మద్యానికి హద్దు ఏదీ?

ABN , First Publish Date - 2022-09-27T04:42:48+05:30 IST

తుంగభద్ర నది తీర ప్రాంతాల్లోని పల్లెల ద్వారా కర్ణాటక మద్యాన్ని ఇక్కడకు చేరవేస్తున్నారు.

మద్యానికి  హద్దు ఏదీ?
ఎమ్మిగనూరు సెబ్‌ సీఐ జయరామ్‌ నాయుడు ఆద్వర్యంలో జరిపిన దాడుల్లో పట్టుబడ్డ మద్యం, కారు

  1. కర్ణాటక మద్యం జోరుగా అక్రమ రవాణా
  2. యథేచ్ఛగా విక్రయం
  3. కొందరికి అధికార పార్టీ అండదండలు
  4. మత్తులో సరిహద్దు పల్లెలు

పల్లెల్లో కర్ణాటక మద్యం ఏరులైపారుతోంది. అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోంది. నిత్యం రూ.లక్షల విలువైన మద్యం సరిహద్దులు దాటుతున్నా పోలీసులు అక్రమ రవాణాను అరికట్టలేకపోతున్నారు. ఓ వైపు నిందితులు పోలీసులకు దొరుకుతున్నా వెరవడం లేదు. కొందరికి అధికార పార్టీ అండదండలు తోడు కావడంతో వారి వ్యాపారం మూడు పెగ్గులు.. ఆరు గ్లాసులు అన్నట్టుగా సాగుతోంది. ఒక్కో గ్రామంలో పది మంది దాకా ఇదే వృత్తిగా ముందుకు సాగుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అత్యధికంగా కోసిగి మండలంలో అక్రమ రవాణ జరుగుతున్నా కేసులు మాత్రం నామమాత్రంగా నమోదవుతుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.



ఎమ్మిగనూరు, సెప్టెంబరు 26: తుంగభద్ర నది తీర ప్రాంతాల్లోని పల్లెల ద్వారా కర్ణాటక మద్యాన్ని ఇక్కడకు చేరవేస్తున్నారు. ఎక్కువగా ఎమ్మిగనూరు, మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాల్లోని పల్లెలకు తరలిస్తున్నారు. తరచూ సెబ్‌ పోలీసులు దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నా అక్రమార్కులు ఏ మాత్రం భయపడటం లేదు. ఒక్కో గ్రామంలో ఏకంగా ముగ్గురు నుంచి పది మంది వరకు కర్ణాటక మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం. కొత్త కొత్త పద్ధతుల్లో కర్ణాటక మద్యాన్ని తరలించి రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. కొంతమంది మద్యం అక్రమ రవాణకు ఏకంగా ఖరీదైన కార్లను వినియోగిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 


రాత్రివేళల్లో పుట్టీల ద్వారా..

కడిదొడ్డి గ్రామ సమీపంలోని తుంగభద్ర నది నుంచి పుట్టిల్లో రాత్రివేళల్లో కర్ణాటక మద్యాన్ని రవాణ చేస్తున్నారు. అగసనూరు దగ్గర నదిలో జాలర్ల పేరుతో పుట్టిలలో తరలిస్తున్నట్టు సమాచారం. మద్యం నదిని దాటిస్తున్నందుకు స్థానికంగా ఉన్న వారికి కమీషన ఇస్తున్నట్టు సమాచారం. కోసిగి మండలంలోని అటవీ ప్రాంతం గుండా చిన్నభూంపల్లి గ్రామానికి తరలించి మండలంలోని ఆయా గ్రామాలకు తరలిస్తున్నారు. ఇక్కడి నుంచే మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు వరకు తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

అత్యధికంగా కోసిగి మండల పరిధిలో...

