నిఘా కళ్లకు మామూళ్ల గంతలు

ABN , First Publish Date - 2022-11-30T00:25:37+05:30 IST

ఆదోని నుంచి 15 కి.మీలు ప్రయాణిస్తే కర్ణాటక సరిహద్దు దాటేస్తారు. బియ్యం మాఫియాకు ఇదే రాచమార్గం.

నిఘా కళ్లకు మామూళ్ల గంతలు
ఎమ్మిగనూరు వద్ద సీజ్‌ చేస్తున్న పేదల బియ్యం (ఫైల్‌)

నెలనెలా సరిహద్దు దాటుతున్న 45-50 లారీల రేషన్‌ బియ్యం

కిలో రూ.7కు కొనుగోలు.. కర్ణాటకలో రూ.12 నుంచి రూ.14కు విక్రయం

నెలకు మాఫియా లాభం రూ.30 లక్షల పైమాటే..

తెర వెనుక చక్రం తిప్పుతున్న ‘చిన్నబాస్‌’

ఉమ్మడి జిల్లాలో రూ.25 కోట్ల మాయ

(కర్నూలు-ఆంధ్రజ్యోతి)

ఆదోని నుంచి 15 కి.మీలు ప్రయాణిస్తే కర్ణాటక సరిహద్దు దాటేస్తారు. బియ్యం మాఫియాకు ఇదే రాచమార్గం. ప్రభుత్వం పేదలకు ఇచ్చే రాయితీ బియ్యం లారీ సరిహద్దు దాటిస్తే రూ.5 లక్షలకు పైగా లాభం. నిఘా కళ్లకు ‘మామూళ్ల’ గంతలు కట్టేశారు. అక్రమ రవాణాకు తెర తీశారు. నిత్యం రెండు మూడు చొప్పున నెలకు సరాసరి 45 నుంచి 50 లారీల బియ్యం ఆదోని నుంచి కర్ణాటకకు తరలిపోతున్నాయి. తెర వెనుక చిన్నబాస్‌ చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. నల్లబజారుకు పేదల బియ్యం తరలించి నెలకు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షలకు పైగా అకమ్రార్జన ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రాలయం, ఎమ్మిగనూరు, డోన్‌, నందికొట్కూరు, బనగానపల్లె ప్రాంతాల్లోనూ రాయితీ బియ్యం మాఫియా పెట్రేగిపోతోంది.

ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఏపీ ప్రభుత్వ ప్రజా పంపిణీ (సివిల్‌ సప్లయ్‌) విభాగం పర్యవేక్షణలో 2,436 నిత్యావసర సరుకుల పంపిణీ దుకాణాలు ఉన్నాయి. 12.20 లక్షల రేషన్‌ కార్డుదారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత బియ్యం, రూపాయికి కిలో బియ్యం పథకాల ద్వారా ప్రతి నెల 17 వేల నుంచి 18 వేల మెట్రిక్‌ టన్నులు సరఫరా చేస్తున్నాయి. ప్రతి వ్యక్తికి ఐదు కిలోల చొప్పున కుటుంబంలో ఎంత మంది ఉంటే అందరికి... కిలో రూపాయి వంతున ఎందరు సభ్యులు ఉంటే అందరికి రాయితీ బియ్యం ఇస్తున్నారు. కరోనా తరువాత కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యం ఇస్తోంది. రాయితీ బియ్యం సరఫరా కోసం ప్రభుత్వాలు రూ.65 కోట్లకు పైగా ప్రజాధనం ఖర్చు చేస్తున్నాయి. పేదల ఆహార భద్రత లక్ష్యంగా ఇస్తున్న బియ్యం కొందరు వైసీపీ నాయకులకు... అక్రమ రవాణాదారులకు కాసులు కురిపిస్తున్నాయి.

