కల సాకారమైన వేళ

ABN , First Publish Date - 2022-04-05T05:40:28+05:30 IST

దశాబ్దాల కల సాకారమైంది.

కల సాకారమైన వేళ

కొత్త జిల్లాగా నంద్యాల ఆవిర్భావం

అట్టహాసంగా కలెక్టరేట్‌, ఎస్పీ, జిల్లా కార్యాలయాల ప్రారంభోత్సవం

బాధ్యతలు చేపట్టిన జిల్లా అధికారులు 


నంద్యాల, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): దశాబ్దాల కల సాకారమైంది.  ప్రత్యేక జిల్లా కోసం ఎదురుచూస్తున్న నంద్యాల ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కొత్త జిల్లాను సోమవారం ప్రారంభించారు. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఎలకా్ట్రనిక్‌ బిల్డింగ్‌లో ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టరేట్‌ను అందంగా ముస్తాబు చేశారు. ప్రారంభోత్సవానికి రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ప్రభుత్వ విప్‌ గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కాటసాని రామిరెడ్డి, తొగురు ఆర్థర్‌, గంగుల బిజేంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు చల్లా భగీరథరెడ్డి, కొత్త కలెక్టర్‌ మన్‌జిర్‌ జిలాని సామూన్‌, జేసీ నారపురెడ్డి మౌర్య, ఎస్పీ రఘువీరారెడ్డి, డీఆర్వో పుల్లయ్య, ఆర్డీవో శ్రీనివాస్‌, వివిధ ప్రభుత్వ శాఖల  జిల్లా అఽధికారులు పాల్గొన్నారు. వర్చువల్‌ విధానంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కొత్త జిల్లాను ప్రారంభించిన వెంటనే జిల్లా మంత్రి బుగ్గన కాన్ఫరెన్స్‌ హాల్‌లో ప్రసంగించారు. ప్రభుత్వ పాలనను ప్రజల చెంతకు చేర్చే ప్రఽధాన ఉద్దేశంతో సీఎం జగన్‌ కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారని, పరిపాలన వికేంద్రీకరణతో ప్రజలకు సంక్షేమ పథకాలు మరింతగా చేరువ అవుతాయన్నారు. పాదయాత్రలో మాట ఇచ్చిన మాట ప్రకారం సీఎం ప్రతి పార్లమెంటు నియోజకవర్గ కేంద్ర పరిధిలో కొత్త జిల్లాను ఏర్పాటు చేశారని అన్నారు.  ఆ తర్వాత  కలెక్టర్‌ మనజిర్‌ జిలాని సామూన్‌ మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటైన నంద్యాల జిల్లాపై ప్రత్యేకంగా దృష్టి సారించి అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేసి, మెరుగైన సేవలు అందిస్తామని అన్నారు. జిల్లా, మండల స్థాయి అధికారులు సమన్వయంతో నంద్యాల జిల్లా అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల సాధనలో నిమగ్నమైతే అభివృద్ధి వేగంగా జరగుతుందన్నారు. నూతనంగా ఏర్పడిన జిల్లాలో పనులు అధికంగా ఉంటాయని, అలసత్వం లేకుండా పనులు పూర్తి చేసే బాధ్యతను అధికారులు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాఽధాన్యతనిస్తున్న గృహ నిర్మాణాలు, స్పందన అర్జీల పరిష్కారంలో ఎలాంటి అశ్రద్ధ చూపకూడదన్నారు. ఈ నెల 8వ తేదిన నంద్యాల జిల్లా పర్యటనకు సీఎం వచ్చే అవకాశం ఉందని, అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం జేసీ నారపురెడ్డి మౌర్య మాట్లాడుతూ నంద్యాల జిల్లా అభివృద్ధిలో అధికారులందరూ పరస్పర భాగస్వామ్యంతో పనిచేయాలని, జిల్లాలో గృహనిర్మాణాలు సంతృప్తికరంగా ఉన్నాయని, మిగతా అన్ని పనుల్లో కూడా ఇదే రకమైన శ్రద్ధ వహించాలని అన్నారు.


 ఎస్పీ కార్యాలయం ప్రారంభం 


నంద్యాల (నూనెపల్లె), ఏప్రిల్‌ 4 : కొత్తగా ఏర్పడ్డ నంద్యాల జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, కలెక్టర్‌ డాక్టర్‌ మనజీర్‌ జిలాని సామూన్‌, ఎస్పీ రఘువీరారెడ్డి, ఎమ్మెల్యేలు శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, కాటసాని రామిరెడ్డి, ఆర్థర్‌, కాటసాని రాంభూపాల్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు. కలెక్టరేట్‌ కార్యాలయ ప్రారంభోత్సవం అనంతరం వారు నేరుగా  బొమ్మలసత్రంలోని ఎస్పీ కార్యాలయానికి చేరుకొని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. రిబ్బన్‌ కట్‌ చేసి కార్యాలయ భవనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్క్‌ఫెడ్‌ చైౖర్మన్‌ పీపీ నాగిరెడ్డి, వైసీపీ నాయకులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. 