అత్యధికంగా కోసిగి మండల పరిధిలో అక్రమ రవాణా జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇక్కడ మాత్రం కేసులు నామమాత్రంగా నమోదు అవుతున్నాయని విమర్శలు ఉన్నాయి. దీన్నిబట్టి దాడులు ఏమేరకు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. స్థానిక పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడంతోనే కర్ణాటక మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి ముఖ్యంగా రవాణ చేసే వ్యక్తులకు, విక్రయదారులకు అధికార పార్టీకి చెందిన కొంతమంది నేతలు పరోక్షంగా సహకరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన సెబ్‌ కానిస్టేబుల్‌ను ఢీకొట్టి తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఘటనలు కూడా ఉన్నాయి. కోసిగి మండలంలోని ఒక్కో గ్రామంలో దాదాపు ఐదు నుంచి పది మంది అక్రమంగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్క కోసిగిలోనే 50 మందికిపైగా అమ్మకాలు సాగిస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు.

తరలింపు ఇలా..

ఫ మంత్రాలయం మండలంలోకి కర్ణాటలోని గుండ్రేవుల, చిన్న మంచాల, గిలకసూగూరు క్యాంపు, హనుమాపురం గ్రామాల్లో స్టాక్‌ పెట్టుకుంటారు. నీరు ఉన్న సమయంలో అరగోలులో, నీరు లేని సమయంలో కూలీలను పెట్టి నది దాటిస్తారు. బాక్సులను నది దాటిస్తే దాదాపు రూ.600 వరకు ఇస్తున్నారు. రోజుకు వందల సంఖ్యలో మద్యం బాక్సులు తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక గ్రామంలో ముగ్గురు, నలుగురు వరకు అమ్మకాలు సాగిస్తున్నారు. 

ఫ కర్ణాటకలోని మురణి, నాగరహాళ్లు, బుడదనహాళ్‌ గ్రామాల నుంచి నదీతీరం ద్వారా కౌతాళం మండలంలోని గ్రామాల్లోకి కర్ణాటక మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లో ముగ్గురు, నలుగురు మద్యం అమ్మకాలు చేస్తున్నారని సమాచారం. 

ఫ నదితీర మండలమైన నందవరంలోకి కర్ణాటకలోని తలమారి, తెలంగాణలోని ఆయా గ్రామాల నుంచి కర్ణాటక మద్యం అక్రమంగా రవాణా చేస్తున్నారు. నందవరం మండలంలోని నదితీర గ్రామమైన గంగవరం, నాగలదిన్నె, రాయచోటి గ్రామాల మీదుగా మండలంలోకి తరలిస్తున్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లో కర్ణాటక మద్యం నాలుగు నుంచి ఆరుగురు వరకు అమ్మకాలు సాగించి సొమ్ము చేసుకుంటున్నారు. 

ఎమ్మిగనూరు పట్టణంలో సైతం..

ఎమ్మిగనూరు పట్టణంలో సైతం కర్ణాటక మద్యం అమ్మకాలు గుట్టుగా సాగుతున్నాయి. ప్రధానంగా స్లమ్‌ ఏరియాల్లో ఎక్కువగా అమ్మకాలు సాగిస్తున్నారు. ఎంఎస్‌ నగర్‌, ఎస్సీ కాలనీ శివారు, వెంకటాపురం కాలనీ, పెద్దబావి, లక్ష్మపేట, సంజీవయ్య నగర్‌, ఎల్లమ్మ బీడుతో పాటు ఎద్దుల మార్కెట్‌, గోనేగండ్ల సర్కిల్‌ ప్రాంతంలో కర్ణాటక మదాన్ని కొంతమంది విక్రయిస్తున్నారు. అలాగే ఎమ్మిగనూరు మండలంలోని ప్రతి గ్రామంలో నలుగురైదుగురు విక్రయాలు చేస్తూ అక్రమార్జన సాగిస్తున్నారు. మండల కేంద్రమైన గోనెగండ్లలో దాదాపు 15 మంది దాకా అమ్మకాలు సాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో ఊరూరా కర్ణాటక మద్యం విక్రయాలు సాగుతున్నాయి. 

