ఉల్లి..అదే తీరు మళ్లీ

ABN , First Publish Date - 2022-08-25T05:37:43+05:30 IST

ఉల్లిని నమ్ముకున్న రైతుకు మళ్లీ పాత కథే ఎదురవుతోంది.

ఉల్లి..అదే తీరు మళ్లీ

గిట్టుబాటు ధర లేకపోవడంతో ఆందోళన
కూలి డబ్బులు కూడా  దక్కని పరిస్థితి
మార్కెట్‌ ఖర్చు భరించలేక  వీధుల్లో చిల్లర వ్యాపారం


 ఉల్లిని నమ్ముకున్న రైతుకు మళ్లీ పాత కథే ఎదురవుతోంది.  నష్టాలే కనిపిస్తున్నాయి. రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి సాగు చేసిన ఉల్లి పంట ఇటీవల వర్షాలకు వేల ఎకరాల్లో కుళ్లిపోయింది. కూలీ రేట్లు కూడా గిట్టుబాటయ్యే పరిస్థితి కనిపించడం లేదు. చేతికి అందిన పంటను మార్కెట్‌కు తీసికెళ్లి విక్రయించుకోవడం ఆర్థిక భారంగా మారుతోంది. దీంతో ఆటోల్లో ఉల్లిపాయలు వేసుకొని వీధుల్లో తిరుగుతూ... కిలోల లెక్కన  రైతులే స్వయంగా అమ్ముకుంటున్నారు.

-కోడుమూరు (రూరల్‌), గోనెగండ్ల
 
ఉల్లి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయి. ఫలితంగా ఉల్లి రైతుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఖరీఫ్‌ సీజన్‌లో పులకుర్తి, కల్లపరి, మెరుగుదొడ్డి, బైనదొడ్డి, వర్కూరు, ప్యాలకుర్తి గ్రామాల్లో బోరు బావుల కింద దాదాపు 1500 ఎకరాల్లో ఉల్లి సాగైంది.  వర్షాధారం కింద కోడుమూరు, వెంకటగిరి, గోరంట్ల తదితర గ్రామాల్లో మరో వెయ్యి ఎకరాల వరకు సాగు చేసినట్లు అంచనా. ప్రస్తుతం బోరు బావుల కింద సాగు చేసిన పంటలు చేతికి వచ్చాయి.
 
పెరిగిన పెట్టుబడులు
 
 పురుగు మందులు, రసాయనిక ఎరువులు, కూలీల ధరలు పెరగడంతో పెట్టుబడులు భారీగా పెరిగిపోయాయి. ఉల్లి సాగుకు గతంలో ఎకరాకు రూ.40 వేల నుంచి రూ.50 వేలు అయ్యేదని, ప్రస్తుతం రూ.60 వేలకు పైగా అవుతోందని రైతులు అంటున్నారు. ఖరీఫ్‌లో ఉల్లి ఎకరాకు 60 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని రైతులు అంటున్నారు. అయితే పెట్టుబడి, దిగుబడులను బేరీజు వేసుకుంటే ప్రస్తుతం ఉన్న ధరలకు భారీగా నష్టపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. సరుకు నాణ్యత పేరుతో క్వింటా ఉల్లి మార్కెట్లో రూ.500 నుంచి రూ.600 మధ్య కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు.

 వీధుల్లో ఉల్లి అమ్ముకుంటున్న రైతులు

 రైతులు గోనెగండ్ల మండలంలో ఆటోలలో, ఎద్దుల బండ్లపై ఉల్లి బస్తాలను వేసుకొని  రూ.100కు ఏడు కేజీల వంతున వీధుల్లో అమ్ముకుంటున్నారు. రూ. లక్షలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తే మార్కెట్‌లో ధర లేకపోవడంతో కేజీల వంతున చిల్లరగా అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. జిల్లాలో ఉల్లి సాధారణ విస్తీర్ణం 12,627 హెక్టార్లు కాగా.. ఇప్పటి దాకా 11,871 హెక్టార్లలో సాగుచేశారు. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా ఉల్లి రైతులు విలవిలలాడుతున్నారు. చేతిక అందిన పంట వర్షానికి  కుళ్లిపోతోందని వారు ఆవేదన చెందుతున్నారు. కర్నూలు మార్కెట్‌లో క్వింటాలు ఉల్లి  కనిష్ఠ ధర రూ. 450, గరిష్ఠ ధర రూ. 1000 పలుకుతోంది. సరాసరి ధర రూ. 750. ఇక తాడేపల్లిగూడెంలో కనిష్ఠ ధర రూ. 500, గరిష్ఠ ధర రూ. 1100, సరాసరి రూ. 800 పలుకుతోంది. తాడేపల్లిగూడేనికి ఉల్లి పంటను లారీలో వేసుకొని వెళ్లి విక్రయించి రావాలంటే రవాణా ఖర్చు దాదాపు రూ. 25000 అవుతుంది. దీంతో ఉల్లి రైతులు అంత దూరం వెళ్లలేక వీధుల్లో ఆటోల్లో కేజీల వంతున అమ్ముకుంటున్నారు. ధరలు లేకపోవడంతో అనేమంది రైతులు ఉల్లి పంటను పశుగ్రాసంగా వ దిలివేశారు.

