కన్నుల పండువగా నారసింహుడి కల్యాణం

ABN , First Publish Date - 2022-03-16T05:49:40+05:30 IST

అహోబిలం బ్రహ్మోత్సవాలలో భాగంగా ఎగువన జ్వాలా నరసింహస్వామి, చెంచులక్ష్మి కల్యాణం మంగళవారం కన్నులపండువగా నిర్వహించారు

కన్నుల పండువగా నారసింహుడి కల్యాణం
జ్వాలా నరసింహస్వామి, చెంచులక్ష్మీ అమ్మవారికి కల్యాణం చేస్తున్న వేదపండితులు

ఆళ్లగడ్డ, మార్చి 15: అహోబిలం బ్రహ్మోత్సవాలలో భాగంగా ఎగువన జ్వాలా నరసింహస్వామి, చెంచులక్ష్మి కల్యాణం మంగళవారం కన్నులపండువగా నిర్వహించారు. వేదపండితులు ఉత్సవమూర్తులకు ఉత్సవం, మధ్యాహ్నం అభిషేకం చేశారు. ఉత్సవాల 8వ రోజు స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేసిన అనంతరం వేర్వేరు పల్లకిల్లో కల్యాణ మండపం వద్దకు తీసుకుని వచ్చారు. అక్కడ ఎదుర్కోళ్ల కార్యక్రమం నిర్వహించారు. ఆ తర్వాత సాంప్రదాయబద్ధంగా కల్యాణ వేడుక జరిపించారు. నూతన వధూవరులైన చెంచులక్ష్మి అమ్మవారు, జ్వాలా నరసింహస్వామి పాదాల చెంత వేదపండితులు ముత్యాల తలంబ్రాలు పోశారు. ఈ ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు తరలివచ్చారు. కార్యక్రమంలో పీఠాధిపతి రంగనాథ యతీంద్ర మహదేశికన్‌, ఈవో నరసయ్య, మఠం అధికారి సంపత్‌, ప్రధాన అర్చకుడు వేణుగోపాలన్‌, వేదపండితులు పాల్గొన్నారు.

దిగువ అహోబిలంలో..
దిగువ అహోబిలంలో మంగళవారం ప్రహ్లాదవరదస్వామి శ్రీవేణుగోపాలస్వామి రూపంలో దర్శనమిచ్చారు. అనంతరం వేదపండితులు స్వామికి పొన్నచెట్టు వాహనసేవ జరిపించారు. కార్యక్రమంలో ఈవో నరసయ్య, వేదపండితులు పాల్గొన్నారు.

నేడు ఇలా..: ఎగువ అహోబిలంలో బుధవారం ఉత్సవం, తొట్టితిరుమంజనం, అశ్వవాహనం కార్యక్రమాలు ఉంటాయి. దిగువన అభిషేకం, గజవాహనం, తిరు కల్యాణోత్సవం ఉంటాయి.

Read more