ప్రభుత్వం కిలోకు చేసే ఖర్చు రూ.36

ఏపీ సివిల్‌ సప్లయ్స్‌ కార్పొరేషన్‌ అధికారులు ధాన్యం క్వింటా రూ.1,980 వంతున రైతుల నుంచి సేకరించి రైస్‌ మిల్లర్లకు ఇస్తారు. మిల్లర్లు సీఎంఆర్‌ పద్ధతిలో 67 కిలోలు ఇవ్వాలి. ఈ లెక్కన కిలో రూ.29.55 పడుతుంది. రెండు గోనె సంచులు రూ.90, స్టేజ్‌-1, స్టేజ్‌-2 రవాణా, హమాలీ ఖర్చులు కలిపి కిలో రూ.36 వంతున క్వింటాలకు రూ.3,600 అవుతుంది. బియ్యం సేకరణ, కార్డుదారులకు పంపిణీ రూపంలో మెట్రిక్‌ టన్నుకు రూ.36 వేల వంతున ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఈ లెక్కన ఐదుగురు సభ్యులు కలిగిన కుటుంబానికి ఇచ్చే 25 కిలోల బియ్యానికి రూ.900 వరకు వ్యయం చేస్తున్నారు.

మాఫియా సేకరించేది రూ.7కే..

ఆదోని పట్టణం, గ్రామాల్లో ఏజెంట్ల ద్వారా డీలర్లు, కార్డుదారుల నుంచి కిలో రూ.7 వంతున సేకరించిన బియ్యం పట్టణంలోని ఇందిరానగర్‌, అరుణ్‌జ్యోతి నగర్‌, వాల్మీకి నగర్‌లోని స్టాక్‌ పాయింట్లకు తరలిస్తారు. బియ్యం సేకరించి స్టాక్‌ పాయింట్లకు తెచ్చిన ఏజెంట్లకు కిలోకు రూ.2 అదనంగా చెల్లిస్తారు. ఇలా సేకరించిన పేదల బియ్యాన్ని లారీల్లో గుట్టుచప్పుడు కాకుండా కాకినాడ, కర్ణాటకలోని సిరుగుప్ప పట్టణాలకు తరలిస్తున్నారు. అక్కడ కిలో రూ.14 నుంచి రూ.20 (క్వింటా రూ.1,400-2,000) వంతున విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ప్రతి నెలా 45-50 లారీలకు పైగా పేదల బియ్యం అక్రమ మార్గాల్లో తరలిస్తున్నారు. ఒక లారీ సరిహద్దు దాటిస్తే రూ.50 వేల నుంచి రూ.70 వేలు మిగులుతోంది. ఇలా నెలకు రూ.25లక్షల నుంచి రూ.30లక్షల వ్యాపారం సాగుతోంది. చిన్నబాస్‌ తెర వెనుక ఉండి ఈ దందాను నడిపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

పెట్రేగిపోతున్న బియ్యం మాఫియా!

మంత్రాలయం నియోజకవర్గంలో 30 మంది వరకు పేదల బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారు. కార్డుదారులు, డీలర్ల నుంచి కిలో రూ.7 నుంచి రూ.8 వంతున సేకరించి టెంపోల్లో మాధవరం చెక్‌పోస్టు మీదుగా సరిహద్దు దాటించి కర్ణాటకలోని రాయచూరుకు తరలిస్తున్నారు. లారీలు సరిహద్దు దాటించేందుకు ఓ గ్యాంగ్‌ ఉంది. ఒక టెంపో బియ్యం సరిహద్దు దాటిస్తే రూ.20-30 వేలు ఆ గ్యాంగ్‌కు ఇవ్వాలి. కోసిగి, పెద్దకడుబూరు, మంత్రాలయం మండలాల నుంచి నెలకు 15-20 లారీల బియ్యం తరలిపోతున్నాయి.