నంద్యాల జిల్లాలో 4,500 హెక్టార్లలో సాగు

చాగలమర్రి, ఆగస్టు 24: ఉల్లి రైతులు ఏటా వివిధ రూపాల్లో నష్టపోతూనే ఉన్నారు. ఈ ఏడాది నంద్యాల జిల్లాలో 4,500 హెక్టార్లలో ఉల్లి పంటను సాగు చేశారు. ఎకరాకు రూ.40 వేల నుంచి రూ.70 వేల వరకు పెట్టుబడి పెట్టారు. నాలుగు నెలల పాటు ఉల్లి పంటను సాగు చేస్తారు. పంట చేతికొచ్చే సమయానికి ధర లేక నష్టపోతున్నారు. మార్కెటింగ్‌ సౌకర్యం లేకపోవడంతో పంట సాగుపై రైతులు ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వం ఉల్లి పంట దిగుబడుల ఎగుమతిని ప్రొత్సహించకపోవడంతో రైతులు నష్టపోతున్నారు.

 తక్కువ ధరకు అడుగుతున్నారు

ఒకటిన్నర ఎకరాల పొలం రూ.20 వేలకు  కౌలుకు తీసుకుని ఉల్లి సాగు చేశా. పెట్టుబడికి రూ.80 వేలు ఖర్చయింది. కోత పూర్తయింది. దిగుబడి 90 క్వింటాళ్లు రావచ్చు. కర్నూలు మార్కెట్లో ధరలు పడిపోయాయి. రవాణా ఖర్చులు కూడా భారం అవుతాయి.  స్థానికంగా దళారులు తక్కువ ధరకు అడుగుతున్నారు.

-మద్దిలేటి, కౌలు రైతు, వర్కూరు

 కోత కూలీ కూడా రాలేదు

ఖరీఫ్‌లో ఉల్లి రెండు ఎకరాల్లో సాగు చేస్తే 65 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఎకరాకు రూ.70 వేలు ఖర్చయింది. ఉల్లి కర్నూలు మార్కెట్‌కు తరలిస్తే క్వింటాలు రూ.485వంతున అమ్ముడుబోయింది. రవాణా, మార్కెట్‌ ఖర్చులు పోను రూ.18 వేలు చేతికి వచ్చింది. పెట్టుబడి అటుంచి కోత ఖర్చు కూడా దక్కలేదు.  

-సుధాకర్‌, రైతు, పులకుర్తి

ఉల్లి కోత నిలుపుకున్నా

నాకు ఉన్న రెండు ఎకరాలకు తోడు మరో ఎకరన్నర కౌలు పొలంలో ఉల్లి సాగు చేశాను. కోతకు సిద్ధంగా ఉంది. పెట్టుబడులు సుమారు రూ.2.40 లక్షలు అయ్యాయి. పురుగు మందులు, ఎరువుల ధరలు, కూలీరేట్లు పెరిగిపోవడంతో పెట్టుబడులు తడిసిమోపెడయ్యాయి. ఎకరా ఉల్లి కోతకు రూ.11,500 నడుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో రేట్లు లేకపోవడంతో భయపడి కోత వాయిదా వేసుకుంటున్నా. ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించాలి.

-పాపారాయుడు, రైతు, పులకుర్తి

అఽఽధిక వర్షాలకు ఉల్లి కుళ్లి పోయింది
ఈ ఏడాది ఎన్నడూ లేని విధంగా అధిక వర్షాలకు ఉల్లి పంట కుళ్లిపోయింది. ఒకటిన్నర ఎకరాల్లో ఉల్లి సాగు చేశాను. దాదాపు రూ. 80 వేలు ఖర్చయింది. మొత్తం నష్టపోయాను. ప్రభుత్వం ఆదుకోవాలి.
 
-జయరాముడు, ఉల్లి రైతు, పిల్లిగుండ్ల

Updated Date - 2022-08-25T05:37:43+05:30 IST