లీజ్‌కు ససేమిరా

ABN , First Publish Date - 2022-10-13T05:17:29+05:30 IST

ఎర్రగుడికి ఆనుకొని ఉన్న కొండను లీజ్‌కు ఇవ్వడానికి ఆ మూడు గ్రామాల ప్రజలు ఒప్పుకోలేదు.

లీజ్‌కు ససేమిరా
పోలీసుల మధ్య ప్రజాభిప్రాయ సేకరణ

  1.  అనుమతి కోసం ప్రజాభిప్రాయ సేకరణ
  2.  వ్యతిరేకించిన ఆ మూడు గ్రామాల ప్రజలు


నంద్యాల, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి)/బనగానపల్లె: ఎర్రగుడికి ఆనుకొని ఉన్న కొండను లీజ్‌కు ఇవ్వడానికి ఆ మూడు గ్రామాల ప్రజలు ఒప్పుకోలేదు. కొండను జయజ్యోతి సిమెంట్‌ ఫ్యాక్టరీకి లీజ్‌కే ఇచ్చే విషయమై బనగానపల్లె మండలం యనకండ్ల సమీపంలో బుధవారం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఎర్రగుడి, యనకండ్ల, హుసేనాపురం ప్రజలు కొండను లీజ్‌కు ఇవ్వడాన్ని వ్యతిరేకిం చారు. పశుసంపదకు ఆలవాలంగా ఉన్న కొండను లీజుకు ఇస్తే తాము ఉపాధి కోల్పోతామని, ఏకంగా ఊరు విడిచి వెళ్లాల్సి వస్తుందని ఆ మూడు గ్రామాల ప్రజలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ 50 సంవత్సరాలకు సరిపోయే ముడిసరుకును అందించే ప్రాంతాన్ని కంపెనీ ఇప్పటికే లీజుకు తీసుకుందని తెలిపారు. ఆఘమేఘాల మీద ఈ కొండను లీజుకు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో అర్థం కావడం లేదన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో కలిసిమెలిసి ఉంటున్న గ్రామస్థుల మధ్యన చిచ్చు పెడుతోందని ఆరోపించారు.  లీజ్‌కు ఇచ్చే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ లీజుకు తాము అనుకూలమని, ప్రభుత్వం నుంచి లీజు వచ్చేందుకు అన్ని విధాలుగా సహకరిస్తామన్నారు. ఇన్‌చార్జి డీఆర్వో మల్లికార్జున, పర్యావరణ అధికారి మునిప్రసాద్‌, యనకండ్ల సర్పంచ్‌ గోవిందు, ఉప సర్పంచ్‌ బొబ్బల గోపాల్‌ రెడ్డి, యర్రగుడి సర్పంచ్‌ దోనపాటి లక్ష్మీదేవి పాల్గొన్నారు.


Updated Date - 2022-10-13T05:17:29+05:30 IST