఎస్‌ఎస్‌ ట్యాంకును పంచాయతీకి అప్పగించాలని కోరినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పైపులైన్‌ పనులు పూర్తి అయ్యాయని, కనెక్షన్‌ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. పంచాయతీ తీర్మానం చేసి ఇచ్చినా, పక్క గ్రామపంచాయతీ తీర్మానంతో నామినేషన్‌ను పొడిగిస్తున్నారని, కావాలనే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. టెండర్‌ వేస్తామని చెప్పి వేయటం లేదని అన్నారు.

Read more