విలీనం సరే.. గదులెక్కడ?

ABN , First Publish Date - 2022-04-05T05:45:43+05:30 IST

నాడు నేడు కింద రూ.46 లక్షలు ఖర్చు చేసినా తరగతి గదులు మాత్రం నిర్మించలేదు.

విలీనం సరే.. గదులెక్కడ?
గదులు చాలక ఆరుబయట పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయుడు

  1. ఆరు గదులు.. 765  మంది విద్యార్థులు
  2. ఆరుబయట కూర్చో బెట్టి పిల్లలకు పాఠాలు
  3. మరో ఆరు పాఠశాలలు ఇందులోకి విలీనం!
  4. తలలు పట్టుకుంటున్న ఉపాధ్యాయులు

ఆదోని(అగ్రికల్చర్‌), ఏప్రిల్‌ 4: నాడు నేడు కింద రూ.46 లక్షలు ఖర్చు చేసినా తరగతి గదులు మాత్రం నిర్మించలేదు. ఆరు నుంచి పదో తరగతి వరకు 765 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి కేవలం 6 గదులు ఉన్నాయి. మళ్లీ సమీపంలోని మరో ఆరు పాఠశాలలు ఇందులో విలీనం చేసేందుకు మ్యాపింగ్‌ చేశారు. 3 నుంచి 5వ తరగతి విద్యార్థులు 520 మంది రానున్నారు. ఇప్పటికే గదుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఉన్న విద్యార్థులనే ఆరుబయట కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్నారు. మళ్లీ ఇతర పాఠశాలల నుంచి వస్తే వారిని ఎక్కడ కూర్చోపెట్టాలని ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు.

ఆదోని పట్టణంలోని ఆర్‌ఆర్‌ లేబర్‌ కాలనీ పురపాలక ఉన్నత పాఠశాలలో విద్యార్థుల చేరిక గణనీయంగా పెరిగింది. అయితే ఆ సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు లేకపోవడంతో ఉపాధ్యాయులు ఆరుబయట, చెట్ల కింద కూర్చోబెట్టి పాఠాలు బోధిస్తున్నారు. ఒక్కో గదిలో 80-90 మంది ఇంగ్లీష్‌, తెలుగు మీడియం చదువుతున్నారు. అది కూడా ఇరుకిరుకుగా కూర్చోవాల్సి రావడంతో విద్యార్థులు ఇబ్బందులు కొందరైతే బెంచీలు చాలక కింద కూర్చుంటున్నారు.  

రూ.45 లక్షలు ఖర్చు చేసినా.. 

గత ఏడాది ప్రభుత్వం నాడు నేడు కింద ఈ పాఠశాలకు రూ.46 లక్షలు కేటాయించింది. మరుగుదొడ్ల నిర్మాణం, గదుల మరమ్మతులు, విద్యుత, తరగతి గదిలో ఫ్యాన్లు, బెంచీలు, ఆర్‌వో ప్లాంట్‌, ఫర్నీచర్‌, గ్రీన బోర్డు, పెయింటింగ్‌, కాంపౌండ్‌ వాల్‌ వంటి వాటికి ఈ నిధులు ఖర్చు చేశారు. నాడు నేడు నిధులతో అదనపు గదులు నిర్మించుకునేందుకు ప్రభు త్వం అనుమతి ఇవ్వలేదు. 

ఉపాధ్యాయులు చేసేదేమీలేక.. 

గదులు లేకపోవడంతో  విద్యార్థులను పాఠశాల ఆవరణలోని చెట్టు కింద కూర్చోబెడుతున్నారు. అంతేకాకుండా ఉపాధ్యాయుల కొరత కూడా తీవ్రంగా ఉంది. నలుగురు మాత్రమే అంతమందికి పాఠాలు చెబుతున్నారు. కనీసం సబ్జెక్టులను బోధించే ఉపాధ్యాయులు లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పురపాలక అధికారులకు అదనపు గదులు నిర్మించాలని పలుమార్లు విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విన్నవించుకున్నా ఫలితం లేదు. ప్రభుత్వం స్పందించి అదనపు గదులు నిర్మించాలని వారు కోరుతున్నారు. 

 గదులు నిర్మించాలని కోరాం

మొదటి విడత నాడు నేడు కింద రూ.46 లక్షలు ఖర్చు చేసి పాఠశాలకు అన్నీ సమకూర్చుకున్నాం. ఇందులో అదనపు తరగతి గదుల నిర్మాణానికి అనుమతి ఇవ్వలేదు. గదులు నిర్మించాలని పురపాలక కమిషనర్‌, ఎస్‌ఎ్‌సఏ పీడీని కోరాము. రెండో విడతలోనూ గదులు నిర్మాణానికి నిధులు మంజూరు కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. విద్యార్థులను బయట కూర్చోబెట్టి చదివించలేక పోతున్నాం. విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. తరగతి గదులు నిర్మాణానికి అధికారులు చొరవ చూపాలి.

-  రమే్‌షనాయుడు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు

మున్సిపల్‌ కమిషనర్‌ను కోరాం

ఆరు నుంచి పదో తరగతి వరకు 765 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. మా కాలనీ సమీపంలో ఉందని ఈ పాఠశాలకు పిల్లలను పంపుతున్నాం. తగినన్ని తరగతి గదులు లేవు. తల్లిదండ్రుల సమావేశంలో గదులు నిర్మించాలని చెబుతున్నాం. మున్సిపల్‌ కమిషనర్‌ను కలిసి కోరినా పట్టించుకోలేదు. 

-   జ్యోతి, విద్యార్థి తల్లి
Read more