గుండె పదిలమేనా?

ABN , First Publish Date - 2022-02-23T06:10:48+05:30 IST

ఒకప్పుడు గుండె వ్యాధులు అరుదు. పెద్ద వయసు వాళ్లకే వస్తాయని అనుకొనేవారు.

గుండె పదిలమేనా?

చిన్న వయస్సులోనే సమస్యలు
జాగ్రత్తలు అవసరమంటున్న వైద్యులు

కర్నూలు(హాస్పిటల్‌), ఫిబ్రవరి 22: ఒకప్పుడు గుండె వ్యాధులు అరుదు. పెద్ద వయసు వాళ్లకే వస్తాయని అనుకొనేవారు. ఇప్పుడు యువకులకూ గుండె జబ్బులు వస్తున్నాయి. నాలుగు పదుల వయస్సులోనే గుండె పోటుతో చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. సోమవారం పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అకస్మికంగా గుండెపోటుతో హైదరాబాదులో మరణించారు. గత ఏడాది అక్టోబరు 29న 45 ఏళ్ల కన్నడ సూపర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌ కుమార్‌   గుండె పోటుతో కన్నుమూశారు.  బాలీవుడ్‌ నటుడు సిద్ధ్దార్థ్‌ శుక్లా 40 ఏళ్ల వయస్సులో గుండె పోటుతో మరణించారు. చాలా ధృఢంగా, ఆరోగ్యంగా కనిపించేవాళ్లు కూడా ఇలా ఒక్కసారిగా కుప్పకూలడం ఆందోళనకు గురి చేస్తోంది.

చాగలమర్రికి చెందిన రామయ్యకు ఉన్నట్టుండిచెమటలు పట్టాయి. వాంతికి వచ్చినట్లయింది. ఛాతీ పట్టేసింది. ఎడమ చేయిలాగడం మొదలైంది.
సురేష్‌ పత్తికొండలో ఉంటాడు. మిత్రులతో కలిసి పార్టీకి వెళ్లి వచ్చి పడుకున్నాడు. రాత్రి కడుపుమంట, అజీర్తి, చెమటలు పట్టడం, ఊపిరి అందక ఇబ్బంది పడ్డాడు.
కర్నూలు చెందిన రాజేంద్ర పని ఒత్తిడిలో ఉండి రాత్రి లేటుగా వచ్చి భోజనం చేస్తుంటే కడుపునొప్పి వచ్చింది. ఎడమ దవడ మీద నొప్పి వచ్చి ఛాతీ వెనుక భాగంలో మంటగా ఉన్నట్లు బాధపడ్డాడు.    

ఇవన్నీ గుండె నొప్పికి సంబంధించిన వివిధ రకాల సిగ్నల్స్‌. గుండెకు మూడు రక్తనాళాలు రక్తం సరఫరా చేస్తాయి. వాటిని కోరోనరీ ఆర్టరీలు అంటారు. కుడివైపు ఒకటి, ఎడమవైపు రెండు ఉంటాయి. వీటిలో కొవ్వు చేరుతూ ఉంటుంది. దాన్ని ప్లాక్‌ అంటారు. ఇది 60 శాతం నుంచి 90 శాతం అయితే.. నొప్పి వస్తుంది. దానిని అంజైనా గుండె నొప్పి అంటారు. ఇది 15 నిమిషాల్లో తగ్గుతుంది. సార్బిట్రేట్‌ టాబ్లెట్‌ నాలుక కింద పెట్టుకుంటే తగ్గిపోతుంది.

ఆకస్మిక గుండె పోటుతో మరణాలు

ఇటీవల వ్యాయామం చేసేవారు, జిమ్‌కు వెళ్లే వారు, ధృఢంగా కనిపించే వారూ ఒక్కసారిగా కుప్పకూలి మరణిస్తున్నారు. ఇలా చనిపోయే వారికి నిర్వహించే అటాప్సిలో 90 శాతం మందికి మూడు నాళాల్లోనూ బ్లాక్స్‌ ఉంటున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. అతిగా వ్యాయామం చేయడం వల్లే ఇలా జరుగుతోందనేది అపోహ మాత్రమేనని చెబుతున్నారు. వాళ్లకు అంతకుముందే సమస్య ఉన్నా దాన్ని గుర్తించకపోవడం వల్లే ఇలా ఆకస్మాత్తుగా మరణాలు సంభవిస్తున్నాయి. వారికి అంతర్గతంగా ఉన్న సమస్యల వల్ల వ్యాయామశాలలో ఉన్నప్పుడే కాదు.. ఎక్కడున్నా గుండెనొప్పి వస్తుందని అంటున్నారు. రక్తపోటు, మధుమేహం, ధూమపానం, అతిగా మద్యం తాగడం, ఊబకాయం వారికి గుండెపోటు వస్తుంది. గుండెపోటు వచ్చేవారిలో నూటికి 50 మంది ఇవేమీ లేకుండా లోరిస్క్‌ జోన్‌లో ఉన్నారు.

