ధర లేక.. దిగుబడి రాక..

ABN , First Publish Date - 2022-09-25T05:30:00+05:30 IST

ఈ రైతు పేరు చిన్న తోటయ్య. కోడుమూరు మండలం వర్కూరు గ్రామం.

ధర లేక.. దిగుబడి రాక..
విక్రయానికి వచ్చిన పత్తి దిగుబడి

  1.   రైతుల ముఖాల్లో కనిపించని సంతోషం 
  2. ముప్పేట తెగుళ్ల దాడితో భారీగా నష్టం 
  3. రూ.6.95 లక్షల ఎకరాల్లో సాగు 
  4. రాష్ట్రంలో మొదటి స్థానం 
  5.  ఇప్పటికే 3వేల కోట్ల నష్టం 
  6. నివారణ చర్యలు తీసుకోకుంటే ఈ నష్టం మరింత పెరిగే ప్రమాదం 


కర్నూలు(అగ్రికల్చర్‌)/ఆదోని (అగ్రికల్చర్‌), సెప్టెంబరు 25: ఈ రైతు పేరు చిన్న తోటయ్య. కోడుమూరు మండలం వర్కూరు గ్రామం. పొలం గుత్తకు తీసుకుని పంట సాగు చేపడితేనే కుటుంబ పోషణ. గత సంవత్సరం భారీ వర్షాలతో పంట పూర్తిగా దెబ్బతిని కుటుంబ సభ్యులను వెంటేసుకుని వలసపోయాడు. ఈ సారైనా వ్యవసాయం కలిసివస్తుందనే ఆశతో ఎకరాకు రూ.10వేల చొప్పున కౌలు చెల్లించి ఐదెకరాలను గుత్తకు తీసుకున్నాడు. పత్తి సాగు చేశాడు. వైరస్‌లు సోకడంతో ఎకరాకు రెండు క్వింటాళ్లకు మించి దిగుబడి వచ్చే అవకాశం లేదు. క్వింటానికి రూ.9వేల చొప్పున రెండు క్వింటాళ్ల దిగుబడికి రూ.18వేలు ధర అందుతుందని రైతు ఆవేదన చెందాడు. తనకు ఎకరాకు రూ.30వేల దాకా పత్తి సాగుకు ఖర్చు వచ్చిందని చెబుతున్నాడు. ప్రస్తుతం జిల్లాలోని పత్తి రైతులందరిదీ ఇదే పరిస్థితి.

ఒక్కసారిగా పత్తి ధరలు పతనమయ్యాయి. 15 రోజుల్లో రూ.2000కు పైగా ధర తగ్గడంతో రైతుల కన్నీరు పెడుతున్నారు. జూనలో పత్తి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.13,689కు పైగా రికార్డు స్థాయిలో పలికింది. దీంతో ఈ ఖరీఫ్‌లో 2.68 హెక్టార్లలో పత్తి సాగు చేశారు. ఒక్కసారిగా ధరలు పతనం కావడంతో రైతులు  దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఈ నెల మొదటి వారంలో పత్తి క్వింటాల్‌ రూ.11 వేల వరకు పలికింది. గరిష్టంగా రూ.9,300ల ధరకు చేరుకుంది. ప్రధానంగా దూది ఎగుమతులు నిలిచిపోవడమే ఇందుకు కారణమని వ్యాపారులు పేర్కొంటున్నారు. 


ధర ఉన్నా కనిపించని సంతోషం: 

మార్కెట్‌లో గత రెండు సంవత్సరాలుగా పత్తికి గణనీయంగా ధర లభిస్తుండటంతో  రైతులు పత్తి పంట వైపే మొగ్గు చూపారు. ఆదోని సబ్‌ డివిజనలో 68,084 హెక్టార్లు, ఎమ్మిగనూరులో 53,256 హెక్టార్లు, ఆలూరులో 49,298 హెక్టార్లు, కర్నూలు సబ్‌ డివిజనలో 40,774 హెక్టార్లు, పత్తికొండలో 22,374 హెక్టార్లు, నందికొట్కూరులో 16,461 హెక్టార్లు, డోనలో 13,700 హెక్టార్లు, నంద్యాలలో 4,935 హెక్టార్లు, కోయిలకుంట్లలో 2,673 హెక్టార్లు, ఆత్మకూరులో 3,708 హెక్టార్లు, ఆళ్లగడ్డలో 1,375 హెక్టార్లు మొత్తం 2,76,543 హెక్టార్లలో పత్తి సాగు చేశారు. 


