భూసేకరణలో ఆలస్యం తగదు: కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-09-10T05:39:38+05:30 IST

జాతీయ రహదారులు, రైల్వే లైన్లకు సంబంధించిన భూసేకరణ పనుల్లో ఆలస్యం తగదని కలెక్టర్‌ డాక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ అన్నారు.

భూసేకరణలో ఆలస్యం తగదు: కలెక్టర్‌

నంద్యాల టౌన్‌, సెప్టెంబరు 9 : జాతీయ రహదారులు, రైల్వే లైన్లకు సంబంధించిన భూసేకరణ పనుల్లో ఆలస్యం తగదని కలెక్టర్‌ డాక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ అన్నారు.  ఆర్డీవోలు, తహసీల్దార్లు, జాతీయ రహదారుల అధికారులు సమన్వయంతో పనిచేసి నిర్దేశిత షెడ్యూల్‌లో పనులు ముగించాలని   ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో జాయింట్‌ కలెక్టర్‌ నారపురెడ్డి మౌర్యతో కలిసి జాతీయ రహదారుల భూసేకరణ ప్రగతిపై  ఆర్డీవో, తహసీల్దార్లు, అధికారులతో కలెక్టర్‌ సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారి 340సీకి సంబంధించి 578 ఎకరాలు, 167కేకు  545ఎకరాలు, 340బీకి  280ఎకరాల  పనులకు  షెడ్యూల్‌ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారి 340సీకి సంబంధించి నందికొట్కూరు నుంచి ఆత్మకూరు వరకు 578 ఎకరాల్లోని 211.23హెక్టార్ల ప్రైవేట్‌ భూములకు బేసిక్‌ వాల్యూను పరిగణనలోకి తీసుకొని వారంరోజుల్లో ధరలు నిర్ధారించి భూసేకరణను పూర్తి చేయాలని ఆదేశించారు. నందికొట్కూరు నుంచి ఆత్మకూరు వరకు 5మండలాల్లోని 22 గ్రామాల స్ట్రక్చర్‌ విలువల సర్టిఫికేషన్‌ను 16వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈనెల 15న అడిషనల్‌ 3డీ గెజిట్‌ పబ్లికేషన్‌, 20న 3జీ పబ్లికేషన్‌ ఇవ్వాలని ఎన్‌హెచ్‌ పీడీని కలెక్టర్‌ ఆదేశించారు. 476.13ఎకరాల ప్రైవేట్‌ భూములకు సబ్‌ డివిజనల్‌ డిటెల్స్‌ పూర్తిచేసి నవంబర్‌ 5వ తేదీన 3డీ గెజిట్‌ పబ్లికేషన్‌ ఇవ్వాలని ఆదేశించారు.  ఈ సమావేశంలో ఎన్‌హెచ్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ బలరామ కృష్ణయ్య, డీఆర్వో పుల్లయ్య, నంద్యాల ఆర్డీవో శ్రీనివాసులు, డోన్‌ ఆర్డీవో వెంకటరెడ్డి, ఆత్మకూరు ఎం.దాస్‌, ఎన్‌హెచ్‌ తహసీల్దార్‌ గుర్రప్ప శెట్టి, డీటీ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Read more