క్వార్టర్లూ వదల్లేదు?

ABN , First Publish Date - 2022-09-25T05:35:30+05:30 IST

నగరంలోని ఆర్‌ అండ్‌ బీ క్వార్టర్స్‌ శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో అధికారులు, ఉద్యోగులు చేరడానికి ఇష్టపడకపోవడంతో అక్రమార్కులు పాగా వేస్తున్నారు.

క్వార్టర్లూ వదల్లేదు?

  1. ప్రభుత్వ క్వార్టర్లలో అక్రమార్కుల పాగ..
  2.  హెచ్‌ఆర్‌ఏ ఎక్కువ - సౌకర్యాలు తక్కువ
  3.  ఆర్‌ అండ్‌ బీ క్వార్టర్స్‌లో అరకొర వసతులు..


కర్నూలు(అర్బన): సెప్టెంబరు 24: నగరంలోని ఆర్‌ అండ్‌ బీ క్వార్టర్స్‌ శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో అధికారులు, ఉద్యోగులు చేరడానికి ఇష్టపడకపోవడంతో అక్రమార్కులు పాగా వేస్తున్నారు. అఽధికార పార్టీ నాయకుల అనుచరులు, మరి కొందరు వీఽధి రౌడీలు, అక్రమార్కులు ఉద్యోగులకు కేటాయించిన భవనాల్లో తిష్ఠ వేశారు. నగరం నడి బోడ్డులో ఎలాంటి బాడుగలు చెల్లించకుండానే ఇందులో కాపురాలు చేస్తు దర్జాగా కాలం గడిపేస్తున్నారు. ఎందరో ఉద్యోగులు అక్రమార్కులను ప్రశ్నించే సాహసం చేయలేక ప్రైవేట్‌ ఇళ్లలో చేరుతున్నారు.


91 ఎకరాల్లో 1072 క్వార్టర్లు:

నగరంలో ఆర్‌ అండ్‌ బీ క్వార్టర్స్‌ 1953 -1956 మధ్య నిర్మించారు. 91 ఎకరాల్లో మొత్తం 1072 క్వార్టర్సు ఉన్నాయి. ఇందులో ఏ టైపు క్వార్టర్స్‌ 176, బీ టైపు క్వార్టర్స్‌ 634, సీ టైపు 103, డీ టైపు 51, ఈ టైపు 10, ఎంఐజీ టైపు 5 క్వార్టర్స్‌, ఏబీసీ క్యాంపుల్లో ఉన్నాయి. అంతేకాకుండా ఫారెస్ట్‌, ఫిషరీస్‌ కాంపౌండ్‌లలో ఏ టైపు 40, బీ టైపు 14, సీ టైపు 6, ఈ టైపు రెండు, ఎఫ్‌ టైపు ఒకటి ఉన్నాయి. ఇందులో 171 క్వార్టర్స్‌ అన్యాక్రాంతం కాగా, 65 క్వార్టర్లు శిథిలావస్థకు చేరాయి. మిగతా 836 క్వార్టర్లలో 60 శాతం ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా 40శాతం మంది అక్రమార్కులు నివాసముంటున్నారు. 


ఏటా రూ.6 కోట్ల ఆదాయం:

ఆర్‌ అండ్‌ బీ క్వార్టర్స్‌లో నెలకు రూ.3000 నుంచి 15000 హెచ్‌ఆర్‌ఏ (ఇంటి బాడుగ) చెల్లించే కింది స్థాయి ఉద్యోగుల నుంచి జిల్లా అధికారులు 836 క్వార్టర్లలో ఉంటున్నారు. వీరి జీతంలో హెచ్‌ఆర్‌ఏ డ్రా చేయరు. ఈ హెచ్‌ఆర్‌ఏ సరాసరి రూ.6000 చొప్పున 836 క్వార్టర్లకుగాను నెలకు రూ.50 లక్షల చొప్పున ఏడాదికి రూ. 6 కోట్లపైనే ఆదాయం ప్రభుత్వ ఖజానాలో (రెవెన్యూ హెడ్‌కు) చేరిపోతుంది. అయితే వందల క్వార్టర్ల రిపేరికి ఏటా కోటి మాత్రమే నిధులు కేటాయిస్తున్నారు. 


