స్కందమాతగా జగజ్జనని

ABN , First Publish Date - 2022-10-01T05:57:36+05:30 IST

శ్రీశైలం క్షేత్రంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

స్కందమాతగా జగజ్జనని

శ్రీశైలం, సెప్టెంబరు 30: శ్రీశైలం క్షేత్రంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఐదోరోజు అమ్మవారికి ప్రాతఃకాల పూజలు, విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు, జపానుష్ఠానాలు, పారాయణాలు, చండీహోమం, పంచాక్షరీ, చండీ పారాయణం, చతుర్వేద పారాయణాలు, కుమారిపూజలు నిర్వహించారు. స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, రుద్రయాగాంగ జపాలు చేశారు. ఉత్సవాల్లో భాగంగా కుమారి పూజలు జరిపించారు. 


 స్కందమాత అలంకారంలో భ్రమరాంబాదేవి 


నవదుర్గా అలంకరణలలో ఒకటైన స్కందమాతగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. చతుర్భుజాలు కలిగి, ఒక చేతిలో స్కందుడు, మిగిలిన చేతులలో పద్మాలు, అభయముద్రలతో భక్తులను కటాక్షించింది. ఈ దేవి ఆరాధన వలన సకల కోరికలు నెరవేరడమే కాకుండా శాంతి సౌఖ్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. 


 నేడు అమ్మవారికి కాత్యాయని అలంకారం


దసరా మహోత్సవాల్లో ఆరోరోజు శనివారం భ్రమరాంబికా అమ్మవారు కాత్యాయని అలంకారంలో దర్శనం ఇస్తారు. స్వామి, అమ్మవార్లకు హంస వాహన సేవ, పుష్ప పల్లకీ సేవ నిర్వహిస్తారు. 

 

స్వామి, అమ్మవార్లకు శేషవాహనసేవ

దసరా వేడుకల్లో భాగమైన వాహనసేవలలో శుక్రవారం స్వామి, అమ్మవార్లను శేషవాహనంపై ఆశీనులనుజేసి సుగంధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో ఎస్‌. లవన్న, ఆలయ అధికారులు, ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు పాల్గొన్నారు. వర్షం కారణంగా గ్రామోత్సవాన్ని నిలిపివేశారు. 


పట్టు వస్త్రాల సమర్పణ


 దసరా మహోత్సవాల సందర్భంగా శుక్రవారం దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్‌ లవన్న దంపతులు స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యుడు విరూపాక్షయ్యస్వామి, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. హరిదాసు పాల్గొన్నారు. 


నిత్య కళావేదికపై నృత్య శోభ


శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలను పురస్కరించుకుని దేవస్థానం శుక్రవారం సాయంత్రం నిత్యకళారాధన వేదిక వద్ద సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించింది. ఇందులో ఏలూరుకు చెందిన ఎ.ఉషా, జడ్చర్ల బాదేపల్లికి చెందిన సాయికృప, కూచిపూడి బింధు మాధవి బృందాలు నృత్యం చేశాయి. 

Read more