ప్రొటోకాల్‌ రగడ


నంద్యాల జిల్లా ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యేలు

శిలాఫలకంపై తమ పేర్లు లేవంటూ కలెక్టర్‌ను నిలదీత


నంద్యాల, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): నూతన జిల్లా ప్రారంభోత్సవం సందర్భంగా ప్రొటోకాల్‌ పాటించలేదంటూ నంద్యాల జిల్లా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శిలాఫలకంపై తమ పేర్లు ఎందుకు లేవంటూ కలెక్టర్‌ మన్‌జిర్‌ జిలాని సామూన్‌ను నిలదీశారు. సోమవారం నంద్యాల కొత్త జిల్లా కార్యాలయాల ప్రారంభోత్సవం జరిగింది. మొదట వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం జగన్‌ జిల్లా కలెక్టరేట్‌ ప్రారంభించి ఉపన్యసించారు. అనంతరం శిలా ఫలకాన్ని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆవిష్కరించారు. అందులో ఉన్న పేర్లను చూడగానే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఖంగుతిన్నారు. కొత్త జిల్లా పరిధిలో ఉండే ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలలో ఐదుగురి పేర్లు లేకపోవడం ప్రొటోకాల్‌ రగడకు దారి తీసింది. శిలాఫలకంపై కలెక్టరేట్‌ ప్రారంభకులుగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, సమావేశానికి గౌరవ అధ్యక్షుడిగా మంత్రి బుగ్గన, సభాధ్యక్షుడిగా నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌, ఎమ్మెల్సీలు పేర్లను పొందుపరిచారు. ప్రొటోకాల్‌ ప్రకారం ఎమ్మెల్యేల పేర్లు ఉండాలి. సంబంధం లేని నాయకుల పేర్లను చేర్చారు. నంద్యాల జిల్లా పరిధిలోనికి వచ్చే శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్‌ పేర్లను శిలాఫలకంలో చేర్చలేదు. దీంతో ఈ ఎమ్మెల్యేలు కలెక్టర్‌ మన్‌జిర్‌ జిలాని సామూన్‌ను నిలదీశారు. తమ పేర్లు లేకుండా ఎవరెవరి పేర్లో  చేర్చడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు శిలాఫలకాన్ని తయారు చేయించిన వారెవరని మండిపడ్డారు. కలెక్టర్‌తో నిష్టూరంగా మాట్లాడిన ఎమ్మెల్యేలు అక్కడి నుంచి ఎస్పీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వెళ్లారు అక్కడి శిలాఫలకం మీద కూడా ఎమ్మెల్యేల పేర్లు గల్లంతయ్యాయి. 


ఫోన్‌ చేస్తే చాలు


మేమే వచ్చి సమస్య పరిష్కరిస్తాం 

ఎస్పీ రఘువీరారెడ్డి 


నంద్యాల (నూనెపల్లె), ఏప్రిల్‌ 4 : ప్రజలు తమ సమస్యలను పోలీసులకు ఫోన్‌చేసి తెలిపితే తామే అక్కడి వెళ్లి పరిష్కరిస్తామని నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి పేర్కొన్నారు. నంద్యాల జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రఘువీరారెడ్డి సోమవారం విలేఖరులతో మాట్లాడారు. నూతనంగా ఏర్పడిన నంద్యాల జిల్లాకు మొదటి ఎస్పీగా తాను రావడం ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా విధులు నిర్వహిస్తానన్నారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు వెళతామన్నారు. మహిళలు, బాల బాలికలు, మైనార్టీలు, అణగారిన వర్గాలకు అందరితో సమానంగా రక్షణ కల్పించేలా పనిచేస్తానని తెలిపారు. ప్రజలకు 24గంటలు అందుబాటులో ఉంటానని, ఏ సమయంలోనైనా ఫోన్‌చేసి సమస్యను తన దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పెద్దపీట వేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఏఎస్పీ చిదానందరెడ్డి, సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 


బాధ్యతలు చేపట్టిన జిల్లా యంత్రాంగం


నంద్యాల, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): కొత్త జిల్లాగా ఏర్పడ్డ నంద్యాలలో వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు సోమవారం బాధ్యతలు చేపట్టారు. జిల్లాకు తొలి కలెక్టర్‌గా డా.మన్‌జిర్‌ జిలాని సామూన్‌, ఎస్పీగా రఘువీరారెడ్డి, జేసీగా నారపురెడ్డి మౌర్య తమకు కేటాయించిన చాంబర్లలో కొలువుదీరి బాధ్యతలు చేపడుతున్నట్లు సంతకాలు చేశారు. జిల్లాను అన్ని విధాలుగా ముందుకు తీసుకువెళ్లేలా కలిసికట్టుగా పనిచేయాలని, శాంతిభద్రతలు పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని, జిల్లాను అభివృద్థి చేసేందుకు అందరితో సమన్వయం చేసుకుంటూ పాలన కొనసాగిస్తామని కలెక్టర్‌, ఎస్పీ, జేసీ తెలిపారు. వీరితో పాటు డీఆర్వోగా పుల్లయ్య, ఆర్డీవోగా శ్రీనివాస్‌, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారిగా డా.పి.రమణయ్య, డ్వామా, డీఆర్‌డీఏ, ఐసీడీఎస్‌, అర్‌అండ్‌బీ, ట్రాన్స్‌కో, డీపీవో, ఆర్‌డబ్ల్యూఎస్‌, కార్మికశాఖ, పరిశ్రమల శాఖ, హార్టికల్చర్‌, టూరిజం, సెరికల్చర్‌, మార్కెటింగ తదితర శాఖల జిల్లా అధికారులు బాధ్యతలు చేపట్టారు.Read more