ఉమ్మడి జిల్లాలో పేదల బియ్యం అక్రమ రవాణాకు కేరాఫ్‌ అడ్రస్‌గా డోన్‌ మారింది. ఇక్కడి వ్యాపారులు ఎమ్మిగనూరు, పత్తికొండ, కోడుమూరు, డోన్‌, బేతంచర్ల, బనగానపల్లె ప్రాంతాల్లో ఏజెంట్లను నియమించుకొని సేకరించిన బియ్యాన్ని పట్టణ పరిసరాల్లోని గోదాములకు తరలిస్తారు. ప్యాకింగ్‌ చేసి రాత్రికి రాత్రే నేషనల్‌ హైవే మీదుగా బెంగళూరుకు చేరవేస్తున్నారు. అక్కడ కిలో రూ.14-16కు విక్రయిస్తున్నారు. నెలకు సరాసరి 50-75 లారీల బియ్యం తరలిపోతున్నాయని సమాచారం. అధికార పార్టీకి చెందిన కీలక ప్రజాప్రతినిధి అండతో ఈ భాగోతం సాగుతున్నట్లు తెలుస్తోంది.

నందికొట్కూరు నియోజకవర్గంలో బియ్యం దందా కొనసాగుతోంది. కార్డుదారులు, డీలర్ల నుంచి సేకరించిన బియ్యం పట్టణ సరిసరాల్లోని స్టాక్‌ పాయింట్లకు తరలిస్తారు. అక్కడి నుంచి అర్ధరాత్రి నుంచి తెల్లవారేలోగా ఆటోలు, ఎడ్ల బండ్లపై తెలంగాణ సరిహద్దు అల్లూరు, సుల్తాన్‌పురం చేరుస్తారు. అక్కడి నుంచి తెలంగాణలోని అలంపూర్‌ సర్కిలోని ఓ రైస్‌ మిల్లుకు తరలిస్తున్నారు. నెలకు 15 లారీల బియ్యం సరిహద్దు దాటిస్తున్నారు.

ఎమ్మిగనూరులో బియ్యం మాఫియా పెట్రేగిపోతోంది. ఇక్కడ కూడా ఏజెంట్ల ద్వారా సేకరించిన బియ్యం నిఘాకు దొరక్కుండా మంత్రాలయం మండలం మాధవరం మీదుగా రాయచూరుకు, డోన్‌కు తరలించి అక్కడి నుంచి బెంగళూరుకు రెండు మార్గాల్లో సరిహద్దు దాటిస్తున్నారు. ప్రతి నెలా 25-30 లారీల బియ్యం అక్రమ మార్గంలో నల్లబజారుకు చేరుతోంది. ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో పని చేసే కాంట్రాక్ట్‌ ఉద్యోగి అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.

అక్రమాల విలువ రూ.25 కోట్లు!

ఉమ్మడి కర్నూలు జిల్లా సన్న రకాలు కర్నూలు సోనా (బీపీటీ-5204), నంద్యాల సోనా (ఎన్‌డీఎల్‌) సాగుకు ప్రసిద్ధి. సామాన్యులు సైతం సోనా బియ్యానికి అలవాటు పడ్డారు. ఆహార భద్రత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితం, రూపాయికి కిలో బియ్యం పథకాలు ద్వారా ఇచ్చే బియ్యాన్ని కార్డుదారులు తీసుకుంటున్నారు. సగం మంది పేదలు ఆహారంగా తీసుకుంటే.. కొందరు దోసెలకు వాడుకుంటున్నారు. 35-40 శాతం మంది బియ్యం మాఫియా నియమించిన ఏజెంట్లకు కిలో రూ.7నుంచి రూ.8 వంతున విక్రయిస్తున్నారు. డీలర్లు, ఎంఎల్‌ఎస్‌ స్టాక్‌ పాయింట్స్‌లో మిగిలిన బియ్యం కలిపితే ఉమ్మడి జిల్లాలో దాదాపుగా 6,500 మెట్రిక్‌ టన్నుల పేదల బియ్యం సరిహద్దులు దాటుతున్నాయని ఓ అధికారి అంచనా. ప్రభుత్వం బియ్యం సేకరణ, రవాణాకు సరాసరి క్వింటాకు రూ.3,600 (కిలోకు రూ.36) ఖర్చు చేస్తోంది. ఈ లెక్కన బియ్యం అక్రమ రవాణా కుంభకోణం రూ.25 కోట్లకు పైమాటే.

Updated Date - 2022-11-30T00:25:41+05:30 IST