హార్ట్‌ అటాక్‌ వస్తే.. నిపుణుల సూచనలు

హార్ట్‌ అటాక్‌ వస్తే దగ్గరలో ఐసీయూ ఉండే ఆసుపత్రికి వెళ్లాలి. ముందు ఆస్పిరిన్‌ మాత్రలు రెండు నమిలి ఆసుపత్రికి పోయి ఈసీజీ పరీక్ష చేయించాలి. బీటీ ఎలివేషన్‌ హార్ట్‌ అటాక్‌ ఉంటే.. స్ర్టెప్టోక్టినేంజ్‌ని ఇంజక్షన్‌ వేస్తే క్లాట్‌ కరిగి సాధారణంగా మారుతుంది. దీన్ని థ్రాంబోలైసిస్‌ అంటారు. విజయవాడ, కర్నూలు వంటి క్యాథ్‌ల్యాబ్‌ ఉన్న చోట గంటలోనే ఆసుపత్రికి పోతే వెంటనే అంజియోగ్రాం చేసి స్టంట్‌ వేస్తారు.

జాగ్రత్తలు ఇలా..

ఆధునిక జీవనశైలి గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నది. ఒకప్పుడు 60-70 ఏళ్ల వయస్సులో కనిపించే గుండె జబ్బులు ప్రస్తుతం 25-35 ఏళ్ల వారి మీద కూడా దాడి చేస్తున్నాయి.
కొవ్వు శాతం 130 మి.గ్రా ఉండేలా చూసుకోవాలి. లివర్‌లో కొవ్వు తగ్గించుకోవాలి.
40 సంవత్సరాలు దాటిన తర్వాత గుండె పరీక్షలు చేయించుకోవాలి.
ధూమపానాన్ని మానివేయాలి. గుండెపోటు వచ్చే వారిలో స్మోకింగ్‌ తాగేవారు అధికంగా ఉన్నారు.
ఆహారంలో యాంటి ఆక్సిడెంట్లు, కూరగాయలు, పండ్లు తప్పనిసరిగా ఉండాలి.
ఒత్తిళ్లు, సమస్యలను కనీసం 50 శాతం తగ్గించాలి.
సాధారణంగా బీపీ 120/80గా ఉండాలి. బీపీ 139/90 ఉంటే ఒత్తిడి తీవ్రంగా ఉన్నట్లే.శారీరక, మానసిక ఒత్తిడిని ధ్యానం ద్వారా తగ్గించుకోవచ్చు. ఆహారంలో ఉప్పు తక్కువ తీసుకోవాలి.
ప్రతిరోజూ కనీసం అరగంట పాటు తేలికపాటి వ్యాయామం చేయాలి. నడక తప్పనిసరి.

జిల్లాలో పరిస్థితి

కర్నూలు సర్వజన వైద్యశాల కార్డియాలజీ విభాగానికి ప్రతి మంగళ, శుక్రవారాల్లో, కార్డియోథోరాసిక్‌ విభాగానికి సోమ, గురువారాల్లో ఓపీ ఉంటుంది. ప్రతి ఓపీకి ఈ రెండు విభాగాల్లో 300 మంది వస్తుంటారు. ఆసుపత్రిలో ప్రతిరోజూ 300 ఈసీజీలు, 60 టుడీ ఇకో, నెలకు 50 స్టంట్లు, 100 అంజియోగ్రామ్‌లు, నెలకు 15 గుండె ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఇక నంద్యాలలో ప్రతిరోజూ 50 మంది గుండె సమస్యలతో ఓపీకి వెళ్తున్నారు. జిల్లా మొత్తంగా ప్రతిరోజూ 60 మందికి గుండె శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు.

ముందుగా గ్రహించాలి

చాలామంది తమ ఆరోగ్యం బాగుందని అనుకుంటారు. 35 నుంచి 40 ఏళ్లు దాటిన తర్వాత కచ్చితంగా పరీక్షలు చేయించుకోవాలి. ప్రతి ఒక్కరూ రెండు ఆస్పిరిన్‌ మాత్రలు దగ్గర పెట్టుకోవాలి. గుండె నొప్పి లక్షణాలు కనబడితే.. ఈ మాత్రలు పొడి చేసి నీళ్లలో వేసి తాగాలి. వెంటనే 108లో ఆసుపత్రికి తీసుకెళ్లాలి. సీపీఆర్‌పై ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలో అవగాహన శిక్షణ ఇప్పించాలి. ఈ అవగాహన ప్రతి ఒక్కరికీ ఉండాలి.

 - డా.సి.ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీసూపరింటెండెంట్‌, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి

Read more