జాగా కనిపిస్తే పాగా

ABN , First Publish Date - 2022-12-12T00:06:11+05:30 IST

ప్రభుత్వ స్థలాలు కనిపిస్తే చాలు పాగా వేస్తున్నారు. వాగులు, వంకలు, చెరువులు, రస్తాలను సైతం ఆక్రమించేస్తున్నారు.

   జాగా కనిపిస్తే పాగా
ప్రభుత్వ స్థలంలో వెంచర్లు వేసేందుకు సిద్ధంగా ఉన్న భూమి

వాగులు, వంకలనూ వదలడం లేదు

పంచాయతీ స్థలాలు ఆక్రమించి అద్దెకు..

అక్రమార్కులపై చర్యలు తీసుకోని అధికారులు

మద్దికెర, డిసెంబరు 11: ప్రభుత్వ స్థలాలు కనిపిస్తే చాలు పాగా వేస్తున్నారు. వాగులు, వంకలు, చెరువులు, రస్తాలను సైతం ఆక్రమించేస్తున్నారు. మద్దికెర జిల్లా పరిషత్‌ బాలుర, బాలికల పాఠశాలల సమీపాల్లో పంచాయతీ స్థలాలు ఉన్నాయి. వాటిని కొందరు ఆక్రమించి అద్దెకు ఇస్తున్నా అధికారులు నోరు మెదపడం లేదు. కాలువపైన సైతం బంకులు వేస్తున్నారు. అలాగే మద్దికెర శివారులోని 43ఏ, 42/1 సర్వే నెంబర్లలో 1.17 ఎకరాల పోరంబోకు స్థలం ఉంది. ఈ భూమిని అధికారులకు కొందరు పెద్దఎత్తున మామూళ్లు ఇచ్చి ఆన్‌లైన్‌లో ఎక్కించుకున్నారు. గ్రామస్థులు కలెక్టర్‌ దృష్టికి కూడా తీసుకెళ్లినా చర్యలు శూన్యం. సాయినగర్‌ సమీపంలోగల రస్తాలో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం జోరందుకోవడంతో ఇక్కడ కూడా ఆక్రమణలు పెరిగిపోయాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి యథేచ్ఛగా అమ్ముతున్నా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. మద్దమ్మకుంట చెరువు సైతం ఆక్రమణకు గురవుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. ఇప్పటికైనా ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయంపై ఇనచార్జి తహసీల్దార్‌ నాగరాజు, పంచాయతీ కార్యదర్శి శ్రీహరిని వివరణ కోరగా ప్రభుత్వ స్థలాలు ఆక్రమించడం చట్టరీత్యా నేరమని, వెంటనే నోటీసులు ఇస్తామని చెప్పారు.

Updated Date - 2022-12-12T00:06:12+05:30 IST