పురుగు దాడితో తగ్గిన దిడుబడి

వాతావరణ పరిస్థితులు అనుకూలించి ఉంటే ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వచ్చి ఉండేది. అయితే.. గులాబి రంగు పురుగుతోపాటు టొబోకా వైరస్‌, రసం పీల్చే పురుగులు ముప్పేట దాడి చేయడంతో కనీసం ఐదు క్వింటాళ్లు కూడా రైతు చేతికందే అవకాశం లేకుండా పోయింది. ఎకరా పంట సాగుకు రూ.30వేల దాకా ఖర్చు వస్తోంది. మార్కెట్‌లో క్వింటానికి 9వేలకు పైగా అందినా నష్టమే వస్తున్న పరిస్థితి. వ్యవసాయ శాఖ అధికారులు గులాబి పురుగుతో పాటు ఇతర వైరస్‌ల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చూపుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైబ్రిడ్‌ రకం పత్తి విత్తనాల సాగు వల్ల ఎటువంటి వైరస్‌లు పురుగులు వ్యాపించవని ప్రారంభంలో వ్యవసాయాధికారులతోపాటు విత్తన తయారీ సంస్థలు రైతులకు భరోసా ఇచ్చాయి. అయితే.. పరిస్థితి మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉండటంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

నష్ట నివారణ చర్యలు తీసుకోవాలి - శాలురెడ్డి, కర్నూలు ఏడీఏ: 

జిల్లాలో పత్తి పంటపై గతంలో ఎన్నడూ లేని విధంగా టొబోకా వైరస్‌ వ్యాపించింది. దీనికి తోడు గత ఐదారు సంవత్సరాల నుంచి గులాబి రంగు పురుగుతోపాటు రసం పీల్చే పచ్చ పురుగులు భారీగా వ్యాపించాయి. దీని వల్ల ఎకరాకు దిగుబడి పది క్వింటాళ్ల దాకా రావాల్సింది పోయి.. కేవలం 3 నుంచి 5 క్వింటాళ్లకు పడిపోయింది. ఇప్పటికైనా రైతులు మేల్కొని వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించి క్రిమిసంహారక మందులు వినియోగించాలి.

జిల్లాలో పత్తి పంట సాగు వివరాలు: 

------------------------------------------------------------------

సబ్‌ డివిజన విస్తీర్ణం (హెక్టార్లలో)

------------------------------------------------------------------

కర్నూలు 40,774

డోన 13,713

నందికొట్కూరు 16,461

ఆత్మకూరు 3,708

నంద్యాల 4,935

ఆళ్లగడ్డ 1,375

కోయలకుంట్ల 2,673

ఆదోని  68,084

ఎమ్మిగనూరు 53,256

ఆలూరు 49,290

పత్తికొండ 22,360

------------------------------------------------------------------

మొత్తం 2,66,543

------------------------------------------------------------------

ధరలు ఆశించి సాగు చేశా.... భీమయ్య, రైతు, దిద్ది గ్రామం, కోసిగి మండలం

రికార్డు ధరలు పలికాయని, అవే ధరలు ఉంటాయని ఆశించి, నాకున్న నాలుగు ఎకరాలలో రూ.50 వేల పైగా పెట్టుబడి పెట్టి పత్తి సాగు చేశాను. మొదటి కోత కింద నాలుగు పత్తి బోరాలు కావడంతో విక్రయించుకునేందుకు మార్కెటుకు వస్తే ధరలు భారీగా పతనమయ్యాయి. క్వింటం రూ.8,860కు కొనుగోలు చేశారు. పెట్టిన పెట్టుబడి కూడా చేతికంద లేదు.