ఫ సెబ్‌ దాడులు చేస్తున్నా..

రెండు నియోజకవర్గాల్లో సెబ్‌ పోలీసులు నిత్యం అక్రమ దాడులు చేస్తున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా దాడులు చేస్తున్నా మద్యం అక్రమ రవాణ మాత్రం ఆగడం లేదు. పదుల సంఖ్యలో కేసులు నమోదు చేస్తున్నా వెరవడం లేదు. ముఖ్యంగా సెబ్‌ శాఖను సిబ్బంది కొరత వేధిస్తోంది. దీంతో ఒక చోట దాడులు చేసే లోపు మరోచోట అక్రమ రవాణా సాగిస్తున్నారు.

ఫ అఽధికార పార్టీ అండదండలు

గ్రామాల్లో అక్రమంగా మద్యం అమ్మకాలు సాగిస్తున్న వారికి అధికార పార్టీ నాయకుల సహకారం పుష్కలంగా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా మంత్రాలయం పరిధిలోని ఆయా మండలాల్లో అక్రమార్కులకు అధికార పార్టీ నేతల అండదండలు ఉన్నట్టు తెలుస్తోంది. అక్రమ రవాణాను, గ్రామాల్లో మద్యం అమ్మకాలను అడ్డుకున్న అధికారులపై ఒత్తిడి తెచ్చి అటువైపు వెళ్లకుండా చేస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. 

 కేసుల నమోదు ఇలా..

ఫ ఎమ్మిగనూరు సెబ్‌ స్టేషన పరిధిలో..

ఎమ్మిగనూరు సెబ్‌ స్టేషన పరిధిలో ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు నెల చివరి వరకు 12465 బెల్లం ఊటలు ధ్వంసం చేసి 39 బెల్లం ఊటల కేసు నమోదు చేశారు. అలాగే  75 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకొని 14 సారా కేసులు నమోదు చేసి 14 మంది నిందితులపై కేసులు నమెదు చేశారు. అంతేగాక 139 అక్రమ మద్యం కేసులు నమోదు చేసి 160 మంది నిందితులను అరెస్టు చేసి 3102 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఐదు కార్లు, 22 ద్విచక్ర వాహనాలు సీజ్‌ చేశారు. 

ఫ కోసిగి సెబ్‌స్టేషన పరిధిలో.. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో 37 కేసులు నమోదు చేసి 38 మందిని అరెస్టు చేశారు. 3300 టెట్రా పాకెట్లు, మూడు ద్విచక్ర వాహనాలు సీజ్‌ చేశారు.

ముమ్మరంగా దాడులు నిర్వహిస్తున్నాం -జయరామ్‌ నాయుడు, సీఐ, సబ్‌, ఎమ్మిగనూరు 

సెబ్‌ స్టేషన పరిధిలో మద్యం అక్రమ రవాణాపై నిత్యం దాడులు చేస్తున్నాం. ఎప్పటికప్పుడు కేసులు నమోదు చేస్తున్నాం. మాకున్న సమాచారం మేరకు రాత్రి పగలు అన్న తేడా లేకుండా కర్ణాటక నుంచి మద్యం రవాణా చేసే వారిపై దాడులు చేసి అరెస్టు చేస్తున్నాం. గ్రామాల్లో కర్ణాటక మద్యం విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తున్నారు.

 కేసులు నమోదు చేస్తున్నాం - సృజన బాబు, సీఐ, సెబ్‌ స్టేషన, కోసిగి 

మా స్టేషన పరిధిలో అక్రమంగా కర్ణాటక మద్యం అమ్మకాలు సాగిస్తున్న వారిపై ఎప్పటికప్పుడు దాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నాం. కర్ణాటక నుంచి మద్యం అక్రమంగా రవాణా చేస్తే సహించేది లేదు. 

Updated Date - 2022-09-27T04:42:48+05:30 IST