అరకొర వసతులు:

1980 నుంచి క్వార్టర్లకు సంబంధించి అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు సౌకర్యాలు మున్సిపాలిటీ చూసుకుంటుంది. ఏళ్ల తరబడి అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. దీంతో కొద్దిపాటి వర్షం వస్తే వర్షపు నీరు మురికి నీరు కాంపౌండ్‌లో నిలిచిపోతుంది. దీంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. ఫలితంగా క్వార్టర్స్‌లో ఉన్న వారు తరచూ రోగాలబారిన పడుతున్నారు. దీనికి తోడు పిచ్చిమొక్కలు పెరగడంతో విష పురుగులు చేరుతున్నాయి. అంతేకాకుండా 1953లో మద్రాస్‌ టెర్రస్‌ రూఫ్‌తో నిర్మించబడ్డ క్వార్టర్లు వర్షం వస్తే కారుతున్నాయి. కింది ఫ్లోరింగ్‌ కూడా దెబ్బతింది. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళితే ఎస్టిమేషన్‌లు, టెండర్లు వేసి పనులు చేపట్టేలోగా ఆరు నెలలు గడుస్తుంది. దీంతో చాలామంది అరకొర వసతులతోనే కాలం గడిపేస్తున్నారు. వచ్చిన అరకొర నిధులను ఎక్కువ భాగం జిల్లా అధికారుల క్వార్టర్లు మరమ్మతులకు ఖర్చు పెడుతున్నారు. 


ఫ అక్రమార్కుల పాగా..

ప్రభుత్వ క్వార్టర్స్‌లో దాదాపు 40 శాతం మంది అక్రమార్కులు పాగా వేశారని ఆర్‌ అండ్‌ బీ అధికారుల లెక్కలు చూపుతున్నాయి. కానీ వారిని సాహసించి ఖాళీ చేయించ లేని పరిస్థితి. నగరంలోని అధికార పార్టీకి చెందిన ఎందరో చోటా, మోటా నాయకులు పెద్దనాయకుల పేర్లతో తిష్ట వేశారు. వారిని సాహసించి ప్రశ్నించే వారు లేరు. అర్‌ అండ్‌బీ నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండానే నివాసం ఉండటంతో ఇటీవల ఇళ్లలో కాపురం ఉండేందుకు పోటీలు పడి, ఘర్షణలకు దిగుతున్నారు. మాజీ ఎమ్మెల్యే అనుచరులమంటూ మహిళలు తిష్ట వేసి వంద ఇళ్లను ఇతరులకు బాడుగలకు ఇచ్చి పబ్బం గడుపుకుంటున్నట్లు సమాచారం. ఇలాంటి అక్రమార్కులను ప్రశ్నించే వారు లేక పోవడంతో కబ్జా చేసి ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారు.


పైకప్పు లీకవుతోంది - ప్రసాద్‌, సర్వేయర్‌, 

జీతంలో రూ.8 వేలు హెచ్‌ఆర్‌ఏ కట్‌ అవుతున్నా సరైన వసతులు లేవు. వర్షాకాలంలో పైకప్పు లీకవుతోంది. పిల్లలు పాఠశాలలకు దగ్గరవుతుందని తప్పనిసరి పరిస్థితుల్లో కాలం గడుపుతున్నాం. పైగా నగరంలో సెంటరు కావడంతో అన్ని వసతులు అందుబాటులో ఉంటాయి. అర్ధరాత్రి వచ్చినా ఇబ్బంది ఉండదు కదా అని ఉండిపోతున్నాం.


నీటి కొరత ఉంది - విజయలక్ష్మి 

ఆఫీసుకు దగ్గర అవుతుందనే ఉద్దేశంతో ఇళ్లు ఫ్లోరింగ్‌ సరిగా లేకపోయినా సర్దుకుపోతున్నాం. అధికారులు స్పందించి వసతులు కల్పించాలి. ఎన్నో సార్లు సమస్యలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారు లేరు. పైగా ఉద్యోగులు కానీ వారు కూడా నివాసం ఉంటుండటంతో రక్షణ కూడా లేకుండా పోతోంది. 


ఫ బడ్జెట్‌ కేటాయింపు తక్కువ - రవిచంద్ర, ఈఈ, ఆర్‌ అండ్‌ బీ 

దాదాపు 60 ఏళ్ల కిందట నిర్మించిన భవనాలు చాలా వరకు శిథిలావస్థకు చేరుకున్నాయి. భవనాల మరమ్మతులకు చాలినంత బడ్జెట్‌ కేటాయింపులు లేవు. గతంలో ఏడాదికి రూ.70 వేల దాకా వచ్చే నిధులతోనే రిపేరు చేసేవాళ్లం. ఇప్పుడు నిర్వహణ భారంగా మారింది. రెవెన్యూ అధికారులు, పోలీసులు జోక్యం చేసుకుని అక్రమార్కులను ఖాళీ చేయించాల్సి ఉంది.

Read more