వ్యవసాయమే ఆధారం- వీరస్వామి, రైతు, కోసిగి

ఎన్నో ఏళ్ల నుంచి వ్యవసాయంపైనే ఆధారపడ్డాం. మిగతా పని చేయలేం. కష్టమొచ్చినా.. నష్టమొచ్చినా.. వ్యవసాయం చేయాల్సిందే. ఒక్కో ఎకరాకు పత్తి పండించాలంటే రూ.35 వేలకు పైగా ఖర్చు అవుతుంది. పది కేజీల పత్తిని తీయాలంటే కూలీలకు రూ.300లు చెల్లించాలి. మార్కెట్‌లో ఏమో ధర లేదు. రైతుల పరిస్థితి దయనీయమైంది.

క్వింటం రూ.13వేలకుపైగా ఉంటే గిట్టుబాటు.. నరసింహులు, పత్తి రైతు

గతంతో పోల్చితే ఎరువులు, రసాయనిక పిచికారి మందులు, విత్తనాలు ధరలన్నీ రెట్టింపయ్యాయి. పత్తి ధర మాత్రం పెరగలేదు. ధర బాగుందని సాగు చేస్తే చేతికొచ్చే సమయానికి ధర పతనం కావడంతో తీవ్రంగా నష్టపోతున్నాం. క్వింటానికి రూ.13వేలకు పైగా ధర ఉంటేనే రైతుకు గిట్టుబాటు అవుతుంది.

ఎగుమతి లేకపోవడంతోనే.. వెంకటరామిరెడ్డి, కాటన మర్చెంట్‌ అసోసియేషన కార్యదర్శి, ఆదోని

ప్రధానంగా ఎగుమతులు లేకపోవడంతోనే పత్తి ధరలు పతనం కావడానికి కారణమైంది. దూది క్యాండీ ధర రూ.90వేల నుంచి రూ.74వేలకు పడిపోయాయి. నిలువ ఉంచుకున్న వాళ్లందరూ నష్టపోయారు. ఒక్కో లాట్‌ పై ధరలు తగ్గడం వల్ల రూ.5 లక్షలు వరకు తగ్గింది. అందువల్లే స్థానిక మార్కెట్‌ యార్డు పై ప్రభావం చూపింది.

అంతర్జాతీయ మార్కెట్‌ ప్రభావం... నీలకంఠప్ప, కాటన మర్చంట్‌, ఆదోని

అంతర్జాతీయ మార్కెట్లో దారం ధరలు, దూది ధరలు బాగా పడిపోయాయి. విదేశాల్లో వస్త్ర తయారీ నిలిచిపోవడం వల్ల మన దూది, దారానికి డిమాండ్‌ లేకపోవడం వల్ల ఉత్పత్తిని నిలిపివేశారు. దీని వల్ల ధరలు తగ్గుతూ వస్తున్నాయి.

ధరలపై చైతన్యం తెస్తున్నాం.... శ్రీకాంత రెడ్డి, కార్యదర్శి, మార్కెట్‌ యార్డు, ఆదోని

ఇప్పుడిప్పుడే సీజన ప్రారంభమైంది. రైతులు ఒకేసారి పత్తిని తీసుకు రాకుండా, ఆరబెట్టుకొని ధరలు ఉన్నప్పుడు అమ్ముకోవాలి. వారి అవసరాల కోసం కొద్దికొద్దిగా అమ్ముకోవాలని అవగాహన కల్పిస్తున్నాం. ఒకేసారి అమ్ముకొని నష్టపోకుండా నిలువ ఉంచుకోవాలని సూచిస్తున్నాం. ధరలు హెచ్చుతగ్గుదలపై రైతులకు గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నాం.



 


Updated Date - 2022-09-25T05:30:00+05:30 IST